సృష్టి ప్రారంభంలో అందరూ దివ్యశక్తులు కల దేవతలే. అందరూ తపోధనులే. భూమ్మీద మానవసృష్టి జరిగాక మానవుల్లో గూడా ఈ దివ్యశక్తులుండేవి. వారు గూడా తపస్సు చేసి శక్తులు సంపాదించినవారే. కానీ రానురాను, తర్వాతి తరాల్లో – మన్వంతరాల్లో, ఈ మానవులు ఎలా దివ్యశక్తులు కోల్పోయి మామూలు మానవులుగా మిగిలిపోయారన్న విషయం తెలుసుకోవాలి. జీవులసృష్టి ప్రారంభించినపుడు బ్రహ్మ10 మంది ఋషులను సృజించి, ప్రజాసృష్టి గావించి, ప్రజాపతులుగా ఉండమన్నాడు. తర్వాత స్వాయంభువ మనువు, శతరూప పుట్టారు. వారికి ఇద్దరు పుత్రులు: ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ఇంకా ముగ్గురు పుత్రికలు: ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని కలిగారు. వీరి ద్వారా ప్రజాసంతతి అభివృద్ధి గాంచి లోకాలన్నిటికీ వ్యాపించింది. అందువల్ల దేవతలకూ, మానవులకూ గూడా మూలపురుషుడు స్వాయంభువ మనువే. అందరూ మనువు సంతతివారే. స్వాయంభువు బ్రహ్మపుత్రుడు గనక బ్రహ్మదేవుడు గూడా మానవులకు బంధువే మరి.
బ్రహ్మదేవుడు, సమస్త లోకాలనూ పాలించడానికి స్వాయంభువ మనువుని నియమించాడు. స్వాయంభువు తర్వాత ఆయన కుమారుడైన ప్రియవ్రతునికి పరిపాలనా భాధ్యతలు అప్పగించబడ్డాయి. ప్రియవ్రతునికిద్దరు భార్యలు. మొదటి భార్య బర్హిష్మతి, దేవశిల్పి విశ్వకర్మ కూతురు. ఆమెవల్ల ప్రియవ్రతునికి 10మంది పుత్రులు, 1 పుత్రిక కలిగారు. ప్రియవ్రతుని పుత్రులు: అగ్నీధ్రుడు (యాజ్ఞీధ్రుడు), ఇధ్మజిహ్వుడు, యజ్ఞబాహుడు, మహావీరుడు, హిరణ్యరేతుడు, ఘృతపృష్ణుడు, సవనుడు, మేధాతిథి, వీతిహెూత్రుడు, కవి. వీరిలో మహావీర, సవన, కవులు జ్ఞానమార్గాన్నెంచుకుని పరమహంసలయ్యారు.
ప్రియవ్రతునికి రెండవ భార్య వల్ల ముగ్గురు పుత్రులు కలిగారు: ఉత్తముడు, రైవతుడు, తామసుడు. వీరు కాలక్రమంలో మన్వంతరాధిపతులయ్యారు. ప్రియవ్రతుని పుత్రిక ఊర్జస్వతి. ఆమె భర్త భర్గవుడు. వారి పుత్రుడే శుక్రాచార్యుడు. ప్రియవ్రతుని పుత్రులవల్ల మానవజాతి అభివృద్ధి గాంచింది భూలోకంలో. దాన్ని గురించి తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు ప్రియవ్రతుని సోదరుడైన ఉత్తానపాదుడిగురించి తెలుసుకుందాం.
స్వాయంభువుని రెండవ కుమారుడైన ఉత్తానపాదునికిద్దరు భార్యలు: సునీతి, సురుచి. విష్ణుభక్తుడిగా హేరుగాంచిన ధ్రువుడు, సునీతికి పుట్టినవాడు. ఇతడు యమునానదీ తీరంలోగల మధువనంలో మహావిష్ణువు గురించి తపస్సు చేయగా విష్ణువు ప్రత్యక్షమై అతన్ని అనుగ్రహించగా అతను ధ్రువపథం పొందాడు. వీరివంశానుక్రమం: ధ్రువుడు–వత్సరుడు–పుష్పార్ణుడు–వ్యష్ణుడు– సర్వతేజుడు– చాక్షుషుడు(6వ మనువు) – ఉల్ముడు -అంగుడు—వేనువు–పృథువు–జితాశ్వుడు–హవిర్ధానుడు– ప్రాచీనబర్హి – ప్రచేతసులు–రెండవ దక్షుడు.
