మన సమాజంలో పదిమంది మధ్య ఉంటాం, ఏదో మాట్లాడుకుంటాం, చర్చించుకుంటాం, పిచ్చాపాటి మాట్లాడుకుంటాం. సీరియస్గా మాట్లాడుకుంటాం. ప్రతి సందర్భాలలోనూ, ప్రతీ సంఘటనలలోనూ మన జీవిత సందర్భాలను, జీవన సంఘటనల్ని చొప్పిస్తూ ఉంటాము. మన భావోద్వేగాల్ని, ఎమోషన్సు మన వాళ్లు అనుకున్న వాళ్ల దగ్గర వెల్లడి చేస్తాం. సంధ్య పరిస్థితి అదే.
డాక్టర్సు అందరికీ కాన్ఫరెన్సు జరుగుతోంది. జిల్లా ప్రధాన కేంద్రంలో ఆ కాన్ఫరెన్సుకి హాజరయ్యారు సుధాకర్, సంధ్య. ఆ కాన్ఫరెన్సు అయిపోయి అది చివరిరోజు, అందరూ ఎవరి స్థావరాలకి వాళ్ళు వెళ్ళిపోయే చివరి రోజు విందు ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో బయటనున్న లాన్లో కూర్చున్నారు సుధాకర్, సంధ్య.
“మా వాళ్ళు మీ ఇంటికి వద్దామనుకుంటన్నారు”
“ఎందుకు?”
“అలా అడగడం ఏంటి? మన పెళ్ళి విషయం మాట్లాడ్డానికి”
ఆమె మాటలకి ఏ జవాబియ్యకుండా మౌనంగా గంభీరంగా ఆలోచిస్తున్నాడు సుధాకర్. తను పది సంవత్సరాల వయస్సు వచ్చే వరకూ తల్లిదండ్రుల్ని ఎంతో అభిమానించాడు. ఆ తరువాత పరిస్థితుల ప్రభావం వల్లనో, లేక వయస్సు ప్రభావం వల్లనో ఏదైతేనేమి తను వాళ్ళని ద్వేషించాడు, మనస్తాపానికి గురిచేశాడు. సూటిపోటి మాటలో వాళ్ళను హింసించాడు.
ఆ కౌమార వయస్సులో కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు, తోబుట్టువులు, తన వాళ్ళు అనుకునే వాళ్ళందరూ విరోధులుగా అగుపడ్డారు. కారణం ఆ వయస్సు వాళ్ళు తమని తాము సరిగా అంచనా వేసుకోలేకపోవడం, సమస్యలన్నీ తమకే అని అనుకోవడం, ఫలితంగా దీనికి కారణం ఎదుటి వాళ్ళని బాధ్యుల్ని చేయడం. అలగడానికి, కోపతాపాలు ప్రదర్శించడానికి, తన వాళ్ళే ఎరలవుతూ ఉంటారు.
తన విషయంలో తన కోపతాపాలకి తన తల్లిదండ్రులే ఎరలయ్యారు. తన అనుచిత ప్రవర్తనకి తన తల్లిదండ్రులు తల్లడిల్లిపోయేవారు. వాళ్ళు బాధపడూ ఉంటే తను నవ్వుకునేవాడు. అలాంటి శాడిస్టు మెంటాల్టీ తనకి ఉండేది. ఆ తరువాత తను ఇల్లు వదిలి పెట్టి వచ్చేసేడు. సౌందర్య మాటలో తను ఎంత తప్పు చేశాడో, ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నాడో తెలియవచ్చింది. తను చేసిన తప్పు తెలిసిన తరువాత హృదయం బాధతో కలుక్కుమంది.
ఆ తరువాత సంధ్య తన మాటల్తో తనకి తన తల్లిదండ్రుల మీదున్న ప్రేమను వెల్లడించడం, తను తన తల్లిదండ్రుల్ని ఎంత అభిమానిస్తున్నదీ చెప్పగా విన్నాడు. ఆమె మాటలు విన్న తరువాత తనలో ఆత్మవిమర్శ ఆరంభమయింది. తను కూడా తన తల్లిదండ్రుల్ని ఎందుకు ప్రేమించలేకపోయాడు? తను ఎందుకు వాళ్ళను ద్వేషించాడు అని అనుకున్నాడు. తను చేసిన తప్పుకి సద్విమర్శ చేసుకున్నాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తన తల్లిదండ్రుల దగ్గరికి పరుగెత్తి వెళ్ళి క్షమాపణ వేడుకున్నాడు. వాళ్ళు తనని క్షమించేము అనే వరకూ తన మనస్సుకి శాంతిలేకుండా పోయింది.
