కోర్టుకి హాజరయ్యాడు అస్తవ్యస్త.
“నాకే పాపం తెలియదు. ఎవరో కుట్ర పన్నారు” అని చెప్పాడు. వాదోపవాదాలు జరిగాయి.
తీర్పు అస్తవ్యస్తకి వ్యతిరేకంగా వచ్చింది.
బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పి, అపరాధం చేసినందుకు ఇతనికి రెండేళ్ల జైలు శిక్ష వేశారు.
అన్ని చానల్స్ లోనూ రోజుకి 24 గంటలూ ఓ వారం రోజుల పాటు ఇదే వార్త.
చాలా డబ్బు ముందే పోయింది. ఇప్పుడు నష్టపరిహారం కోసం మిగిలిన ఇల్లు కూడా అమ్మేయ్యాలి. బ్యాక్ టు స్క్వేర్ ఒన్ లాగా మళ్లీ రోడ్డున పడాలి.
తను ఒక్కడే అయితే అదో రకం. అమ్మ కూడా వుంది. ఇల్లు అమ్మేసి తను జైలుకు పోతే పాపం ఆవిడ ఎట్లా బతుకుతుంది?
అస్తవ్యస్త మనసు వికలమై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
అప్పుడే బ్లాక్ మెయిల్. రాయ రావటం జరిగాయి.
పరిస్థితి గమనించిన రాయ రంగంలోకి దిగాడు. పై కోర్టుకి వెళ్ళాడు. సూర్యారావు అనే లాయర్ని పెట్టాడు. ఆ సూర్యారావు బోల్డంత ఫీజు పుచ్చుకున్నా అఖండుడు.
కేసంతా తిరగ తోడాడు. వినాష్ గుట్టు రట్టు చేసాడు.
ఫలితం అస్తవ్యస్తకి బదులుగా వినాష్‌కి పడ్డాయి జైలు శిక్షా, జరిమానా.
జరిమానా ఎడమ చేత్తో కట్టేశాడు శాంతికుమార్. కొడుక్కి తెల్లారేసరికి బెయిల్ కూడా తెప్పించాడు.
“జరిగిన అవమానం చాలు. ఆ అస్తవ్యస్త జోలికి పోకుండా నీ మానాన నువ్వుండు” అని కొడుక్కి హితవు చెప్పాడు.
ఏవీ లేకుండానే అస్తవ్యస్త మీద కత్తి కట్టిన వినాష్ ఇంత జరిగాక ఊరుకుంటాడా. ఏవో ప్లాన్లు వెయ్యటం మొదలు పెట్టాడు.
అస్తవ్యస్త ఫుల్ బిజీ. మళ్లీ పుంజుకోవాలి. అదే ధ్యాస.
అదే సమయంలో వెంకట స్వామి దగ్గరకు వెళ్ళింది ఆత్రత.
ఇంకో ప్రేమలేఖ రాసింది. తాను తొలి చూపులోనే ఎంతగా ప్రేమించిందో రాసింది. ‘మీరు కాదంటే నాకు ఆత్మహత్య శరణం’ అని రాసి వెంకట స్వామికి ఇచ్చి ఒకవేళ తాను చచ్చిపోతే అని చెప్తుండగానే
‘అవసరం లేదు. కిందటి సారి చెప్పాను. తాను చచ్చిపోతాను అంటే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పారు ఆయన’ అన్నాడు.
ఆత్రత ఆనందానికి అవధులు లేవు. ‘మరిన్నాళ్ళూ చెప్పావు కావేం’ అని ఇంటికెళ్లి స్నానం చేసి ఇస్త్రీ చీరె కట్టుకుని ఆకు పచ్చ కార్డు పుచ్చుకుని అస్తవ్యస్త ఇంటికి వచ్చింది.
భాగ్యలక్ష్మికి విసుగేసింది. ‘మాక్కావాలసింది ఈ ఆకుపచ్చ కార్డు కాదమ్మాయ్. అసలు ఇప్పుడు ఏ కార్డు వద్దు. అప్పట్లో మా అబ్బాయి పరిస్థితి బావుండలేదు. అందుకే పెళ్ళి చేద్దాం అనుకున్నా. ఇప్పుడు అంతా చక్కబడింది. కాబట్టి ఆ ఆలోచన మానుకున్నాను’ అంది.
‘కాదండీ. మీ అబ్బాయి నన్ను పెళ్ళి చేసుకునెందుకు ఒప్పుకున్నారుట. మా వెంకటస్వామి బాబాయ్‌తో స్వయంగా చెప్పారుట’ అంది ఆత్రత.