ఈ దక్షుడు సృష్టి ప్రారంభంలో బ్రహ్మకు పుట్టిన 10మంది ప్రజాపతుల్లో ఒకడు. ఆరవదైన చాక్షుష మన్వంతరంలో శివాపరాధం వల్ల మరణించి తిరిగి 7వదైన వైవస్వత మన్వంతరంలో ప్రచేతసులకు మారిష అనే భార్యవల్ల పుట్టి రెండవ దక్షుడుగా పేరుగాంచి ప్రజాసంతతిని పెంపొందించాడు. ఇప్పుడు స్వాయంభువ మనువు యొక్క పుత్రికల వల్ల కలిగిన ప్రజావృద్ధిని గూర్చితెలుసుకుందాం.
స్వాయంభువుని పుత్రికలను బ్రహ్మ సృజించిన ప్రజాపతుల్లో కొందరు వివాహమాడి ప్రజాసంతతిని అభివృద్ధి చేసారు. ఆకూతిని రుచి, దేవహూతిని కర్దముడు, ప్రసూతిని దక్షుడు వివాహమాడారు. ఈ జంటల వల్లే దేవాసురులు మొదలగు వారు జన్మించారు.
రుచిప్రజాపతి గూడా బ్రహ్మ సృజించినవాడే. బ్రహ్మ ముందుగా సృజించినవారి తర్వాత కలిగినవాడు. ఈ విషయం కొన్నిపురాణాల్లోనే ఉంది, ఉదా: వాయుపురాణం. ఈ దంపతులకు విష్ణువు-ఆదిలక్షి జన్మించారు యజ్ఞుడు-దక్షిణ అనువారిగా. తర్వాత వారు మిథునమయ్యారు. మిగతావారు: తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇడస్పతి, ఇధ్ముడు, కవి, విభుడు, వహ్ని, సుదేహుడు, రోచనుడు. వీరిని తుషిత దేవతలంటారు.
దేవహూతి-కర్దములకు 9 మంది పుత్రికలు, ఒక కుమారుడు కలిగారు. కుమారుడైన కపిలుడిని విష్ణువు యొక్క అవతారంగా భావిస్తారు. ఆయన తనతల్లికి జ్ఞానబోధ చేసి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఆ బోధే సాంఖ్య, భక్తియోగాలుగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
4.6 దేవహూతి-కర్దములపుత్రికలు,వారిభర్తలు,వారిసంతానం:
1.కళ-మరీచిప్రజాపతి:
వీరికి కశ్యపుడు-పూర్ణిమ పుట్టి మిథునమయ్యారు. వారికి విరజుడు-దేవకుల్య పుట్టి మిథునమయ్యారు.
2.అనసూయ-అత్రిప్రజాపతి:
వీరికి చంద్రుడు,దత్తాత్రేయుడు,దూర్వాసుడు పుట్టారు.
3.శ్రద్ద- అంగీరసప్రజాపతి:
వీరికి 4గురు పుత్రికలు: సినీవాలి, కుహూ, రాకా, అనుమతి. మళ్ళీ చాలాకాలానికి, రెండవ మనువైన స్వారోచిషుని కాలంలో ఇద్దరు పుత్రులు కలిగారు: ఉచధ్యుడు, బృహస్పతి.
4.హవిర్బువు-పులస్త్యప్రజాపతి:
వీరికి ఇద్దరు పుత్రులు: అగస్త్యుడు, విశ్రవసుడు. అగస్త్యుని భార్య లోపాముద్ర. విశ్రవసుకి ఇద్దరు భార్యలు: ఇలబిల, కైకసి. ఇలబిలకి కుబేరుడు పుట్టాడు. కైకసికి రావణ, కుంభకర్ణ, విభీషణులు పుట్టారు.
