“అమ్మా! విజయా వక్కపలుకు ఒకటి తెచ్చిపెట్టు?” అన్నాడు దశరథం భోంచేసి చెయ్యి తుడుచుకుంటూ!
“భోజనం పూర్తయిందన్నమాట” అంటూ దీక్షితులు వచ్చాడు.
“ఒరేయ్! ఇంత తిన్నాక కుదురుగా పదినిముషాలన్నా కూర్చోవాలనుకుంటారు. ఇక్కడ ఏం తల్లక్రిందులయి పోతున్నాయని… చెయ్యయినా తుడుచుకోనకుండా ఊడిపడ్డావు? నిన్ను అసలేమనాలో అర్థం కాదు” అన్నాడు దశరథం విసుగ్గా.
“నువ్వే మన్నా నేను వస్తాను! ఆ భగవంతుడు నా… అన్ని బాధ్యతలను తానే స్వీకరించి…. దీన్ని నాకు అప్పగించినట్టుది.
“దశరథా! నన్ను కష్టంగా మాటడకు. ఒక మాట… మనం పరుగెత్తకపోతే అక్కడేదో మునిగిపోతుందని…. మాలావు ఆరాటంగా…. హడావిడి పడుతూ వెళ్తాం…. అనేక సందర్భాలలో కానీ… అక్కడ మనం లేకపోవడం వల్ల అదనంగా జరిగే దేమీ ఉండదు.
కానీ…
మన మనస్సు ఉందే…. అది దీన్ని అంగీకరించదు. పరుగెత్త లేదని బాధపడుతుంది. అందుకే… అనవసరంగా నానా హైరానాపడతాం!” అని నవ్వి… “దశరథా! ఈ అనంతానంతమైన విశ్వంలో అసలు మనమెంత? పిపీలకం కూడా కాదు. మనం కదిలినా కదలకపోయినా ఇక్కడ ఉండేదీ లేదు.
ఇదిగో వాల్మీకి సృష్టించిన రామచంద్ర ప్రభువు పోయినా ఈ లోకం లిప్తమాత్రం ఆగలేదు. అంతా నేనే అని యుగధర్మం చెప్పిన శ్రీ కృష్ణపరమాత్మ దిక్కుమాలిన చావు చచ్చినా అంతే…”
ఈ ‘కలి’ గతీ అంతే….
ఇంతెందుకు మన బాపూజీని చంపిన నాడు దేశయావత్తు గుండే పగిలేలా ఏడ్చింది. ఇక ఈ దేశం ఏమైపోతుందో? ఎట్టా? అనుకున్నాం…
చెదరిన గుండెకు ఊరట దొరకలేదు.
ఏమయింది?
ఏమవుతుంది? ఏం కాదు…. ఎప్పటాటే….
రామచంద్ర ప్రభువు పాలన నడచింది.
ఔరంగజేబు ప్రభుత్వం నడచింది.
‘కంపెనీ వెల్లెస్లీ’ నడిపారు. ఇప్పుడు మన వాళ్లు నడుపుతున్నారు.
ఈ కాలం, కాలగమనం ఎవర్నీ ఆపవు…
దీనికి ఎవరి పట్లా రాగద్వేషాలు లేవు.
దీని ఒరవడి దీనిదే…
ఆరు నూరయినా నూరు లక్షయినా… దీన్ని క్రమంలో చింతాక్రాంత మవ్వుతారు.
ఈ పరిధి మనకు బొత్తిగా అర్థమైచావక ఈ ఉరుకులు పరుగులూను.
అత్యంత సంతోషం…
అతి విషాదం….
భరించశక్యం కాకుంటే…
దీని ముందు సమానమే…
దశరథా! మనం ఎక్కడ పుట్టామో? ఎవరమో? ఎమో? ఎందుకో స్నేహితులమయ్యా. ఒకరి బాధలలో మరొకరం అరమరికలు లేకుండా పాలుపంచుకునేంతగా… బంధువులమూ అవుదామనుకున్నాం… అంత వరకే… దానికి కుదిరినట్లే అనిపించింది. అవకాశం దొరకలేదు.
ఇక ఈ కాలాన్ని ఒక్క క్షణమన్నా ఆగమను… నా పిల్లవాణ్ణి ఒక్కసారి మాట్లాడించమను… సజీవునిగా ఒక్కసారి చూసే అవకాశం కల్గజేయమను…అందకుమించి….
ఈ పిసరంత అదృష్టాన్ని కల్గించి నన్ను తీసుకెళ్ళమను. గుండె అవిసిపోయేలా ఏడ్చానురా ఆ రోజున. ‘శాంత’యితే మరీ పిచ్చిదయిపోయింది. దాన్ని చూస్తుంటే భయమనిపించింది. ఎవ్వరూ! ఎవ్వరూ! మా మొర! వినలేదురా!… ష్!… వినడం చూడడం… దాని స్వభావం కాదు… దాని పరిధిలోని విషయామూ కాదు. మనకున్న భావనతో మన మనస్సు పరిధిలో తోచిన విధంగా అనుకుంటూ నడుస్తుంటాం అంతే.