ఇన్నాళ్ళకి ఇప్పుడిప్పుడే తను ఇన్నాళ్ళు పోగొట్టుకున్న ఆప్యాయతానురాగాలు తన వాళ్ళ దగ్గర పొందుతున్నాడు. తన కౌమార వయస్సులో చేసే హాని ఇంతా అంతా కాదు. ఆ వయస్సులో మార్గం తప్పితే, మనసు క్షోభపడితే అన్నీ గాయాలే. ఈ ప్రాయంలో తాము కోరుకున్నవి దక్కకపోతే తమ చుట్టు ప్రక్కలలోని ప్రతీ ఒక్కరూ భయంకరంగానే అగుపిస్తారు. ఆ వయస్సు వాళ్ళకి ఎవ్వరూ తమను అర్థం చేసుకోవడం లేదనుకోవడం సహజం. ఫలితంగా ఒక విధమైన వత్తిడి.
ఇవన్నీ తను అనుభవించాడు. తనవాళ్ళకి దుఃఖాన్ని మిగిల్చాడు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడ్డాయి అని అనుకుంటున్న సమయంలో సంధ్య ప్రస్తావన ప్రశాంతమైన నదిలో సాగరంలో అలలు రేపడానికి విసిరిన రాయిలా అనిపించింది సుధాకర్కి.
సంధ్య తనని ఇష్టపడవచ్చు. నిజానికి వస్తే తను కూడా ఆమెను ఇష్టపడుతున్నాడు. అయితే ఆమె పుట్టి పెరిగిన వాతావరణం వేరు. తనింటి వాతావరణాన్ని ఒకానొక సమయంలో తనే ఏవగించుకునేవాడు. అడుగడుగునా అగుపడిన ఆర్థిక సమస్యలు, తనకి కోపం తెప్పించేవి, అసహనం పెంచేవి.
తనే ఇమడలేకపోయిన అటువంటి వాతావరణంలో సంధ్య ఇమడగలదా? అది ఇంపాజిబుల్. ఏదో మొదట మోజులో ఒప్పుకుని తనని పెళ్ళాడినా ఆ తరువాత తన కుటుంబంలో అనేక సంఘర్షణలు, స్పర్థలు, చోటు చేసుకుంటాయి. ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా ఉంది ఇంటి వాతావరణం. తనని తనకి కన్నతల్లి కాకపోయినా తన ప్రేమ పంచి ఇస్తోంది తన తల్లి. తనకి పిల్లలు పుడ్తే తనని ఎక్కుడ ప్రేమగా చూడలేకపోతాననో తనకి పిల్లలు పుట్టకుండా చేసుకున్న త్యాగమూర్తి. సంధ్య రాకతో అటువంటి మంచి మనుష్యుల మధ్య సంఘర్షణలు తలెత్తి ఇంటి వాతావరణం అశాంతితో కలుషితం అయితే తను అసహనానికి గురవుతాడు.
“ఏంటి ఆలోచిస్తున్నారు సుధాకర్?
“నీ గురించే”
“నా గురించా?
“అవును నా జీవితం తెరిచిన పుస్తకం, నా జీవితంలో జరిగిన సంఘటనలన్నీ నీకు తెలుసు. నేను నీ దగ్గర ఏదీ దాచలేదు. నీవు పుట్టి పెరిగిన వాతావరణం వేరు, నా ఇంటి వాతావరణం వేరు. మా ఇంటి వాతావరణంలో నీవు ఇమడగలవా? ఏదో ఇప్పుడు అంగీకరించి తరువాత కుటుంబంలో సమస్యలు ఎదురయితే నేను తట్టుకోలేను. అలాంటి సమయంలో ఇవతల నిన్ను వదులుకోలేను. అవతల నా వాళ్ళను వదులుకోలేక మధ్యన నేను నలిగిపోతాను.”
“ఆ సమస్య లేవీరాకుండా నేను చూసుకుంటాను మహానుభావా! నీ వాళ్ళని నా వాళ్ళలా భావిస్తాను, సరేనా?”