5.గతి-పులహప్రజాపతి:
వీరికి ముగ్గురు పుత్రులు: కర్మశ్రేష్టుడు, వరీయాంశుడు, సహిష్ణుడు.
6.క్రియ-క్రతుప్రజాపతి:
వీరికి 60వేలమంది వాలఖిల్యులను ఋషులు పుట్టారు.
7.ఖ్యాతి-భృగుప్రజాపతి:
వీరికి ఇద్దరు కుమారులు: ధాత, విధాత. ఒక కుమార్తె: శ్రీ. ధాత భార్య ఆయతి. వారికి మృకండ మహర్షి పుట్టాడు. ఆయనకు మార్కండేయుడు పుట్టాడు. విధాత భార్య నియతి. వారికి ప్రాణుడు పుట్టాడు. ఆయనకు వేదశిరుడు పుట్టాడు.
8.అరుంధతి- వశిష్ఠప్రజాపతి:
అరుంధతి కింకో పేరు ఊర్జ. వీరికి సప్తఋషులు పుట్టారు: చిత్రకేతుడు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుభృఢ్యానుడు, ద్యుతిమంతుడు. వీరికి ఇంకా శక్తి మొదలైన పుత్రులు 100 మంది పుట్టారు. వారంతా విశ్వామిత్రుని వల్ల సంహరించబడ్డారు. అరుంధతి చాలామంది అనుకున్నట్టు చండాల స్త్రీ కాదు. ఆవిడ కర్దమ ప్రజాపతి పుత్రిక.
9.శాంతి-అధర్వ ప్రజాపతి:
వీరికి ఇద్దరు కుమారులు పుట్టారు: ధృతవ్రతుడు, దధ్యంచుడు. వీరికి బహుసంతానం.
వీరికి 16 మంది పుత్రికలు పుట్టారు: శ్రద్ధమైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, ప్రియ, ఉన్నతి, బుద్ది, మేధ, తితీక్ష, హ్రీ, మూర్తి, స్వాహా, స్వధా, సతి. వీరంతా దేవతలే. వీరిలో స్వాహాదేవి అగ్ని భార్య. స్వధాదేవి పితృదేవతల భార్య. సతీదేవి శివుని భార్య. మిగతా 13 మందిని ధర్ముడు వివాహమాడాడు. వీరి సంతానం:
1.అగ్ని హెూత్రుడు-స్వాహాదేవి:
వీరికి 3 పుత్రులు: పావక, పవమాన, శుచి. వీరి వల్ల 45 రకాల అగ్నులు పుట్టాయి. అగ్నులందరూ కలిసి 49 మంది. వారిని 7రకాలుగా విభజించారు: అగ్నిష్వాత్తులు, బర్హిషతులు, సౌమ్యులు, పితరులు, నాజ్యపులు, సాగ్నులు, నిరగ్నులు.
2.పితృదేవతలు- స్వధాదేవి:
వీరికి ఇద్దరు పుత్రికలు: వయున, ధారుణి.
3.శివుడు – సతీదేవి:
వీరికి సంతానం లేదు. శివుని ఎడల దక్షుడపచారం చేయగా, సతి ఆత్మాహుతి చేసుకుంది. శివుని కోపానికి దక్షుడు బలయ్యాడు. ఆ తర్వాత మరణించి మళ్ళీ రెండవ దక్షుడుగా, తర్వాతి వైవస్వత మన్వంతరంలో పుట్టాడు. ఈ రెండవ దక్షుని సంగతి తర్వాత తెలుసుకుందాం.