‘ఓసి నీ పిచ్చి దొంగలు తోలా. మా అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే నాతో చెప్తాడు. మీ బాబాయికి ఎందుకు చెప్తాడు?’ అంది భాగ్యలక్ష్మి.
‘పెద్దవాళ్ళకి చెప్పటానికి సిగ్గేస్తుంది కదండీ. అందుకే అలా చెప్పేరేమో’ అంది ఆత్రత మెలికలు తిరుగుతూ.
‘నాకు కాబోయే కోడలు ముందు నాకు నచ్చాలి. నువ్వు నాకు నచ్చలేదు’ అంది భాగ్యలక్ష్మి విసుగ్గా.
‘ఆయన స్వయంగా చెప్పాక మీకు నచ్చటం ఎందుకు ఏడవటానికి’ అంది ఆత్రత.
‘నువు బయటకు ఫో’ అని ఆవిడా, ‘పోను’ అని ఆత్రత ఇద్దరూ వాదించుకుంటూ వుంటే ఆ గోల విని బయటకు వచ్చాడు అస్తవ్యస్త.
‘ఏవిటమ్మా. ఎవరీ అమ్మాయి’ అని అడిగాడు.
చెప్పింది ఆవిడ.
‘నేను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదే’ అన్నాడు.
దొర్లి ఏడవటం మొదలు పెట్టింది ఆత్రత.
‘నా హృదయం బద్దలు కొట్టకండి. నన్ను అన్యాయం చేయకండి’ అని శోకాలు.
అప్పుడు గుర్తు వచ్చింది అస్తవ్యస్తకి.
వెంటనే నవ్వు వచ్చింది. ‘నువ్వు తప్పుగా అర్ధం చేసుకున్నావ్. నేను పెళ్లి చేసుకోకపోతే నువ్వు చచ్చిపోతావేమో అంటే అప్పుడు సరే అన్నమాట నిజమే. నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానని కాదు. ఇంకెవరినో నేను పెళ్ళి చేసుకుంటే నువ్వు ఆత్మహత్య మానేస్తావని అనుకున్నా.’
తెల్లబోయింది ఆత్రత.
‘అలా ఎవరైనా చేస్తారా’అని గోల పెట్టింది.
మీరు నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతా’ అంది.
‘ఛస్తే చావు’ అంది భాగ్యలక్ష్మి.
ఆత్రతని చూసి జాలేసింది అస్తవ్యస్తకి. కాస్తంత కృతజ్ఞత కూడా కలిగింది.
ఈ అమ్మాయి ఉత్తరం రాసి ఇవ్వకపోతే ఈ కథ జరిగేది కాదు. తను కష్టాల్లో నుండి బయట పడటానికి పరోక్షంగా కారణం అయిన ఆత్రతకి సాయం చేయాలని అనిపించింది. అందుకే ‘పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండాలని నాకోరిక. నీకు నా దగ్గర ఉద్యోగం ఇస్తాను’ అన్నాడు.
‘ఈ పిల్లకి వేప కాయంత వెఱ్ఱి. ఏం ఉద్యోగం ఇస్తావు’ అంది భాగ్యలక్ష్మి.
‘ఏదో ఒకటి. సెక్రటరీగా ఇస్తాను’ అన్నాడు.
నెత్తిన బుట్టెడు మల్లెలు దిమ్మరించినట్లు అయింది ఆత్రతకి.
సెక్రెటరీ అంటే జయంతి.
సెక్రటరీ అంటే రాజశేఖరం.
సెక్రటరీ అంటే ప్రేమ.
ఆ ఉద్యోగం చాలు. ఏడాది తిరిగే సరికి పెళ్ళొద్దన్న ఈ బ్రహ్మచారి ఈ సెక్రటరీని పెళ్లి చేసేసుకుంటాడు అనుకుంది.
కానీ ఆమె ఊహించలేదు, ఏడాది కాదు రెండునెలల్లో అస్తవ్యస్త జీవితంలోకి అతని ఊహా సుందరి ప్రవేశిస్తుందని.
(సశేషం)
పొత్తూరి విజయలక్ష్మి హాస్యకథలకు ప్రసిద్ధి పొందిన రచయిత్రి. తెలుగులో హాస్యాన్ని సృష్టించగల అతికొద్దిమంది రచయితల్లో అగ్రస్థానంలో ఉంటారు. వీరి నవల ‘ప్రేమలేఖ’ “శ్రీవారికి ప్రేమలేఖ” అనే హిట్ సినిమాగా రూపొందింది. ‘జ్జాపకాల జావళి’ వీరి ఇటీవల విడుదలైన పుస్తకం.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™