ఇంకొక మా అసంతృప్తి అణగక ముందే కొండపాటూరు చేరుకున్నాము. అన్నీ దగ్గర దగ్గర ఊళ్ళే. ఒక ఊరి నుంచి ఊరు వెళ్ళటానికి ఎక్కువ సమయం పట్టదు. కొండపాటూరు కాకుమాను మండలంలోని చిన్న గ్రామం. అక్కడ వెలసిన తల్లి శ్రీ పోలేరమ్మ అమ్మవారి గురించి ఆ ప్రాంతాలవారు అత్యంత భక్తి శ్రధ్ధలతో చెబుతారు. అయితే ఆ ఆలయానికి వెళ్ళే దోవలో మరో రెండు ఆలయాలు… వాటిని చూస్తే చాలా పురాతనమైనవి అనిపించాయి. ఒకదాని ముందు మగవారు గుంపుగా కూర్చుని వాళ్ళ ధోరణిలో వాళ్ళున్నారు. అందుకని ఆ ఆలయానికి వెళ్ళలేదు. ఇంకొకటి చిన మల్లేశ్వరస్వామి ఆలయం. చిన్నదే. పైగా మూసి కూడా వున్నది. అక్కడ మేము కారు దిగి బయటనుంచే ఫోటోలు తీసుకోవటం చూసి ఎదురుగా ఇంట్లోని ఒకావిడి గుడి చూస్తారా అని ఎక్కడినుంచో తాళం చెవి తెప్పించి గుడి తాళం తీసింది. ఆవిడకేం పట్టింది చెప్పండి మేము బయట ఫోటోలు తీసుకుంటుంటే, అడిగి మరీ తాళాలు తెప్పించటానికి. చూసీ చూడనట్లు పోయి వుండవచ్చుకదా. ఇలాంటి మంచి వాళ్ళంతా ఎక్కువగా తారసపడబట్టే మేము వేళా పాళా లేకుండా ఇన్ని ఆలయాలు చూడగలిగాము.
చిన్న మల్లేశ్వరస్వామి ఆలయం చిన్నదే అయినా ప్రశాంతంగా వున్నది. పక్కనే చెరువు మీదనుంచి చల్లని గాలి వచ్చి మమ్నల్ని పలకరిస్తే ఎంత హాయిగా అనిపించిందో. అవతల మేము వెళ్ళకుండా వచ్చింది పెద్ద మల్లేశ్వర స్వామి ఆలయంట… ఆవిడ చెప్పారు. అక్కడ బయట చాలామంది వుండటంతో వెళ్ళలేదని చెప్పాము.
చిన్న మల్లేశ్వరస్వామి ఆలయంలో శివుడు, పక్కనే ఉపాలయంలో పార్వతీ దేవి, ఇంకొక ఉపాలయంలో వీరభద్రుడు, కాళికాదేవి… నిత్య పూజలు జరుగుతున్నాయి. అంతకన్నా ఆలయం వివరాలు తెలియలేదు, చాలా పురాతనమైనది అని తప్పితే. ఆవిడకి ధన్యవాదాలు తెలిపి పోలేరమ్మ తల్లి దర్శనానికి బయల్దేరాము.
పోలేరమ్మ తల్లి అక్కడి వారి నమ్మిన దైవం. చాలా శక్తివంతమైనది, మహిమాన్వితమైనది. సత్యంగల గ్రామదేవత. ఇదివరకైతే అమ్మవారు గ్రామంలోని ప్రజలకు రాబోయే అరిష్టాల గురించి ముందే హెచ్చరిస్తూ వుండేదిట. ఇదివరకు అమ్మవారు చాలా పెద్దగా అరిచే అరుపులకు జనం భయపడి పూజలు చేసి శాంతింప చేశారని చెబుతారు.
ఆలయం చిన్నదే. చుట్టూ కొంత ఖాళీ ప్రదేశం వుంది. తిరుణాల సమయంలో ఇక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం వుంటారు.
