సాధారణ పురుషుల్లోంచి పుణ్య పురుషుల్ని వేరుచేయడం ఎంత కష్టమో చలామణీ ప్రతిభావంతుల్లోంచి నిజమైన ప్రతిభావంతుల్ని వలేసి పట్టుకోవడం అంత కష్టం. ఎందుకంటే అచ్చమైన ప్రతిభావంతులు ఓ మూలన కూర్చుని మౌనంగా తమ కృషి ఏదో తాము చేసుకుంటూ ఉంటారు. మనం వేసిన వలనసలు వాళ్ళు చూడనే చూడరు. ఎవరికి తెలుస్తుంది అటువంటి వారి గురించి? కాబట్టి తెలీదు. ఎవరో దయామయుడు ఈ విషయం కనిపెట్టి నలుగురినీ పిల్చి కిటికీ లోంచి చూపించాలి. అయితే చలామణీ ప్రతిభావంతుల గురించైతే అలా బాధ పడక్కరలేదు. వాళ్లే మన కాళ్ళకీ చేతులకీ అడ్డం పడి ‘నేను మీకు తెలుసు కదా!’ అంటుంటారు, తెలీదంటే అదేదో మన అజ్ఞానం అన్నట్టుగా. ఇక తప్పక వారిని గుర్తించి ‘మీరు తెలీకపోవడం ఏంటీ? మీ ప్రఖ్యాతి మాటలు కాదు’ అనక తప్పదు.
పుట్టుకతో తమకబ్బిన నటన అనే కళను మనసారా అభ్యాసం చేసి శ్రమలకోర్చి ఒక్కో మెట్టూ కళ్ళ కద్దుకుంటూ ఎక్కి మహా నటులైన వారి పిల్లలు తండ్రుల సొంత బ్యానర్లో పరిచయం అయ్యి నటనలో ఆ.. ఆ.. లు రాకపోయినా నటించి పారేస్తారు. ఆ సినిమా, ఏ హీరోయిన్ పాదం వల్లో, ఇంకేదో మసాలా వల్లో హిట్ అయి కూచుంటుంది. ఇంకేముంది? ఆ హీరోపుత్రుడు మహానటుడైనట్టే. వద్దన్నా నటిస్తాడు. మొహం బాలేదంటే అన్ని బాడీ పార్ట్‌లూ మారుస్తాడు. కొత్త ముక్కూ, పెదాలూ ఇంకా వీలైనన్ని సర్జరీలు చేయించుకుంటూ అందగాడై పోతాడు. ఒకో సినిమాలో ఒకోలా కనబడతాడు. తినగ తినగ వేము చందంగా బానే ఉన్నాడులే అనిపించుకుని ఓ అశుభ ముహూర్తాన ఉత్తమ నటుడు అవార్డు కూడా కొట్టేసి మనల్ని వెక్కిరిస్తాడు, మన నోరు పడిపోయేట్టు. పత్రికల్లో సినిమా పేజీల్లో పేద్ద ఇంటర్వ్యూ, నట పండితుడి కొడుకు నటవిరాట్టైన విధం అంటూ. రెండేసి గంటల ఇంటర్వ్యూలు టీవీ చానెల్స్ లో, అదీ పండగ పూట పొద్దున్నే. వద్దన్నా ఎవరో పిల్లలు టీవీ పెట్టి మనల్ని చంపుతారు. చూడక తప్పదు.