అరేయ్ మన కళ్ళేదుట మన పిల్లలు సుఖసంతోషాలతో తిరుగాడుతూ ఉంటే నిండుగా ఆనందించగలం తృప్తిగా మిగులుతాం. మరో విధంగా జరిగిందే అనుకో…. మిగలమా?… ఒక నాటితో పోయేది కాదురా ఇదీ.”
“అయినా! పిల్లన్ని కంటాం వారి రాతల్నా. పూర్వ జన్మ సుకృతం” అంటారు మనవాళ్ళు. నిజమే కావచ్చు కాని కొంత దూరం నడచాక అర్థం కాదు” అంటుండగా పూజరయ్య పెనగడ దాటి వస్తూ కనిపించాడు.
“అదిగో వస్తున్నారు” అన్నాడు లేచి దశరథం.
“వస్తానన్నాడు గదా” అంటూ ఎదురెళ్ళారు.
“భోంచేసే కూర్చున్నారు గదా!” అడిగాడు పూజరయ్య…
తల ఊపారిద్దరూ…
“మీరూ?” అనడిగాడు దీక్షితులు.
“నాకింగా వేళ కాలేదు. వెళ్ళి వంట చేసుకోవాలి గదా!”
ముగ్గురు కూర్చున్నారు.
“మజ్జిగ త్రాగుదురుగానీ” అంది సీతమ్మ వచ్చి నమస్కారం చేసి.
“అలాగే…”
లోపలకు వెళ్ళింది సీతమ్మ సంతోషంగా…
కూర్చున్న కుర్చీమీదనే బాసాపెట్లెసి పంచాంగం తెరిచాడు. ఇద్దరి పేర్లు, జన్మనక్షత్రాలు, గోత్రాలు చెప్పాడు దీక్షితులు. అంకెలు వేసుకొని లెఖ్ఖలో పడ్డాడు పూజారయ్య. అయిదారు నిముషాల తరువాత “రెండు లగ్నాలు బాగున్నాయి” అన్నాడు.
“ఎప్పుడెప్పుడూ?” అడిగాడు దశరథం.
“ఈ నెల ఇరవై తొమ్మిది గానీ, వచ్చెనెల ఇరవై ఒక్కటి గానీ రెండూ రాత్రి పూట లగ్నాలే.”
“మొదటిది ఆరు ఘడిల పదినిముషాలకు… రెండవది తొమ్మిది గంటల ఒక్క నిముషానికి” అన్నాడు.
“రెండు వ్రాసి ఇవ్వండి” అడిగాడు దీక్షితులు.
“లగ్నపత్రికా?”
“అవును” అనబోయి “కాదు కాదు వ్రాసి ఇవ్వండి. ఈ తేదీలను వియ్యాలవారికి పంపి వారి అభిప్రాయం కూడా తెల్సుకొని పెట్టుకుందాం. లగ్నపత్రికల మార్పిడికి ఎట్టాగూ వాళ్ళు వస్తారు గదా!…”
“మంచిది.”
మజ్జిగ తెచ్చించ్చింది సీతమ్మ. తృప్తిగా త్రాగి తేన్చాడు పూజారయ్య.
రాజయ్యగార్ని కనుక్కొని తేది నిర్ణయించుకోవడమే మంచిది. అన్నాడు దశరథం అలాగే అని కాగితం తీసుకున్నాడు.
పదినిముషాలు పెళ్ళితంతును గురించి మాటాడుకున్నారు. ఆ తరువాత ముగ్గురూ లేచారు. పూజరయ్య దీక్షితులు బయలుదేరారు. వీర్ని మలుపు దాటిందాకా చూసి లోనికొచ్చి మంచం పై పడుకున్నాడు దశరథం.
***
“ సీతమ్మ పెళ్ళి కూతురాయనే… రామయ్య పెండ్లి కొడుకాయెనే…” సన్నాయి వాయిద్యం వినిపిస్తుంది. విడిది దగ్గర.
ఆడవారిని మాత్రం పెద్దయ్యగారింట్లో ఉంచారు. వారికి ఏం కావాలో చూడడానికి ఇద్దరు ఆడాళ్ళు ఉన్నారక్కడ.
రాత్రి తొమ్మిది గంటలకు లగ్నం…
“ఇప్పుడు నాలుగే గదరా అయింది” అన్నాడొకడు. వాచీ చూసుకొని “పానకంతో సరిపుచ్చేలా ఉన్నారురా, టిఫిన్లు గట్రా రావా?” అన్నడింకొకడు.
“బాబు నేను కాఫీ గతప్రాణిని. అరగంట కొకసారి నాకు కాఫీ సప్లయి చేసే పూచీ మీదనే నేను పెండ్లి బస్సు ఎక్కాను. ఇక్కడ ఏ మాత్రం తేడా వచ్చినా ఇక జన్మలో మరో బస్సు ఎక్కనని నొక్కి వక్కాణిస్తున్నాను” అన్నాడు ఓ ప్రజానాయకుని దత్తుడు.