“చెప్పడానికి అన్ని మాటలూ ఇంపుగానే ఉంటాయి అయితే ఆచరణకి వచ్చేప్పటికి అసలు సమస్య ఎదురవుతుంది.”
“ఏ సమస్యలూ రాకుండా నేను చూసుకుంటానని మాట ఇస్తున్నాను.”
అతను ఆమె మాటలకి మౌనం వహించాడు. అతని మౌనం అర్ధాంగీకారంగా భావించింది సంధ్య, ఇద్దరూ డిన్నరు చేయడానికి లేచారు.
సంధ్యను చూసి వచ్చారు సారధి – సుమిత్ర. సుందరం వాళ్ల ఇంటి వాతావరణం, వాళ్ళ ఆస్తిపాస్తులు చూసి వచ్చిన సుమిత్ర ఇలాంటి కలవారింటిలో అష్టైశ్వర్యాల మధ్య పుట్టి పెరిగిన పిల్ల తమతో కలిసి ఉండగలదా? అని అనుకుంది.
ఇవతల సుమిత్ర ఎలా ఆలోచిస్తోందో అవతల సుభద్రా సుందరం అలాగే ఆలోచిస్తున్నారు. తమ ఇంటి వాతావరణంలో పుట్టి పెరిగిన సంధ్య అలాంటి సామాన్య ఇంటిలో మనగలదా? చూద్దాం. అంతగా ఉండలేకపోతే ఓ పెద్దిల్లు అద్దెకు తీసుకుని ఉండమని చెప్పాలి. అంతగా కాకపోతే సుధాకర్ తల్లిదండ్రులు వాళ్ళ దగ్గరికే వెళ్ళి ఉంటారు.
సుమిత్ర సారధి దగ్గర తన మనుస్సులో ఉన్న సందేహం వ్యక్తపరిచింది. భార్య బోళాతనానికి చిన్నగా నవ్వుకున్నాడు సారధి. “సుమిత్రా! ఇప్పుడు రోజులు మారాయి, రోజులతో పాటే మనుష్యులు, వాళ్ళ మనస్తత్వాలు కూడా మారాయి. స్వార్థం పెరిగింది. ప్రతీ ఒక్కరిలోనూ, మన కుటుంబం అని అనుకునే స్థానంలో నేను, నా కుటుంబం, నా పిల్లలు, అనే భావం ప్రతీ వాళ్ళలో చోటుచేసుకుంది.
సమిష్టి కుటుంబాల స్థానంలో వ్యష్టి కుటుంబాల ప్రాముఖ్యత పెరిగింది. పుట్టిన పిల్లలు మగవాళ్లయితే ఉద్యోగాల పేరుతో దూర ప్రదేశాలకి వెళ్ళిపోతున్నారు. ఆడపిల్లలు అయితే పెళ్ళిళ్ళ పేరుతో విడిపోతున్నారు. ఎంతమంది పిల్లలున్నా చివరికి మిగిలింది. భర్తకి భార్య, భార్యకి భర్త, ఇలా అవడం కూడా ఒకందుకు మంచిదే. ఒక దగ్గరుండి, మనస్పర్థలు ఏర్పడి ఇంటి వాతావరణం అశాంతి మయం అయ్యేకంటే వేరుగా ఉండి అప్పుడప్పుడు కలుసుకుని, ఆప్యాయతతో పలకరించుకుని ఆనందంతో గడపడం మంచిది కదా!” సుమిత్రతో అన్నాడు సారధి. భర్త చెప్పిన దాంట్లో నిజం ఉందనిపించింది సుమిత్రకి.
మనం ఒకరికి మాట ఇవ్వడం సులువు, అయితే ఆ మాట నిలబెట్టుకోవడమే కష్టం. పెళ్ళయిన తరువాత అత్తవారింటిలోనే ఉంటోంది సంధ్య. సుధాకర్ ఓ గ్రామంలోని డ్యూటీ అయితే సంధ్యకి మరో గ్రామంలో డ్యూటీ, ఇద్దరూ ఉదయం పది గంటలకి ఇల్లు వదిలి వెళ్లిపోతే తిరిగి రాత్రికి కాని ఇంటికి చేరుకోలేని పరిస్థితి. అన్ని సదుపాయాలూ వారికి సమకూరుస్తూ ఎన్నో విధాలా సహాయ సహకారాలు అందచేస్తోంది. సుమిత్ర. అది తన బాధ్యత అని ఆమె అనుకుంటోంది.