ఓ యాభై ఏళ్లుగా నలభై నవలలూ, ఇరవై కథాపుస్తకాలూ రాయగా, పబ్లిషర్లు ఆమెను అడిగి అచ్చు వేసుకున్న చరిత్ర గల పెద్దావిడ ఒక సాహిత్య సభలో కూర్చుంటే ఆవిడ నెవరూ గుర్తు పట్టరు. తనకు తోడుగా తెచ్చుకున్న మరొకావిడ పక్కన ఓ పక్కగా కూర్చుంటుందామె. నాలుగు కధలు రాసి ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ మొహంమీదకు పడుతున్న జుట్టును తోసుకుంటూ వస్తున్న ఓ బేబీ రచయిత్రిని అక్కడున్న ప్రతి వాళ్ళూ గుర్తుపట్టేస్తారు. ఎదురువెళ్ళి ‘రండి రండి’ అంటూ మంచి సీట్ చూపిస్తారు. యువకులంతా చుట్టూ మూగి మురిసిపోతారు. సీనియర్ రచయితలు, లోకల్ లీడర్లూ ఆప్యాయతను కుమ్మరిస్తారు, ఆ పై స్టేజి ఎక్కాక సందు దొరికితే ఇప్పటివరకూ ఇంత గొప్పగా రాసిన రచయిత్రి పుట్టనేలేదంటూ, జాన్ కె. జేమ్స్ అనే ఇంగ్లీష్ రచయిత స్థాయిలో రాసిందంటూ బేబీ రచయిత్రిని అక్కడి వారందరికీ పరిచయం చేసి చప్పట్లు కొట్టిస్తారు. ఆ నాలుగు కధలూ ఎన్నో సంపుటాల్లో కెక్కుతాయి. ఆనక స్టేజీలెక్కి కథలెలారాయాలీ అనే వర్కుషాప్లకి అధ్యక్షత వహిస్తుంది ఆ పిల్ల. ఇదీ చలామణీ అంటే, ఒక్క పుస్తకం కూడా రాని వారి సౌభాగ్యం.
మన చిన్నప్పుడు డాక్టరేట్లు నూటికొకరు కూడా ఉండేవారు కాదు. పీ.హెచ్.డీ కోసం జీవితాన్ని అంకితం చేసి పరిశోధన జరిపి గతంలో లేని ఒక గొప్ప విషయాన్ని కనిపెట్టి పెద్దల చేత అవుననిపించుకుంటే డాక్టరేట్ వస్తుందని మా హైస్కూల్ మాష్టార్లు చెప్పేవారు. అలాగే కొందరి పీ.హెచ్.డీ సబ్జెక్టు వింటేనే గుండె గుభేల్ మంటుంది. ‘వామ్మో! ఒక సముద్రాన్ని పుక్కిట పట్టినట్టే సుమా’ అనిపిస్తుంది. కళ్ళుమూసుకుని దణ్ణం పెట్టాలనిపిస్తుంది వారికి. ఆ సిద్ధాంత గ్రంథాన్ని చదివి అర్థం చేసుకోవడానికి కూడా మనకి కష్టం గానే ఉంటుంది.
అయితే కొందరు తాము పరిశోధన ఆరేళ్ళు చేసాము, ఐదేళ్లు చేసాము అంటారు. నిజమే కదా మరి అనుకున్నాక, వారు తీసుకున్న టాపిక్ వింటే కళ్ళు గిర్రున తిరుగుతాయి. దీనికి ఆరు రోజులు చాలు కదా అనిపిస్తుంది మనకి (లోతులు తెలీని అజ్ఞానం అనుకోండి). ఇంతకీ సంగతేంటంటే ఈ తేలిక, నాజూకు డాక్టరేట్లకే గౌరవ సన్మానాలు తెగ జరుగుతాయి.ఎక్కడ చూసినా ఇబ్బడి ముబ్బడిగా కనబడుతుంటారు. పైన చెప్పిన కఠిన సబ్జెక్టుల డాక్టరేట్లు ఎక్కడా కనబడరు. కష్టమైన పీ.హెచ్.డీ చెయ్యడం వల్ల వాళ్ళకి ఆ డిగ్రీ వచ్చేటప్పటికే శక్తి ఆవిరైపోతుందేమో. అందుకే సెల్ఫ్ ప్రమోషన్‌కి ఓపికుండదనుకుంటాను పాపం.
మన తండ్రుల తాతల తరంలో కొందరు విద్యార్థి దశలోనే దేశనాయకుల స్పూర్తితో ప్రజాసేవ చెయ్యాలనే ఆర్తితో రాజకీయాల్లోకి వచ్చి ఎంతో సేవచేసి ఎక్కువగా గుర్తింపు లేకుండానే లోకం నుంచి నిష్క్రమించారు. తర్వాత వారి తనయులో, సోదరులో రాజకీయాల్లో సునాయాసంగా ప్రవేశించి తిన్నగా ఓ పదవి సంపాదించి వెలిగిపోతుంటారు. ఇంక వారింటి చుట్టూ రోజంతా పాతిక కార్లూ, వందల జనాలూ, జేజేలూ నడుస్తుంటాయి. సదరు నాయకులు పంద్రాగస్టు నాడు జండా ఎగరేసి గట్టిగా జాతీయ గీతం తప్పుల్లేకుండా పాడలేరు. స్పీచ్‌లు బట్టీ కొట్టుకొచ్చి మాట్లాడతారు. స్వయంగా రెండు మాటలు చెప్పలేని వారు హోదా చూపెట్టీ ,భజనపరులకి కొన్ని పనులు చేసిపెట్టీ చలామణీ కీర్తి గడిస్తారు. కొత్త తరం ప్రజలు వీరినే దేశభక్తులనుకునే ప్రమాదం మనం నిత్యం చూస్తున్నదే.