“అరేయ్ నేను ఓ ఫ్లాస్కో నిండా కాఫీ పోయించి వాడి చంకన పారేస్తే పెళ్ళి అయిందాకా వాడి చావు వాడు చస్తాడు. ఇది వెంటనే చేస్తే బాగు. అలస్యమైనకొద్దీ ఈ పింజారీ వెధవ మన మెదడు తినడం ప్రారంభిస్తాడు” అని ఉచిత సలహానిచ్చారు ఇద్దరు మిత్రులు.
“శ్రీనివాసూ!… శ్రీనివాసూ!…. అసలు ఇక్కడ మన బాగోగులు చూసే వాడెవడు? ఉంటే వాణ్ని కొంచెం చూపించు నాయినా!” అన్నాడు.
శ్రీనివాసు పాపం బిక్క ముఖం వేసి “అరేయ్, నాకు మాత్రం ఇక్కడ ఏం తెలుసురా నేను మీలాగా వచ్చిన వాడ్నే గదా” అన్నాడు.
“అట్టా ఉత్తిత్తి మాటలతో తప్పుకుంటే కొంత పెళ్ళి పన్ను (matrimony) చెల్లించాల్సి వస్తంది. ఆనక విచారించి లాభం లేదు” అన్నాడొకడు.
ఇంతలో ఒక నడికారు మనిషి ఓ పడుచు పిల్లను వెంటేసుకొని వచ్చి తెచ్చిన గిన్నెలు దింపి సర్దుకొని “టిఫిన్లు తెచ్చాను” అన్నాడు.
వెంటనే ఆ పిల్ల ఆకులు చేతికిచ్చింది. వాతావరణం చాలా మట్టుకు చల్లబడింది. టిఫిను తినడానికి లేచారు.
అయినా ఒకడు ఆకును పరిశీలించి ఆకు ఇచ్చిన అమ్మాయిని ఓసారి ఆబగా చూసి (పరిశీలనగా) ఆవిడ వంటికున్న బట్టలు ఇతని చూపులకు అడ్డంగా ఉన్నందుకు ఉడుక్కొని “నాయినా ఈ ఆకులు చూడబోతే పాత కాలం నాటి నించి భద్రపరచినవిలా ఉన్నాయి. మీరెంత ‘old is gold’ అన్నా ఇవి పదార్దాలను మోయలేవేమోననిపిస్తున్నవి గదా” అన్నాడు.
“ఇవే ఇలా ఉన్నాయి. ఇక మనం తినబోయే పదార్దాల్ని ఎంత కాలంగా భద్రపరచి ఇస్తున్నారో?” అన్నాడొకడు పెద్ద జోకు వేసి దానంతటదే పేలినట్టు…. నవ్వుకున్నాడు.
“ఓరేయ్! తినబోతూ రుచి అడగనేల? తింటిమిపో తెలియగలదు గదా!” అంటుండగానే తెచ్చిన ఉప్మానూ అల్లం చట్నీనూ ఆకులలో వడ్డిస్తూ పోయిందా పిల్ల. జనాంతికంగా చూసి నవ్వుతూ…
“నవ్వినపుడు నాగమల్లికలా ఉంది గదూ?” అన్నాడొకడు ఉప్మా సంగతి మరచి.
“పెద్దాపురం నాగమల్లికా ఏం?” అన్నాడింకొకడు దగ్గరికి జరిగి చేతికొచ్చిన పదార్థం కాలుతున్నా చేతులు మార్చుతూ…
“ఓరినీ! నాగమల్లిక అదెప్పుడో సర్వీసు ఎక్కవయి కరిమింగిన వెలగపండులాగయింది నాయినా! త్రేతాయిగంలోనే కాలక్షేపం చేయక ద్వాపరం దాటి కలియుగంలోకి దిగి రండి. కావల్సిన సరుకులు కన్నుల విందు చేస్తాయి” అన్నాడో భావుకుడు చట్నీ అనుకొని ఉప్మా తింటూ…
విస్తర్లు గట్టిగా ఉండి ఉప్మా రుచిగా ఉండడంతో మగ పెళ్ళివారే అయినా వంకలు పెట్టడంలో వెనుకడుగు వేయక తప్పి చావలేదు. ఈలోగా మెరపకాయ బజ్జీలు వచ్చాయి. ఇంకొంచెం పెడితే బాగు అనే ధోరణి ప్రతిబింబించిది.
“నాగ మల్లికా, కాఫీ ఇత్తువా? శీతల పానీయములిత్తువా?” అనడిగాడొకడు ఆ కుఱ్ఱదాన్ని దగ్గరగా పిల్చి.
రస్నా నింపిన బిందె నుంచి తీసుకెళ్ళి కుదురుగా అందిచింది. ఈ పిల్ల ఇవ్వడానికి రస్నా చల్లదనానికీ ఏవేవో లోకాలు గుర్తుకొచ్చినయి వెధవకు.
ఈ ఏర్పాట్ల సరళి చూసాక… దశరథంగారు పెళ్ళి ఎలా చేస్తాడో వీరికి అర్థమైపోయింది. ఇక పర్వాలేదనుకొని ‘పేక’ విప్పారు.
(ఇంకా ఉంది)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™