ప్రతీ మనిషిలోను ఏదో ఒక గొప్పతనం ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని అంగీకరించే గొప్ప వ్యక్తిత్వం సహజంగా నూటికి పది మందిలో కూడా ఉండదు. అలాగే జరిగితే మన సమాజం సమకాలీన సమాజమయ్యేది. ఈ విషయం నాకు రాఘవరావు గారిని చూసాకా అర్థం అయింది.
నేను వర్ధమాన కధారచయితను. సుమారు ఇప్పటివరకు 14 కధలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. అయితే కధ రాయడం చాలా కష్టం. తెలుగు సాహిత్యంలో కొవ్వలి లక్ష్మి నరసింహారావుగారు వేయి నవలలు రాసిన మహోన్నత వ్యక్తి. వేయి కధలు రాసిన రచయితలు తెలుగు సాహిత్యంలో ఉన్నారేమో గాని నవలల విషయంలో కొవ్వలి వారి రికార్డును దాటిన వారు నభూతో నభవిష్యతి.
వేయి పేజీలు చదివి ఒక్క పేజీ రాయి – అని ఎక్కడో చదివిన గుర్తు. అలా చదివే అవకాశం ఈ బిజీ లైఫ్లో ఎక్కడ? అందుకే కథ రాయడం కన్నా కవిత్వం రాయడం మీద దృష్టి పెట్టాను.
కర్త, కర్మ, క్రియల్లో క్రియను ముందు పెట్టి వాక్యాలను పరచుకుంటూ వార్తా పత్రికలలో పేరు చూసుకోవాలనుకునే ప్రతీ వ్యక్తీ కవిగా మనగలుగుతున్న ఈ రోజుల్లో ఆధునిక సాహిత్యంలో వచ్చిన కవితా ప్రక్రియలు కవిత, దీర్ఘ కవిత, నానీలు, హైకూలు, వ్యంజకాలు, మొగ్గలు… ఇంకా ఎన్నెన్నో సంపుటులను సేకరించి చదివాను. ముఖ్యంగా డా.సినారె., డా.ఎం.గోపి, అద్దేపల్లి రామమోహనరావు మొదలైన వారి ఆదునిక కవితా సాహిత్యం నుంచి ప్రసిద్ధ రచయితలుగా చెలామణి అవుతున్న ఈ తరం రచయితల రచనలన్నీ చదివాను.
వేయి పేజీలు చదివాకా మాత్రమే తొలి కవితను రాసాను. పరిణితి చెందిన కవి అనిపించుకున్నాను. సమీక్షలు రాసాను. వారి స్ఫూర్తితో నేను వర్ధమాన యువ కవినై ఎన్నో సన్మానాలు పొందాను. వాటిలో వివిధ రకాల పత్రికలలో ప్రచురింపబడిన ఏబది కవితలను తీసుకుని మూడు సంవత్సరాల క్రితం తొలి కవితా సంపుటిని వెలువరించాను. సమీక్షలకు వివిధ పత్రికలలు పంపాను. కొన్ని పత్రికలలో సమీక్షలు కూడా వచ్చాయి.
ఈరోజుల్లో ఎక్కడో బాగా పేరు తెచ్చుకున్న రచయిత తప్ప మిగిలిన రచయితలందరూ అచ్చు వేయించుకున్న తమ తమ పుస్తకాలను పంచిపెట్టుకోవడమే. వాటి చిరునామాలు చూసి పత్రికలలో ఎంతో మంది తమకు ఆ పుస్తకాన్ని ఉచితంగా పంపమని కోరుతూ ఉంటారు.
సరిగ్గా అలాంటి విన్నపమే నాకు రాఘవరావు గారి దగ్గరనుంచి వచ్చింది. తాను గుంటూరులో ఉంటానని, 45 సంవత్సరాలుగా గ్రంథాలయం లేని తమ కాలనీలో తన ఇంటినే ఒక ‘గ్రంథాలయం’గా మార్చి, పుస్తకాలు కొనుక్కుని చదవలేని వారికి ఉద్యోగ విరమణ అనంతరం కూడా తనకు అందుబాటులో లభించిన పుస్తకాలను అందించడం, వృథా అయిపోతున్న విజ్ఞానాన్ని సమాజానికి పంచడం అనే సేవను చేస్తున్నాని వ్రాస్తూ…తమ గ్రంథాలయం లో ప్రతీ సంవత్సరం నిర్వహిస్తున్న కార్యకమాల వివరాల ఫోటో జిరాక్స్ కాపీలను, నా పుస్తకాన్ని పంపడానికి అవసరమైన పోస్టల్ స్టాంప్ లను జతచేసి మరీ పంపారు.