తల్లులు – కుమారులు
శ్రద్ధ శ్రుతం
మైత్రి ప్రసాదం
దయ అభయం
శాంతి సుఖం
తుష్టి ముదం
పుష్టి స్మయం
క్రియ యోగం
ఉన్నతి దర్పం
బుద్ధి అర్థం
మేధ స్మృతి
తితీక్ష క్షేమం
హ్రీ ప్రశ్రయం
మూర్తి నర, నారాయణ ఋషులు
దక్షప్రజాపతి తన పుత్రిక సతిని శివునికిచ్చి వివాహం చేసాడు. శివుడ్ని అల్లుడిగానే చూసాడు గాని, పరమేశ్వరుడనుకోకుండా, ఆయన ఎడల అపచారం చేసాడు. అందుకు సతి ఆత్మాహుతి చేసుకోగా శివుడు కోపించి దక్షుడ్ని శిక్షించాడు. తర్వాత దక్షుడు మరణించాడు. ఇదంతా 6వ మన్వంతరమైన చాక్షుష మన్వంతరంలో జరిగింది. ఆ దక్షుడే మళ్ళీ తర్వాతి మన్వంతరమైన వైవస్వత మన్వంతరంలో పుట్టి రెండవ దక్షుడిగా పేరుగాంచాడు. ఆయన ప్రచేతసులనే ఋషులకు మారిష అనే భార్య వల్ల పుట్టాడు. ఆయన సామాన్యుడు కాడు, మహాతపశ్శాలి. తన యోగబలంతో అనేకరకాల జీవులను సృష్టించాడు: భూ, జల, ఆకాశాల్లో చరించేవి, అరణ్యాల్లో తిరిగేవి, రాత్రింబవళ్ళు సంచరించేవి, పక్షులు, సర్పాలు, వృక్షాలు, దేవ, దానవ, మానవ, యక్ష, కిన్నర మొదలగు జాతులను. ఐనా ప్రజావృద్ధి సరిగా జరగడం లేదని, విష్ణువుని గూర్చి తపస్సు చేసాడు. విష్ణువు అనుగ్రహించి ‘పంచజన’ ప్రజాపతి పుత్రికైన ‘యశిక్ని’ని భార్యగా చేసుకుని ప్రజాభివృద్ధి చేయమన్నాడు. దక్షునికి వేలమంది పుత్రులు కలిగారు. వారంతా నారదుని జ్ఞానబోధ వల్ల తపస్సుకు వెళ్ళిపోయారు. ఆయనకు మళ్ళీ 60మంది పుత్రికలు జన్మించారు. వారిలో 10 మందిని ధర్మునికి, 17 మందిని కశ్యపునికి, 27 మందిని చంద్రునికి, ఇద్దరిని భూతునకు, ఇద్దరిని అంగీరసునికి, మిగతా ఇద్దరిని కృశాశ్వునకిచ్చి వివాహంచేసాడు.
ఇక్కడ రెండవ దక్షుని పుత్రికలు, వారి భర్తలైన ప్రజాపతుల వల్ల పుట్టినవారిలో ముఖ్యులను గూర్చి మాత్రమే తెలుసుకుందాం. మొదటగా దక్షపుత్రికల్లో 10 మందిని ధర్ముడన్న ప్రజాపతి వివాహమాడాడు. వారిగురించి, వారి సంతానం గురించిన వివరాలు:
1.ధర్ముని భార్యలు 10 మంది – వారి సంతతి:
భానువు – వేదుడు, ఋషభుడు, ఇంద్రసేనుడు
లంబ – విద్యోతుడు.
కకుబ్దేవి – సంకటుడు
భూమిదేవి- దుర్గభూమికధిష్ఠానదేవతలు
విశ్వదేవి – విశ్వేదేవతలు
సాధ్యాదేవి -సాధ్యులు
మరుత్వతీదేవి- మరుత్వంతుడు,జయంతుడు
ముహూర్తాదేవి -సకలభూతాలకు ఆయా కాలాల్లో కలిగే ఫలితాల్నిచ్చే
మౌహూర్తికులు-7 దేవగణాలు
సంకల్పాదేవి- సంకల్పుడు
వసుదేవి – అష్టవసువులు: ద్రోణుడు, ప్రాణుడు, ధ్రువుడు, అర్కుడు, అగ్ని, దోషుడు, వస్తువు, విభావసువు.