ప్రభుత్వం ఇచ్చే అవార్డుల వెనక రెకమెండేషన్స్ ఉంటాయనీ, అవి అస్మదీయులు పదవుల్లో ఉన్నవారికే దక్కుతాయనీ జనానికి అనుమానం ఉంటుంది. అవార్డులు ఇచ్చే కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా ఆయా కళాకారుల కృషిని స్వయంగా చూసే పని పెట్టుకోవు. కొన్ని ప్రభావ వర్గాల సలహాపై అవార్డులు ఇస్తాయి. ఆ వర్గాల వారు అర్ధరాత్రి అడిగినా ఠక్కున తమ భజన బ్యాచ్ పేర్లు చెప్పడానికి రెడీగా ఉంటారు. ఎందుకంటే అవార్డు కోరుకునే వారంతా ఆ యా వర్గాల దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకునుంటారు కాబట్టి. మరి కొందరికి అధికార మిత్రుల ద్వారా అదృష్టం కలిసొస్తే వారు రాసిన సాహిత్యం కన్నా వారికొచ్చిన అవార్డులూ, రివార్డులూ ఎక్కువుంటాయి. నిజమైన కృషి చేసేవారు ఎవరి దృష్టిలోనూ ఉండరు. వారెప్పుడూ బిక్కు బిక్కుమంటూ మీటింగ్ లలో కూర్చుని డమ్మీ ప్రతిభావంతులు అందుకుంటున్న జేజేలు విని వెళుతుంటారు.
సుశీలమ్మలా, జానకమ్మలా పాడే అమ్మాయిలు ప్రతి హైస్కూల్ లోనూ ఓ నలుగురైదుగురు ఉంటారు. కానీ వాళ్ళని ప్రోత్సహించే వాళ్లుండరు. కొందరికి అదృష్టం తన్నుకొచ్చేసి ఓ మాదిరి వాయిస్ ఉంటే చాలు స్టేజిషో లలో ధగ ధగా వెలిగిపోయి యు ట్యూబ్ నుంచి ఎక్కడెక్కడికో కూడా ఎక్కి రాష్ట్రం మొత్తంలో ఒకే ఒక సుందరగాయకిగా పేరు మోసేస్తారు. విదేశాలలో కూడా షో లు చేసి వచ్చేస్తుంటారు. అదంతా ప్రాక్టీస్, మేనేజ్ రెండు సూత్రాల చలామణీ ఫలం.
అన్ని రాష్ట్రాలలోనూ నిత్య సాహిత్య స్టేజి షోలకి పర్మనెంట్ పండిత వక్తలుంటారు. వారి శిష్యులుగానీ, మిత్రులుగానీ వారితో పాటు స్టేజి ఎక్కి పక్కన కూర్చుని నాలుగు సరదా కబుర్లు చెప్పి అక్కడి వారిని పొగిడితే చాలు. వారు సూట్ వేసుకున్న వారైనా, పంచె కట్టుకున్న వారైనా, పెద్ద బొట్టూ, పట్టుచీర వారైనా చలామణీలో కొచ్చేస్తారు. వాళ్ళు రాసినదేమీ లేకపోయినా సరే, నిత్య కార్యక్రమాలకి పిలుపులొస్తాయి. అప్పుడింక, ‘ఎవరెవరో రాసిన వాటి గురించి ఎన్నాళ్ళు మాట్లాడతాం? ఆ మాత్రం మనం రాయలేమా’ అని వారు రాయడం మొదలెడతారు.