ఎన్నెన్నో కవితా సభలలో కవితా పఠనానికి నేను వెళ్లినప్పుడు ప్రముఖులందరికీ నా పుస్తకాలను పంచడం జరిగింది. నూతనంగా పరిచయం అయిన వర్ధమాన కవులకు వారి కోరికమీద ఉచితంగానే ఇవ్వడం జరిగింది. కానీ ఒక్కరినుంచి కూడా నేను నా కవితా సంపుటిపై అభిప్రాయాన్ని అందుకోలేకపోయాను. వారి స్థాయికి నా సంపుటి చేరలేదో, వారిలో ఉన్న ‘ఇగో’ నో అర్ధం కాలేదు నాకు.
ఒక స్థాయి అంటూ రచయితకు వచ్చాకా వాళ్ళల్లో వచ్చే ‘ఇగో’ సమస్యే నాకు వచ్చి నేనూ ఒక పరిణిత రచయితను అనే గర్వంతో – ఒక విధంగా చెప్పాలంటే అప్పటికింకా ఉద్యోగ ధర్మంలో ఉండటం అనే వంకతో ఆయన ఎంతో శ్రమకోర్చి పంపిన కాగితాలను నా రఫ్ పేపర్స్ మధ్యలోకి తోసేసాను.
ఇపుడు ఉద్యోగ విరమణ అయ్యాకా మళ్ళీ నా కవితా ప్రస్తానం కొనసాగించడానికి సమయం కుదరడంతో ఆ రఫ్ కాగితాలను వెతుకుతుంటే రాఘవరావుగారి దొంతర కనపడింది. విశ్రాంత సమయంలో వాటిని వివరంగా చదివాకా వారి శ్రమను గుర్తించాను. వారు పంపిన చిరునామాలోని సెల్ నెంబర్కి ఫోన్ చేసి నా పుస్తకం పంపుతున్నట్టు చెప్పాను. అంతటితో నా బాధ్యతా తీరిపోయిందనుకున్నాను.
మరో వారం రోజుల్లో వారినుంచి నా పుస్తకం తమకు చేరిందని, పంపినందులకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మరో వారం రోజుల్లో జరగబోతున్న తమ గ్రంథాలయపు 46వ వార్షికోత్సవానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తూ కరపత్రం పంపారు.
నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నాకన్నా పరిణితి చెందిన కవులు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు. నన్నే ఎన్నుకోవడంలో పరమార్థం అర్థం కాలేదు నాకు. నేను ఆ కార్యక్రమానికి హాజరవుతున్నట్లు వారికి ఫోన్ ద్వారా తెలియపరిచాను.
ఆ రోజు రానే వచ్చింది. రాఘవరావుగారు స్వయంగా తాను స్టేషనుకు వచ్చి ఎంతో సంతోషంతో నన్ను వారింటికి తీసుకు వెళ్ళారు. వారింట్లోనే భోజనం, విశ్రాంతి అనంతరం వారి గ్రంథాలయం, వారు కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాలు స్వయంగా చూపించారు. వాటిల్లో నాకు బాగా నచ్చింది ప్రతీ సాయంత్రం ఆయన స్వయంగా వృద్ధాశ్రమానికి వెళ్లి అక్కడున్న వృద్ధులకు భగవద్గీత, భారత, భాగవత, రామాయణాలు వినిపించడం.
సాయంత్రం ఆరున్నర గంటలకు సభ మొదలైంది.
గుంటూరులోని ప్రముఖ కవులలో చాలామంది ఆ సాహిత్య సభకు హాజరయ్యారు. ఒకరిద్దరు నన్ను ఆశీర్వదించారు. నా కవితా సంపుటిని సమీక్షించడానికి ఒక యువకుని వేదికమీదకు పిలిచారు. అతను వేదిక మీదకు వచ్చాడు.
“సభాసరస్వతికి నమస్కారం. నాపేరు సుయోధన. నేను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి,ఎస్,సి, ఫైనలియర్ చదువుతున్నాను. మా తల్లిదండ్రులు కోటప్పకొండలో వ్యవసాయం చేస్తూ జీవిస్తారు. మావూరిలో చదువులో ప్రథమస్థానం పొందిన నాకు సాహిత్యం అంటే తెలీదు.