ఇక్కడ జరిగే తిరునాళ్ళు కొండపాటూరు జాతరగా ప్రసిధ్ధి చెందింది. ఆ సమయంలో భక్తులు అందంగా అలంకరించిన ప్రభలతో, బాజా భజంత్రీలతో, వివిధ వాయిద్యాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. ఇక్కడ ఆడవారే కాదు మగవారు కూడా అమ్మకి బోనాలు సమర్పిస్తారు. తిరనాళ ముందు రోజు అమ్మవారికి మహిళలంతా మల్లెపూలతో పూజ చేయటం ఆనవాయితీగా వస్తున్నది. ఇక్కడ జంతు బలులు కూడా జరుగుతుంటాయి. దేవస్ధానం వారి బోర్డు.. జంతు బలులు నిషేధం.. అని వున్నా ఉపయోగం లేదు.
చైత్ర శుధ్ధ తొలి శుక్రువారం ఇక్కడ సిరిమాను జాతర జరుగుతుంది. ఆ రోజు సిరిమానుకు కట్టబడిన బోనులో మేక పిల్లను వుంచి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. భక్తులు జీడి మామిడి కాయలను ఈ మేక పిల్ల వున్న బోనుపైకి విసిరి వేస్తారు. అవి తిరిగి వారికి దక్కితే వారి మనస్సులో వున్న కోరికలు నెరవేరుతాయని నమ్మకం. ఈ సిరిమానును రైతులు తమ పొలాల్లో పండిన పంటలతో అలంకరిస్తారు. ఈ తిరునాళ్ళకు భక్తులు చాలా పెద్ద సంఖ్యలో వస్తారు.
చుట్టు పక్కల రైతులు తమ పాడి పంటలు చక్కగా వుండాలని అమ్మవారికి మొక్కుకుంటారు. ట్రాక్టర్లు, ఎడ్ల బళ్ళమీద కుటుంబాలతో సహా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. పొంగళ్ళు వండి అమ్మకు నైవేద్యం పెడతారు. తమ తొలి పంటలను అమ్మకి భక్తితో సమర్పించుకుంటారు. ఆ సమయంలో రైతులు తమ ట్రాక్టర్లను, బళ్ళను మల్లెపూలు, వివిధ రకాల పూలతో చూడ ముచ్చటగా అలంకరిస్తారు.
పోలేరమ్మ తల్లిని పుష్పాలతో, నిమ్మకాయలతో చాలా చక్కగా అలంకరించారు. అమ్మవారు స్వర్ణ కిరీటంతో, పెద్ద పెద్ద కళ్ళతో దర్శనమిస్తూ వుంటుంది. పూజారిగా ఒక మహిళ వున్నారు. అమ్మవారి విగ్రహం ముందు తల మాత్రమే వున్న రాతి విగ్రహానికి పెట్టిన కళ్ళు మాత్రమే ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి అలంకరణ వల్ల. ఆవిడ అసలు వెలిసిన దైవం. వెనక విగ్రహం తర్వాత పెట్టి వుంటారు. పక్కనే ఉత్సవ విగ్రహం.
అక్కడనుండీ జమ్ములపాలెం మీదుగా చెరుకూరు వెళ్ళాము. ఇది ప్రకాశం జిల్లాలోనిది. ఇక్కడ ప్రసిధ్ధి చెందిన త్రివిక్రముడి ఆలయం దర్శించలేదు మూసి వుండటంతో. మా తర్వాత మజిలీ ఉప్పుటూరు.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.
Your email address will not be published. Required fields are marked *
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
సరిహద్దు రేఖలనూ, మన మనస్సులనూ కప్పిన పొగమంచు : ధుంధ్
‘యాత్ర’ చూద్దామా ఎపిసోడ్-10
పదసంచిక-30
రంగుల హేల 21: ఆదత్ సే మజ్బూర్
జీవన రమణీయం-84
All rights reserved - Sanchika™