వీరిలో ‘వస్తువు’ భార్య అంగీరసవల్ల విశ్వకర్మ పుట్టాడు. అతనికి ‘ఆకృతి’అనే భార్యవల్ల 6 వ మనువైన చాక్షుషుడు పుట్టాడు. ఈ వసువులకు జన్మించిన వారిలో కొందరు కొన్ని భావోద్వేగాలకు అభిమానదేవతలుగానున్నారు:
ద్రోణుడు – హర్షం, శోకం, భయం
ప్రాణుడు – సహుడు, ఆయుడు, పురోజవుడు
ధ్రువుడు – అనేకమంది పుత్రులు
అర్కుడు – ధరాదులు
అగ్ని – ద్రవిణకాదులు, కృత్తికలకు స్కందుడు, ఆయనకు విశాఖాదులు
దోషుడు – హరికళ, శింశుమారుడు
వస్తువు -విశ్వకర్మ. అతనికి 6వ మనువైన చాక్షుషుడు
విభావసు – వ్యష్టి, రోచి, ఆతపుడు
సురూప- కోట్లాది రుద్రులు, రుద్రపారిషదులు, ప్రేతగణాలు, వినాయకులు
స్వధ – పితృగణాలు
సతి -అధర్వవేదాభిమానదేవతలు
అర్చి – ధూమ్రకేశుడు
ధిషణ- దేవలుడు,వయనుడు,మనువు
అదితికి పుట్టిన వారు దేవతలు. వారంతా మనువులయ్యారు: వివస్వంతుడు, అర్యముడు, పూషుడు, త్వష్ట, సవిత, భగుడు, ధాత, విధాత, వరుణుడు, మిత్రుడు, మిత్రా వరుణుడు, శక్రుడు, ఉరుక్రముడు.
దితికి పుట్టినవారు దైత్యులు. దితిపుత్రులు: హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు.
హిరణ్యకశ్యపుని సంతతి: ఆయన భార్య లీలావతి వల్ల 4 పుత్రులు: ప్రహ్లాద, అనుహ్లాద, సంహ్లాద, హ్లాద, ఇంకా ఒక పుత్రిక: సింహిక పుట్టారు.
ప్రహ్లాదునికి దేవి అనే భార్యవల్ల విరోచనుడు, ఆయనకి బలి, బలికి బాణుడు అనే పుత్రునితో కలిపి 100 మంది పుత్రులు పుట్టారు. అనుహ్లాదునికి ఊర్మి అనే భార్యవల్ల బాష్కలుడు, మహిషుడు పుట్టారు. సంహ్లాదునికి గతి అనే భార్యవల్ల పంచజనుడు కలిగాడు. హ్లాదునికి దమని అనే భార్యవల్ల ఇద్దరు పుత్రులు: వాతాపి, ఇల్వలుడు పుట్టారు. వారిని అగస్త్య మహర్షి సంహరించాడు. సింహికకు రాహువు పుట్టాడు. దితికి మరుత్తులనేవారు 49 మంది పుత్రులు కలిగి ఇంద్రునివల్ల దేవత్వం పొందారు.
తనువుకు దేవతలకు శత్రువులైన 18మంది పుత్రులు కలిగారు: ద్విమూర్ఖుడు, శంబరాసురుడు, అరిష్టుడు, హయగ్రీవుడు, విభావసుడు, అయోముఖుడు, శంకుశిరుడు, స్వర్భానుడు, కపిలుడు, అరుణి, పులోముడు, వృషపర్వుడు, ఏకచక్రుడు, అనుతాపకుడు, ధూమ్రకేతుడు, విరూపాక్షుడు, దుర్జయుడు, విప్రచిత్తి.
వీరిలో స్వర్భాను పుత్రికను నముచి వివాహమాడాడు. వృషపర్వుని కూతురు శర్మిష్ఠను యయాతి (నహుషుని పుత్రుడు) వివాహమాడాడు. ఆమె కుమారులు: ద్రుహ్యుడు, అనువు, పూరుడు.