నేను ఇంటర్లో ఉండగా గుంటూరు వచ్చాను. చదువుకోవడానికి పుస్తకాలు లేవు. యథాలాపంగా నా స్నేహితునితో ఈ గ్రంథాలయానికి వచ్చాను. రాఘవరావు మాస్టారి దయవల్ల ఇక్కడ ఉన్న విజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుని ఇంటర్లో 970 మార్కులు తెచ్చుకున్నాను. ఎంసెట్లో 312వ రాంక్ తెచ్చుకున్నాను. నా తల్లి తండ్రులు నన్ను ఇంజనీరింగ్లో చేర్పించేంత స్థోమత లేనివాళ్ళు. అయినా పరీక్ష ఎందుకు రాసాను అంటే.. మాస్టారి ప్రోత్సాహమే కారణం.
‘జీవితం అంటేనే పరీక్షలను ఎదుర్కోవడం. అందువల్ల నువ్వు రాయగలిగిన ప్రతీ పరీక్ష రాయి. అందుకోసం గెలిచేలా చదువు. దానిలో నువ్వు చేరక పోవచ్చు. కానీ నీ విజ్ఞానం పెరుగుతుంది. మనిషి ఎంత పెద్ద వుద్యోగం సంపాదించాడు అన్నది ముఖ్యం కాదు. ఎంత విజ్ఞానం సంపాదించాడు అన్నదే అతని స్థాయిని నిర్ణయిస్తుంది’ అన్న వారి ప్రోత్సాహమే నాకు సాహిత్యం పట్ల అభిరుచి కలిగేలా చేసింది.
ఈనాటి ఈ సాహిత్యాభిరుచి ఇప్పుడున్న రచయితలతోనే ఆగిపోకూడదు. ఆయా రచయితల వారసులు తయారు కావాలి. నేను సంపాదించిన విజ్ఞానాన్ని నా సాహిత్యాభిలాషను నా తరువాత తరం విద్యార్ధులకు అందజేయడానికే నేను ఉపాధ్యాయ వృత్తిలో చేరాలని నిర్ణయించుకున్నాను. నేను మాట్లాడిన ఈ విషయాలన్నీ నావి కాదు ఈ గ్రంథాలయానివి. దాని వ్యవస్థాపకులు అయిన శ్రీ రాఘవరావు మాస్టారి మార్గదర్శకత్వం అని సవినయంగా తెలియచేసుకుంటూ… ఇపుడు ఈనాటి సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉదయశంకర్ గారి విరచిత కవితా సంపుటిని పరిచయం చేస్తాను.
మనం ఒక పుస్తకం చదువుతాం. దాన్ని రచించిన రచయితను ఒకసారి చూడాలనిపిస్తుంది. అలా వారి దర్శన భాగ్యం లభించడమే కాకుండా వారు ఏ ఉద్దేశ్యంతో ఈ కవితా సంపుటిని రచించారో తెలుసుకునే వీలు ఉంటుంది. అది సమాజానికి ఎంత ఉపయుక్తమో తెలుస్తుంది. వారిని స్పూర్తిగా తీసుకునే వారు ఒక్కరున్నా సాహిత్యం తరువాతి తరాలకు అందుతుంది. ఆ ఉద్దేశంతోనే రాఘవరావు మాస్టారు 46 సంవత్సరాలుగా 46 మంది ప్రముఖ కవుల్ని మన పట్టణానికి పరిచయం చేయడం జరిగింది. వారి సాహితీ సేవకు నా సాష్టాంగ ప్రణామాలు” అంటూ మరో పది నిముషాలలో క్లుప్తంగా అత్యద్భుతంగా నా కవితలను సమీక్షించాడు. అతని సమీక్షకు ఆ సభ సంతోషాతిరేకాన్ని హర్షధ్వానాలతో తెలియ చేసింది.
అనంతరం రాఘవరావు మాస్టారు నన్ను ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందచేసారు. ఒక యోగిలా సాహితీ సేవచేస్తున్న ఆయన ముందు నేను ఎంత అల్పుడినో నాకు స్పష్టంగా అర్ధమై, నా మనసు పొరలలో ఆయన పట్ల చూపిన నిర్లక్ష్యం, ఘనీభవించిన ‘ఇగో’ పూర్తిగా కరిగి కన్నీరై ఆయనలోని ఉన్నత వ్యక్తిత్వానికి అభిషేకం చేస్తూ వినమ్రంగా ఆ సాహితీ సేవకునికి నమస్కరించాను.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™