భారతీయ మహిళల విద్య, మూఢాచారాలు, దురాచారాల నిర్మూలన కోసం – సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేసిన దేశవిదేశీ వనితలు ఎందరో ఉన్నారు. విదేశీ మహిళలలో ఐరిష్ మహిళ శ్రీమతి మార్గరెట్ కజిన్స్ ఒకరు.
ఈమె 1878 వ సంవత్సరం నవంబర్ 7వ తేదీన ఐర్లాండ్ లోని ‘బోయెల్-కో-రోస్కామాన్’లో జన్మించారు. అక్కడే ప్రాథమిక విద్యను అభ్యసించారు. డబ్లిన్‌లో బ్యాచురల్ డిగ్రీని పుచ్చుకున్నారు. ‘రాయల్ యూనివర్సిటీ ఆఫ్ ఇంగ్లండ్’లో సంగీతాన్ని అభ్యసించారు.
తన కుటుంబం తల్లి పట్ల చూపించిన చిన్నచూపు బాల్యంలోనే ఈమెకు అతివల వేదనను అవగాహనలోకి తెచ్చింది. తల్లికి ఏ విధంగానూ సాయం చేయలేకపోతున్నందుకు మథనపడేవారు.
బాల్యం నుండి తండ్రి జోసెఫ్‌కు వార్తాపత్రికలను చదివి వినిపించేవారు. అందువల్ల బాల్యం లోనే ప్రపంచ పరిస్థితులను అర్థం చేసుకున్నారు. వివిధ అంశాలలో ప్రతిభను సంపాదించారు.
వీరు బాల్యం నుండి సంగీతాన్ని అభ్యసించారు. డబ్లిన్ యూనివర్సిటీ నుండి పట్టా పుచ్చుకున్నారు. ‘రాయల్ యూనివర్సిటీ ఆఫ్ ఇంగ్లండ్’లో సంగీత పట్టాని తీసుకున్నారు.
మానసిక పరిశోధనలు, శాకాహారం, సామ్యవాదం, సాంఘిక సేవ కార్యకలాపాలతో జీవనం సాగించారు.
1903వ సంవత్సరంలో శ్రీ కజిన్స్‌తో ఈమె వివాహం జరిగింది. 1906లో మాంచెస్టర్‌లో జరిగిన జాతీయ మహిళల సమావేశానికి, 1907లో లండన్‌లో జరిగిన దివ్యజ్ఞాన సమాజ సమావేశానికి వీరిద్దరూ హాజరయ్యారు. 1910లో మహిళా పార్లమెంటుకి హాజరయ్యారు.
1908 నుండి 1913 వరకు ఐర్లాండ్, ఇంగ్లండ్‌లలో వివిధ ఉద్యమాలలో పాల్గొన్నారు. 1915లో దివ్యజ్ఞాన సమాజ అనుచరులుగా భారతదేశానికి వచ్చారు. అప్పటికే ఇక్కడ అనీబెసెంట్ సమాజ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఆమె అనుచరులుగా మద్రాసులోని అడయార్ చేరుకున్నారు.
భారత మహిళల కోసం ఉద్యమించారు. శ్రీమతి అనీబీసెంట్ పత్రిక New India లో పనిచేశారు. 1916లో మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన థోండో కేశవకార్వేతో పరిచయం పెంచుకున్నారు. పూనా లోని ఈ విశ్వవిద్యాలయంలో తొలి భారతీయేతర సభ్యురాలిగా చేరారు. విశ్వవిద్యాలయం ద్వారా స్త్రీ విద్యావ్యాప్తిలో పాలు పంచుకున్నారు. మదనపల్లి కాలేజీ అభివృద్ధి కోసం కృషి చేశారు. 1919-1920 లో మంగుళూరులోని జాతీయ బాలికల పాఠశాల అధిపతిగా పని చేశారు. ప్రాథమిక విద్య, వృత్తి విద్య, కళాశాల విద్య అంశాలను గురించి తీర్మానాలు చేయించారు.
1917లో గురువు శ్రీమతి అనీబెసెంట్తో కలిసి మద్రాసులో ‘ఉమెన్ ఇండియన్ అసోసియేషన్’ను స్థాపించారు. దీనికి అనుబంధంగా ‘స్త్రీ ధర్మ’ పత్రికను నడిపారు. ఈ పత్రిక ద్వారా మహిళలకు సంబంధించిన అనేక సమస్యలను వెలుగులోకి తీసుకుని వచ్చారు.
