దేవీప్రియ ‘గాలిరంగు’కి 2017 కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు ప్రకటించిన సందర్భంగా ‘దేవి’ ప్రేమికుల ఆత్మీయ సమర్పణ ఇది అని పేర్కొన్నారు ప్రచురణకర్తలు. ఈ పుస్తకానికి బి. నరసింగరావు, ప్రొ. ఘంటా చక్రపాణి, ఖాదర్ మొహియుద్దీన్, డా. సీతారామ్, బండ్ల మాధరరావు గార్లు సంపాదకులుగా వ్యవహరించారు. ఇందులో విశ్లేషణలు, పరామర్శలు, ప్రేమలు, ఆలింగనాలు, అభిమానాలు ఉన్నాయి.
***
“దేవిప్రియ గురించి సంక్షిప్తంగా చెప్పడం సాధ్యం కాదు. విస్తృతంగానే మాట్లాడాల్సి ఉంటుంది. ఆయన రాసిన ‘అమ్మచెట్టు’ కవిత్వం నుండి ‘ఇం..కొకప్పుడు’ దాకా నిర్మించి ఇచ్చిన రూపకాల రహదారులను, సామాజిక, రాజకీయ సంవేదనలను, కూర్చిపెట్టిన సిమిలీల సాగరాలను, వెలిగించి ఇచ్చిన దీప్తి చైతన్యాలను సతతమూ గుర్తుకు తెచ్చుకోవలసిందే. నిత్య పరిణామ శీలమైన కాలగతిలో దేవిప్రియ కవిత్వం ఒక ప్రధానమైన పాయగా కాక ఒక మహానదిగా ప్రవహిస్తూ వచ్చిందన్న సంగతి ఇప్పుడిప్పుడే తెలుగు సాహిత్యం గ్రహించగలుగుతున్నది” అని పేర్కొన్నారు సీతారామ్ ‘ఒక మహానదిని గురించి…’లో.
“గాలికి వాసన సంగతేమో కానీ, రంగూ రుచీ ఉంటాయా! ఉంటాయనే అంటాడు దేవిప్రియ. ఎలా? మనిషి ఆయువు ప్రాణవాయువు. కానీ ప్రాణవాయువును పీల్చినవారంతా మనుషులుగా బతకడం లేదు. మనుషులుగా ఉండడం లేదు కూడా. మనిషితనాన్ని అడ్డం పెట్టుకుని అడ్డదారులలో జొరబడేవారూ ఉన్నారు. సుగంధాలనూ, దుర్గంధాలనూ గాలే మోసుకురాగలదు. శ్రేష్టమైన పైరగాలీ, దుర్భరమైన పడమటి గాలీ, కొండగాలీ, అడవిగాలీ కూడా నిజమే. పాటనూ, మాటనూ మోసుకొచ్చే శక్తి కూడా గాలిదే. అంటే అన్యాయాలపైన, అక్రమాల పైన గళం విప్పగలిగే మనిషికి కావలసిన శక్తీ, ఇంధనమూ కూడా గాలిలోనే ఉన్నాయి. కాబట్టే గాలికీ రంగులు వేస్తానని ఈ కవి భావన” అన్నారు ఎ.బి.కె. ప్రసాద్ ‘గాలిరంగు’ మీద ‘కామెంటరీ’ అన్న వ్యాసంలో.
“ఎయిర్ కండీషనర్లూ, ఎడతెగని విమానయానాలూ తన బతుకులో ప్రవేశించడానికి ముందు ఎండలో మెరిసే నీడలలో మెదిలే జనం మధ్యనే బతుకు పోరును అభ్యాసం చేశాడు దేవిప్రియ. జర్నలిజం దాహంతో తాడిశెట్టి ఆంజనేయులు ప్రెస్ చుట్టూ కాలేజీ ఎగగొట్టి కాలినడకన ప్రదక్షిణలు చేశాడు. కవిత్వ సభల సందడిలో పడి పరీక్ష మానేసి విజయవాడ వెళ్లి శ్రీశ్రీతో కరచాలనం చేసి వచ్చాడు.
పసిపిల్లలకి పిడికెడు మెతుకుల కోసం మూసీ నగరంలో సొమ్మసిల్లుతూ వెతుకు లాడాడు. విలువల కోసం ఆయాచిత భద్ర జీవితకలశాలను కాలదన్ని ముళ్ల కిరీటాలను స్వచ్ఛందంగా ధరించి సగర్వంగా తిరిగాడు. ధిక్కారాన్ని ప్రశ్ననీ కౌగిలించుకుని బానిస సౌఖ్యాలమీద తిరగబడ్డాడు. తన షరతులమీద తాను బతకడానికి పలు విద్యల ఇంద్రచాపాన్ని ఎక్కుపెట్టి ఒక లోకనీతిని సవాల్ చేసి నిలిచాడు.