నాలుగు కాలక్షేపం కాలమ్స్, ఓ నాలుగు న్యూస్ రిపోర్ట్లు, మరి కొన్నికథా శకలాలు (వీటికి మొదలూ, చివరా ఉండవు) ఒక్క రాత్రంతా కూర్చుని రాసేసి వాటికి కథలని పేరుపెట్టి (పత్రికలకి పంపితే వాళ్ళు వెయ్యకుండా తిప్పిపంపే ప్రమాదం ఊహించి) ఎవరో స్పాన్సర్ని పట్టుకుని ప్రింటింగ్ కిచ్చేసి బుక్ వేసేసుకుంటారు. పుస్తక ప్రారంభోత్సవం వారి డైలీ బెటాలియన్ చేతుల మీదుగా జరిగిపోతుంది. అన్ని పేపర్ల సిటీ ఎడిషన్‌లో కలర్ ఫోటోలు పడతాయి. తర్వాత రెస్ట్ ఈజ్ హిస్టరీ అన్నట్టు పెద్దల ఆశీస్సుల వల్ల పోటీల్లో అవార్డులూ, రివార్డ్లూ వారికి క్యూ కడతాయి. ఆపై వారి పేరు ముందు, ప్రముఖ, ప్రఖ్యాత రచయిత అని బిరుదు దానంతట అదే వచ్చి కూర్చుంటుంది. ఆ తర్వాత ఎనభయ్యేళ్ళ సీనియర్ రైటర్స్ పక్కన కూర్చుని ‘టైం ఎంతండీ’ అని అడిగేంత ఎత్తుకు ఎదిగిపోతారు ఈ స్టేజి రచయితలు, అదీ చలామణీ మహిమ అంటే. దశాబ్దాల తరబడీ ఒక తపస్సులా నవలలూ, కథలూ, వ్యాసాలూ జాగ్రత్తగా రాస్తూ పత్రికలకి పంపుతూ ఉండే సామాన్య రచయితలు వీరి కీర్తి కిరీటాలు చూస్తూ అవాక్కవు తుంటారు.
ఒకోసారి కొన్ని సాహిత్య అవార్డులు (స్థాపించిన వారు గతించిపోయాక దాని స్ఫూర్తి మారాక) కొందరు అందుకునే వరకూ వాళ్ళు రచయితలన్నసంగతే లోకానికి తెలీదు. తెలిసాక జనాలు కెవ్వుమంటారో, మూర్చపోతారో అన్నది వాళ్ళిష్టం. అది వాళ్ళ హక్కు. కొందరు అవార్డులు అస్మదీయుల పుస్తకం పబ్లిష్ అయ్యేవరకూ వేచి ఉండి మరీ ప్రకటిస్తారు. పోలోమని పోటీకొచ్చిన పుస్తకాల సీల్ కూడా విప్పకుండా ఫలితం ప్రకటించబడుతుంది. అలాగే వంకర టింకర యాంకర్లు చలామణీలో ఉంటూ దశాబ్దాలుగా బుల్లితెరనేలుతుంటారు. కొత్త మొహం కోసం మనం మొహం వాచేలా చూడాల్సిందే. ఆ లంగా వోణీ చెలామణీ చెల్లాయ్కి ప్రత్యామ్నాయం తెలుగు రాష్ట్రాల్లో ఉండదు గాక ఉండదు.
అప్ కమింగ్ చాకులు కొందరు రిటైర్డ్ సీనియర్ సాహితీకారులు కార్ దిగగానే సార్ అంటూ రోడ్లమీదా, నిండు సభల్లోనూ కాళ్లకు దణ్ణాలు పెట్టేసి మార్కులు కొట్టేసి చలామణీలో కొచ్చేస్తారు. వీరు పెద్దల గుడ్ లుక్స్ కోసం ‘ఎప్పటికీ మీ విధేయులం’ అన్న కార్డు మెడలో వేసుకుని తిరుగుతుంటారు. వీరు మీటింగ్స్ కొచ్చేది ఈ పనికే, సభలో వక్తలు చెప్పేది వినడానికి కాదు. వీళ్ళే నాలుగు ఇంగ్లీష్ కవితలు చదివి అరకొరగా అర్థం చేసుకుని మరికొంత పైత్యం జోడించి కవితలు రాస్తుంటారు. జిల్లాల్లో జరిగే సాహితీ సభల్లో పాల్గొంటూ ,లోకల్ భక్తి మ్యాగజైన్లలో రెండుచేతులతో కవిత్వం రాసి ఆ జిల్లాలో తిరుగులేని కవిచక్రవర్తుల్లా వెలుగుతుంటారు.