అయితే అందరి స్వభావాలూ ఒక్కలాగే ఉండవు. అత్తవారింటి వాతావరణానికి అడ్జస్టు కాలేకపోతోంది సంధ్య, ఎబౌవ్ హైక్లాసు సొసైటీలో మసిలి, ఇంట్లో అన్ని సదుపాయాల మధ్య పుట్టి పెరిగిన సంధ్యకు అత్తవారింటిలో అడుగడుగునా అన్నీ కొరతగానే అగుపిస్తున్నాయి.
తను సుధాకర్ని పెళ్ళి చేసుకుందామనుకుంది కాని మధ్య తరగతి జీవితాలు ఇలా ఉంటాయి అని తను అసలే ఊహించలేదు. ఇలాంటి కుటుంబాల జీవితాల్లో అడుగడుగునా సమస్యలే. అంతేకాక అనేక లోటుపాట్లు. అందుకే సుధాకర్ కూడా తన చిన్న వయస్సులో ఇలాంటి జీవితాన్ని ఏవగించుకున్నాడు. ఆ ఇంటి వాతావరణంలో పుట్టి పెరిగిన అతనే ఆ వాతావరణాన్ని ఏవగించుకున్నప్పుడు మరి తను ఇలాంటి జీవితాన్ని నిరసిస్తోందంటే విచిత్రం లేదు.
ఇక్కడ వాతావరణంలో నీట్నెస్ తనకి అగుపించటం లేదు. అంతెందుకు తనకి అత్తగారు కొసరి కొసరి వడ్డించి భోజనం తినిపిస్తున్నా ఏవో చెప్పలేని వెలితి. తన తల్లి తినిపించినంత తీరుగా ఇక్కడ ఎంత ఆప్యాయతగా తినిపించినా వస్తుందా?
పరిసరాలే కాదు ఇక్కడ భోజన అలవాట్లు కూడా తనకి నచ్చటం లేదు. భోజనం రుచికరంగా లేదు. అదే రుచికరంగా అనిపించటం లేదు. ఈ పరిసరాలలో తను ఇమడ లేకపోతోంది. అందుకే తనలో అసహనం పెరిగిపోతోంది. ఒక్కొక్క పర్యాయం విసుగు కూడా కలుగుతోంది. ఆ విసుగు తను ఒక్కొక్క పర్యాయం భర్త మీద చూపిస్తోంది.
ఇంట్లో తన ప్రవర్తన చూసి పెద్దవాళ్ళు కూడా విస్తుపోతున్నారు, బాధపడ్తున్నారు. తన మానసిక స్థితి చూసి సుధాకర్ తనతో “సంధ్యా పరిసరాలకి అలవాటు పడేవరకూ అలాగే ఉంటుంది. అడ్జస్టు అవు” అని అన్నాడు. అయితే తను అలా అడ్జస్టు అవలేకపోతోంది.
ఇరవై, ఇరవది ఐదు సంవత్సరాలు పుట్టింట్లో ఉండి అక్కడ వాతావరణానికి అలవాటు పడి ఒక్కసారి అత్తవారింటికి వచ్చి అట్టే పరిచయం లేని మనుష్యుల మధ్య, పరిసరాల మధ్య మెలగాలంటే ఆడపిల్లకి కష్టమే. తన ఒక్కదానికే కాదు క్రొత్తగా అత్తవారింటిలో అడుగు పెట్టిన ప్రతీ ఆడపిల్లకీ ఎదురయ్యే అనుభవమే ఇదే. అక్కడికి తనని అత్తగారు బాగానే చూసుకుటున్నా తను అడ్జస్టు కాలేకపోతోంది.
నిజమే! ఎవరో తప్ప ప్రతి ఆడపిల్లా తన పుట్టినింటి వారిని అభిమానించినంతగా అత్తింటి వారిని ప్రేమించలేదేమో అని అనిపిస్తుంది. ఇది స్వాభావికంగా, సహజంగా వచ్చిన అలవాటు అందుకే అంటారు. అత్తిల్లు, అత్తిల్లు అని పుట్టిల్లు పుట్టిల్లే. ఇక్కడ తన జీవితం యాంత్రిక జీవితంలా తయారయింది. ఇలాంటి వాతావరణంలో తను కొన్నాళ్ళంటే నిజంగా పిచ్చి ఎక్కిపోతుందేమో!