తొలుత సినిమా రంగంలో అనిశెట్టి సుబ్బారావు దగ్గర కొంతకాలం పని చేయడంతో ప్రారంభించి జర్నలిజంలో స్థిరపడ్డాడు. ఎమర్జెన్సీలో ‘ప్రజాతంత్ర’లో కవిత్వం పేజీ కోసం, శ్రీశ్రీ, ‘అనంతం’, కమలాదాసు జీవిత చరిత్ర కోసం ఎడిటర్‌గా ఆయన గుర్తుండిపోతాడు. అంతే ఇదిగా తెలుగు దినపత్రికల ముఖపత్రం దిగువన ఆయన ప్రవేశపెట్టి రెండున్నర దశాబ్దాలు నిర్వహించిన రాజకీయ వ్యాఖ్యానం ‘రన్నింగ్ కామెంటరీ’ దేవిప్రియ ట్రేడ్‌మార్క్‌గా నిలిచిపోతుంది” అన్నారు వరవరరావు “‘ఇం… కొకప్పుడు’ కవి ఆత్మకథ”లో.
“దేవిప్రియ గొప్ప పాత్రికేయుడు. అంతకంటే గొప్ప కవి. అంతకంటే గొప్ప ప్రేమాస్పదుడు. భార్యనూ, పిల్లల్ని అంత గాఢంగా ప్రేమించిన మరొక వ్యక్తి నాకు కనిపించలేదు. అర్ధాంగి రాజేశ్వరి మరణం తాలూకు విషాదంనుంచి ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. తల్లి, తమ్ముడు చనిపోయినప్పుడు అనుభవించిన వేదనను కవితల ద్వారా సమాజంతో పంచుకున్నారు. స్నేహితులతో అనుబంధం జీవితపర్యంతం కొనసాగుతుంది. తాత్కాలికం అనే మాట దేవిప్రియ నిఘంటువులో లేదు. పైపైన మాట్లాడటం తెలియదు. హృదయపూర్వకంగా మనుషులను ప్రేమించడం తెలిసిన మనిషి. ఒకరి గురించి ఆగ్రహంతో, ద్వేషంతో మాట్లాడగా నేను వినలేదు” అన్నారు కొండుభట్ల రామచంద్రమూర్తి ‘అద్వితీయ మిత్రుడు దేవిప్రియ’లో.
“దేవిప్రియ పత్రికారచయితగా బాహ్యవచన ప్రపంచానికి చెందినవారు. అదే సమయంలో కవిగా కవిత్వప్రపంచంలోకి అవలీలగా వెళ్లగలిగి, ఉండగలిగినవారు. ఆ విధంగా ఆయన ఉభయప్రపంచజీవి.
~~
తన సమకాలీన సంపాదకులు దేవిప్రియపై అసూయ చెందడానికి ఒక కారణం ఉంది. అది, శ్రీశ్రీ ఆత్మకథను ‘అనంతం’ పేరుతో తను సంపాదకుడిగా ఉన్న ‘ప్రజాతంత్ర’లో ప్రచురించడం! శ్రీశ్రీ రచనలను ప్రచురించే అవకాశం, ఆయనతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపే అవకాశం ఆయన సమకాలీన సంపాదకులకు ఎందరికో కలగలేదు. ఈ యుగం నాదన్న ఒక మహాకవి ఆత్మకథను ప్రచురించే అవకాశం కలగడం చిన్న విషయం కాదు. ఆ కవితోపాటు తనను కూడా చారిత్రిక స్మరణలో ఉంచగల మహద్భాగ్యం అది” అని వ్యాఖ్యానించారు కల్లూరి భాస్కరం “భయప్రాయం నుంచి లక్ష్యగానానికి!”లో.
“సీరియస్ వార్తలతో గంభీరంగా ఉండే దినపత్రికల్లో ఆహ్లాదకరమైన మార్పు అందించేవి కార్టూన్లు. దానికితోడుగా ఉదయంలో దేవిప్రియ వాక్ చురకలూ ఉండేవి. ఏరోజు వచ్చే వార్తలపై ఆరోజు సునిశితమైన విమర్శలతో చురకలు పెడుతూ సాగే రన్నింగ్ కామెంటరీని ఆయనే ప్రారంభించారు. అద్భుతంగా దశాబ్దాలపాటు నడిపారు.
దేవిప్రియకన్న పదునుగా ఈ రన్నింగ్ కామెంటరీ రచించడం సాధ్యం కాదనిపిస్తుంది” అన్నారు మాడభూషి శ్రీధర్ ‘బహుముఖ సంగమం’లో.
బహుముఖ
(ప్రముఖ విమర్శకులు, పాత్రికేయులు, రచయితల పరిశీలనలు, వ్యాఖ్యలు)
ప్రచురణ: సాహితీ మిత్రులు, విజయవాడ
పేజీలు: 416, వెల: ₹ 300
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్
ఈబుక్: కినిగె.డామ్
Your email address will not be published. Required fields are marked *
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
సరిహద్దు రేఖలనూ, మన మనస్సులనూ కప్పిన పొగమంచు : ధుంధ్
‘యాత్ర’ చూద్దామా ఎపిసోడ్-10
పదసంచిక-30
రంగుల హేల 21: ఆదత్ సే మజ్బూర్
జీవన రమణీయం-84
All rights reserved - Sanchika™