ముఖ పుస్తకంలో, వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఈ కొత్త కవుల దాడిని తట్టుకోలేక ఫేస్బుక్ ఓపెన్ చెయ్యాలన్నా, మొబైల్ తియ్యాలన్నాభయపడటం మొదలెడతారు. మీరంత చిన్నచూపు చూసిన ఆ పిల్ల కవులు మిమ్మల్ని వదలరు. ఏదో ఒక రోజు ఏ సండే స్పెషల్ ఎడిషన్ లోనో మిమ్మల్ని అటాక్ చేస్తారు. దొరికిపోతారప్పుడు మీరు. చలామణీ దెబ్బంటే అది. పెద్దల, అస్మదీయుల దీవెనలుంటే నాలుగు శుద్ధ వచనంలో రాసిన కవితలు కూడా ఫేస్‌బుక్‌ల్లో ఊరేగి, ఊరేగి మిత్ర బాంధవుల చేతిలో టాగ్ లయ్యి, ఆనక ఆ కవితా భావం యొక్క భారం ఎక్కువయ్యి పరభాషల్లోకి కూడా అనువాదం చెందిపోతుంటాయి. అన్నిరంగముల విస్తరించిన ఈ చలామణీ మహిమ ఇంతింతని చెప్పనలవి కాదు ఇలలో మిత్రమా!
నిజమైన ప్రతిభ ఉన్నవాళ్ళను లోకం గుర్తించే రోజొకటి రావాలని కోరుకుంటూ, మన వంతు కర్తవ్యంగా వారిని ముందుగా మనం గుర్తించడం మొదలుపెట్టి మనసా వాచా గౌరవిద్దాం. వారు రాసిన సాహిత్యం కొని, చదివి వారిని ప్రోత్సహిద్దాం. వీలు చూసుకొని వారిని సన్మానిద్దాం. అదొక్కటే మనం చెయ్యగలపని. పనిలో పనిగా పై పై మెరుగులతో చెల్లుబడి అయిపోతున్న జాదూగాళ్ళని కనిపెట్టే పనిలో ఉందాం. అయితే ముందే చెబుతున్నాను. ఈ పని చాలా ప్రమాదకరం. అక్కడా, ఇక్కడా ఆవేశపడి స్టేట్మెంట్ లిచ్చి వీపులు పగిలే దాకా తెచ్చుకోకండేం!
అల్లూరి గౌరీలక్ష్మి కథా, నవలా రచయిత్రిగా చక్కని పేరు సంపాదించారు. ఈమె మంచి కవయిత్రి, ఫెయిర్ కాలమిస్ట్ కూడా. నాలుగు కథా సంపుటాలూ, మూడు నవలలూ,రెండు కవిత్వ సంకలనాలూ,ఒక కాలమ్స్ బుక్ వెలువరించారు. APIIC Ltd. లో General Manager గా పనిచేసి పదవీ విరమణ పొందారు.
ఇందుగలరందులేరని సందేహంబు వలదు… ‘చలామణి ప్రతిభావంతులు’ ఎందెందు వెదకిన అందందే గలరు మిత్రమా! కంటే… అని చాల బాగా చెప్పారు గౌరీ లక్ష్మి గారు! అభినందనలు…
అసలైన ప్రతిభావంతులు ఎప్పుడూ వెనుకబడే ఉంటారు. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా? గిల్ట్ నగలకున్న మెరుపు అసలు నగలకు వుంటాయా? రచయిత్రి కి అభినందనలు
అక్షరసత్యాలు చెప్పారండీ గౌరీలక్ష్మిగారూ..
Chala baga chepparu madam…nithya sathyalu
Baga raasaru andi…E rojullo jarige viddooralu gurinchi Usharani..Gudiwada
రకరకాల మనస్తత్వాలు, మనుషులు గూర్చి చక్కగా విశ్లేషించారు 😊🤗 Pramila..Gudiwada
అంతేమరి. మాబాగాచెప్పేరు Goteti Lalita..Guntur
Good writing, genuine persons to be rewarded gauri Anuradha..Khairatabad
చలామణి మహిమ బావుంది Krishna Reddy..Malakpet
Baaga vayinchaaru..badhyata undali kalam patte vallaki.. Mallik..Bapatla
అభినందనలు మిత్రమా! Vijaya..Hyd
Nice one. Well presented.👍 Ramanamurty..Malkajgiri
Baavundi..Gouree Hemaraju..AV Palem
Super.. super..super Hymavathi..Banjarahills
సూపర్ చెల్లీ..ఖాసింబి.. గుంటూర్
గౌరీగారూ అబ్బబ్బో భలేగా ఏకేసారండి అవును మీకేం ప్రాబ్లం రాదా ఇలా రాస్తే ఎవరితరపునగాని నా కైతే బాగానచ్చీంది అన్ని departments ని భలే బైటపెట్టారు 👏👏👌👌👌👍👍 లత..చెన్నై
Baaga raasaru..nijaanni ee Lokam teerunu aratipandu volichi notli oettinattu..anta shudhanga yelaa raya galary..baaga gamaninchi raasaaru..chadivekoddi, nijam, nijam ani ganteyyali anipistundi. Congrats! Wishing many more truths to flow from the own if the writer . Thanks and regards,. A Raghavendra Rao.