సంధ్య పరిస్థితి ఇలా ఉంటే సుధాకర్ పరిస్థితి అతని ఆలోచనలు మరోలా ఉన్నాయి. ఇంట్లో తను ఎవరికీ నచ్చచెప్పలేడు. తను సంధ్య భావోద్వేగాలు, ఎమోషన్సు కనిపెడూనే ఉన్నాడు. అవతల తల్లిదండ్రులకి బాధ కలిగించలేడు, ఇవతల భార్యని బాధ పెట్టలేదు. తను సంధ్యకి మొదటే చెప్పాడు తన కుటుంబ పరిస్థితి గురించి. తను అడ్జస్టు అవుతానని తనకి మాట ఇచ్చింది. ఇప్పుడు ఇచ్చిన మాట ప్రకారం నడుచుకోలేకపోతోంది.
అక్కడకి కోడల్ని అమ్మ ఎంత అపురూపంగా చూసుకుంటోంది అయినా అమ్మమీద తన దగ్గర విసుక్కుంటోంది. వాళ్ల అమ్మ వండిన వంటకాల్లో తన తల్లి చేసిన వంటకాల్ని సరిపోలుస్తూ విమర్శిస్తోంది. అక్కడికి తను వారించాడు. సంధ్య మాటలు తనకే బాధ కలిగిస్తే, ఒక వేళ అమ్మ వింటే ఎంత బాధ పడుతుందో? ఇవేవీ పట్టించుకోలేని స్థితిలో ఉంది సంధ్య.
అందుకే తనకి అనిపిస్తుంది. ఆడవాళ్ళు ఎంత స్వార్థపరులని, ఎంతటి వాళ్లయినా పుట్టింటి వాళ్లని ఆకాశానికి ఎత్తేస్తారు. అభిమానిస్తారు. అత్తింటి వాళ్లని తెగడ్డం కొంతమంది ఆడవాళ్ల నైజం. ఇంటి పరిస్థితి ఇంకా చేయిజారకుండానే చక్కబర్చాలి. సంధ్య మనస్సులో మొలకెత్తుతున్న విషబీజాన్ని మొదట్లోనే మొలకెత్తకుండా త్రుంచేయాలి.
ఇప్పటి వరకూ తను నిశ్శబ్దంగా మౌనంగా ఉంటున్నాడు. నిశ్శబ్దం వేరు, మౌనం వేరు, శబ్దం లేకపోవడం నిశ్శబ్దం. మాట్లాడకపోవడం మౌనం. నిశ్శబ్దం మనుష్యులకే కాదు ఇతర జీవులకూ, చివరకు యంత్రాలు వంటి నిర్జీవులకి కూడా వర్తిస్తుంది. కాని మౌనం కేవలం మనుష్యులకి మాత్రమే వర్తిస్తుంది. మౌనం మాటకన్నా గొప్పదంటారు కాని అది అనుభవంలోకి వచ్చినప్పుడే తెలుస్తుంది. తను అన్నీ గమనిస్తున్నా, వింటున్నా, చూస్తున్నా ఏమీ తెలియనట్టు, ఏదీ చూడనట్టు, ఏదీ విననట్టు నటిస్తున్నాడు. ఎందుకు? అలా నటిస్తూ మౌనంగా ఉండకపోతే కుటుంబంలో అశాంతి పెరుగుతుంది. కుటుంబ సభ్యులందర్నీ బాధించినట్టు అవుతుంది. అందుకే తెరమీద నటనకే కాదు నిజ జీవితంలో నటనకు కూడా తక్కువ మాట్లాడే వాళ్లలో ఎక్కువ నటన ఉంటుంది. అందుకే తను తక్కువ మాట్లాడ్డం ఇంట్లో అలవాటు చేసుకున్నాడు. తన ప్రవర్తన ఇంట్లో వాళ్ళు మరోలా అర్థం చేసుకుని అపార్థం చేసుకున్నా తప్పదు మరి.
(ఇంకా ఉంది)
విజయనగరం వాస్తవ్యులైన శ్రీ గూడూరు గోపాలకృష్ణమూర్తి హిందీ ఉపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. వారు రాసిన కథలు వివిధ వార్తపత్రికల్లో ప్రచురితమయ్యాయి. కొన్ని కథలు సంకలనంగా వెలువడ్డాయి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™