1927 సంవత్సరంలో ‘ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్’ను స్థాపించారు. స్త్రీల సమస్యల గురించి చర్చించేవారు.
1917వ సంవత్సరంలో భారతదేశంలో వివిధ సంస్కరణల నిమిత్తం చర్చించడం కోసం మాంటేగ్-ఛేమ్స్‌ఫర్డ్ మన దేశానికి వచ్చారు. కొంతమంది మహిళా నాయకులతో సంప్రదించి భారతీయ మహిళకు స్త్రీ విద్య, ఓటు హక్కులను గురించి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. మార్గరెట్‌కు ఈ విషయాలలో తమ దేశాలలో జరిపిన పోరాటాల అనుభవం తోడయింది.
ఇక్కడ వారి సంస్కారాన్ని అభినందించి తీరాలి. విదేశీ మహిళలయిన తాము కాకుండా భారతీయ మహిళల చేత విజ్ఞాపన పత్రాన్ని మాంటేగ్ – ఛేమ్స్పర్డ్లకు అందించాలని నిర్ణయించుకోవడం. శ్రీమతి సరోజినీ నాయుడు వంటి నాయకులను ముందుంచి తను తోడుగా వెళ్ళారు మార్గరెట్.
1919లో మాంటేగ్ – ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణలు అమలులోకి వచ్చాయి. ఇవి కాలాంతరంలో మహిళలకు ఓటు హక్కును కల్పించడానికి తోడ్పడ్డాయి. కొన్ని ప్రావిన్సులు మహిళలకు ఓటు హక్కును మాత్రమే కల్పించాయి. మరికొన్ని రాష్ట్రాలు ఓటు హక్కుతో పాటు ఎన్నికలలో పోటీ చేసే హక్కుని, మహిళలను శాసనసభలకు నామినేట్ చేసే హక్కుని కలిగించాయి. ఈ విధంగా భారతీయ వనితలకు రాజకీయ హక్కులను కల్పించడం కోసం ఉద్యమించి – విజయం సాధించారు మార్గరెట్.
ఈ విధంగా ఈమె సంస్థలను, పత్రికలను నిర్వహించడంతో సరిపెట్టకుండా / పిల్లల కోసం, ప్రసూతి కేసులు పరిష్కరించడం కోసం, ఉపాధ్యాయ శిక్షణ కోసం అనేక కార్యక్రమాలు జరిగే ఏర్పాటు చేశారు.
బాపూజీ, శ్రీమతి సరోజినీ నాయుడు, కమలాదేవి, ముత్తులక్ష్మీ రెడ్డి వంటి వారితో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని, జైలు శిక్షను కూడా అనుభవించారు. భర్తతో కలిసి ఆత్మకథను వ్రాశారు.
ఆ విధంగా భారతీయ మహిళా సేవలో పునీతయై, పలువిధాల సేవలు అందించి, దేశభక్తురాలిగా జైలు శిక్ష ననుభవించి / విద్యా, ఓటు హక్కులను సాధించి అవిరళ కృషి చేశారు మార్గరెట్. 1954 మార్చి 11 వ తేదీన అడయార్‌లో మరణించారు.
“చదువురాని స్త్రీలు – విద్యావంతులైన పురుషులకు మంచి భార్యగా ఎలా మనగలరు?” అని ప్రశ్నించిన మార్గరెట్ కజిన్స్ జయంతి సందర్భంగా ఈ నివాళి.
***
Image Courtesy: Internet
బాల్యం లోనే మహిళల సమస్య లను అర్థం చేసుకున్న మార్గరెట్ కజిన్స్ దివ్యజ్ఞాన సమాజ సభ్యురాలిగా భారతదేశానికి వచ్చి స్రీవిద్య, ఓటుహక్కు, స్త్రీలరాజకీయ ప్రాతినిధ్యం కోసం ఎలా ఉద్యమించి సాధించారో చాలా చక్కగా వివరించిన నాగలక్ష్మి గారు అభినందనీయులు.
ధన్యవాదాలు ప్రమీల గారూ!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™