Wonderful column G.Subbarao..Machilipatnam
ఏది ఏమైనా ‘ చాలా మనీ ‘ఉంటేనే ‘చలామణీ’ అనేది జీవన సత్యం సత్య కాలం నుండీ హత్యకాలం దాకా.ఆ మనీ లేనివారు మహా ‘ కాని చొరవ’ తో ‘చలో మని’ మరో దారిలో ‘ చలామణీ’ అవుతున్నారు. ప్రతి భావవంతుడూ, ప్రతిభావంతుడు కాదు అనే నిజాన్ని కప్పి ఉన్న నివురు మీద “ఉఫ్, ఉఫ్” అంటున్న గౌరీ లక్ష్మి గారు, చేతికి పూలుచుట్టుకుని చెంప దెబ్బలు వేయడంలో నిజమైన ప్రతిభావంతురాలు.ఆమె ఆ ‘అప్రతిభ – నప్రతిభావంతులను’ తన కలంతో కుళ్ళ పొడవాలనుకునే సాహసికురాలు. అందుకే రంగుల హేల కొన్ని సార్లు ఫిరంగుల హేల అని మనకు అనిపిస్తుంటుంది. చదువరులు ‘ఎంత మాట – ఎంత మాట’ అని బుగ్గపై వేలు వేసుకోవలసిందే.పేరు ప్రఖ్యాతులు కోసం తిప్పలు పడే కొందరి ‘పోరు ప్రఖ్యాతులు’ మనకు సుపరిచితమైన విషాద వినోదాలు లేదా వినోద విషాదాలు. లబ్ధ ప్రతిష్టులు వెనక బడిపోయి శబ్ద ప్రతిష్టులు ముందుకొస్తున్న, ముంచుకొస్తున్న ఈ యుగాన్ని గౌరిలక్ష్మి గారు అందంగా, మందంగా విమర్శించారు- పరామర్శించారు.వర్తమానంలో,నటన రాని నటుల పిల్లలు, రచన రాని రచయితలు, శోధన తెలియని పరిశోధకులు, రాజీ పడిన రాజకీయ వారసులు, స్వరాలకు గాయం చేసే గాయకులూ ఎంతో మంది ఈ వ్యాసంలో గౌరీలక్ష్మి గారి కొరడాకు చిక్కారు. రచయిత్రికి అభినందనలు. గోళ్ల నారాయణ రావు,విజయవాడ.
అక్షర సత్యాలు రాసారు..ఇటీవల కాలం లో చలామణి ప్రతిభా వంతులు రెచ్చిపోతు న్నారు.మీ వంటి వారి హెచ్చరిక పని చెయ్యాలని కోరుకుంటున్నాను.. కె.శేషమ్మ..కాకినాడ
బాగా రాసావే gowree రేణుకా దేవి..అమలాపురం
Very appropriate for nowadays Rajyalakshmi..Guntur
గౌరి, నీ వాయింపుకు అందని ముదుర్లు ఉన్నారు. అయినా గుమ్మడి కాయ దొంగలూ ఉన్నారు సాహిత్యానికి అర్థం తెలీని రచయిత లు,సంగీతం తెలీని గాయకులు, నటన తెలీని వారసుల నుండి మనల్ని మనమే కాపాడుకోవాలి. క్రియేషన్ కన్నా ప్రమోషన్ మీదే పడిపోవటం,తమపేరుకు ముందు తామే డా. అక్షరాన్ని తగిలించుకోవటం…ఎవరూ చెక్ చేయకపోవటం..అంతా ..చలామణి మాయ నీ శైలి చదివిస్తోంది అభినందనలు సంచికకు కృతజ్ఞతలు. భవానీ దేవి
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™