యయాతి పెద్దభార్య దేవయాని (శుక్రాచార్యుని కూతురు). ఆమె పుత్రులు: యదు, తుర్వసుడు. యయాతికి అకాల వృద్ధాప్యంవచ్చింది శుక్రుని శాపంవల్ల. ఆయన తన పుత్రులను అడిగాడు ఎవరైనాగాని తన వృద్ధాప్యం తీసుకుని తమ యవ్వనాన్నిఇమ్మని, అలా ఇచ్చిన వారికే రాజ్యాధికారం దక్కుతుందని గూడా చెప్పాడు. ఆయన 5గురు కుమారుల్లో పూరుడు మాత్రమే తండ్రి చెప్పినట్లు చేసి రాజ్యాధికారం పొందాడు. యదువంశంవారైనయాదవులకు రాజ్యాధికారం లేదు. పూరుని వంశంలోని వాడైన ఉగ్రసేనుడి కొడుకే కంసుడు.
తనువు కుమారుల్లో ఒకడైన అరుణికి 4గురు పుత్రికలు: ఉపదానవి, హయశిరసి, పులోమి, కాలక. ఉపదానవిని హిరణ్యాక్షుడు, హయశిరసిని క్రతుప్రజాపతి, పులోమ, కాలకలను కశ్యప ప్రజాపతి వివాహమాడారు. పులోమకు పౌలోముడు, కాలకకు కాలకేయుడు పుట్టారు. వారికి 60వేలమంది రాక్షసులు పుట్టారు. వారి పని యజ్ఞకార్యాలను పాడుచేయడం. వారిని అర్జునుడు సంహరించాడు. విప్రచిత్తికి సింహిక అనే భార్యవల్ల రాహువు మొదలగు 100 మంది కొడుకులు కలిగి గ్రహత్వం పొందారు.
ఇంతవరకు ఊర్ధ్వలోకాల్లో ప్రజాసృష్టి ఎలా జరిగిందో తెలుసుకున్నాం. ఇంక మనం నివసిస్తున్న భూమ్మీద మానవసృష్టి ఎలా జరిగిందో తెలుసుకోవాలి తరువాతి అధ్యాయంలో.
(ఇంకా ఉంది)
అమ్మ గారు నమస్కారం. రెండవ దక్షుని పుత్రికలలో ‘ధర్ముడు’ వివాహమాడిన 10 మందిలో ఒకరైన ‘వసుదేవి’ అష్టవసువులకు జన్మనిచ్చింది. ఈ అష్ట వసువులలో ఒకడైన ‘వస్తువు’ కు అతని భార్య ‘అంగీరస’ వల్ల విశ్వకర్మ పుట్టాడు. ‘విశ్వకర్మ’ కు అతని భార్య ‘ఆకృతి’ యందు 6వ మనువైన ‘చాక్షుషుడు’ పుట్టాడు. 7వ మన్వంతరము వారైన రెండవ దక్షుని సంతతతికి 6వ మనువు చాక్షుషువు పుట్టాడని అన్నారు ఇదెలా సాధ్యం. అలాగే ఉత్తముడు 3 వ మన్వంతరము, రైవతుడు 4 వ మన్వంతరం, తామసుడు 5 వ మన్వంతరము వారు. ఇంకొక సందేహము రెండవ దక్షుని కుమార్తె ద్వారా ధర్ముడి కి కలిగిన వారసత్వ పరంపరలో 6 వ మన్వంతరాదిపతి చాక్షుషువు జన్మించాడని అన్నారు మళ్ళీ స్వయంభువు కుమారుడు ఉత్తానపాదునికి ధ్రువుడి వంశానుక్రమంలో సర్వతెజునికి 6 వ మనువు చాక్షుషువు అని అంటున్నారు . దయతో నా ఈ సందేహాలను నివృతి చేయగలరని మనవి. నమస్కారములతో శ్రీహరి.
Your email address will not be published. Required fields are marked *
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
గూఢచారి లాంటి The Wedding Guest
జీవన రమణీయం-85
‘యాత్ర’ చూద్దామా ఎపిసోడ్-11
నీలమత పురాణం – 52
మానస సంచరరే-30: మనసే అందాల బృందావనం!
All rights reserved - Sanchika™