నా ఉద్యోగ జీవితంలో అదే విచిత్రం, రెండేసి పదవులు అప్పగించేవారు. కడప ఆకాశవాణిలో 1975 ఆగస్టులో చేరినప్పుడు నాదైన తెలుగు ప్రసంగ శాఖతో బాటు, కుటుంబ నియంత్రణ శాఖ కూడా అప్పగించారు. నేను నియతంగా కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం నాలుగు రాయలసీమ జిల్లాలు ప్రతీ నెలా ఒక జిల్లా కుటుంబ సంక్షేమ శాఖ అధికారి వద్దకు వెళ్ళి రికార్డింగులు చేశాను. ఆ శాఖలో M.E.I.O. (Mass Education and Information Officer) అనే అధికారి ప్రతీ జిల్లాలో వుండేవారు. కుటుంబ సంక్షేమ ప్రచారం వారి బాధ్యత. చిత్తూరులో సేతుమాధవరావు వంటి మిత్రులకు ముందుగా ఫోన్ చేసి ఒక టేప్ రికార్డరు పట్టుకుని వెళ్ళి వారి ఎంపిక చేసిన పి.హెచ్.సి.కి వెళ్ళి అక్కడ కార్యకలాపాలు రికార్డు చేసేవాడిని. పక్కనే వున్న ప్రభుత్వ జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్లను రికార్డు చేశాను. తిరుపతి మెడికల్ కళాశాల, కర్నూలు మెడికల్ కళాశాల, కర్నూలు లోని రీజినల్ ఫామిలీ ప్లానింగ్ ట్రయినింగ్ సెంటర్లో డా. కె. సూర్య ప్రకాశరావును రికార్డు చేశాను. కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.యస్.ఆర్.కె. హరనాథ్ (1980), ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. కృష్ణమోహన్‌లను రికార్డు చేసాను.
రెండవ మజిలీ 1985-87 మధ్య హైదరాబాదులో ట్రయినింగ్ సెంటర్ అదనపు బాధ్యతగా వాణిజ్య ప్రసారాల విభాగం అసలు పనిగా రెండేళ్ళు లాగించాను. 1988లో నాకు యు.పి.యస్.సి. ద్వారా స్టేషన్ డైరక్టర్ ప్రమోషన్ వచ్చింది. అప్పుడు నన్ను ఢిల్లీ ట్రయినింగ్ సెంటర్ నుండి డైరక్టరేట్‌లో ప్రసంగశాఖ డైరక్టరుగా వేశారు. ప్రసంగశాఖ ప్రొడ్యూసర్‌గా చేరిన నాకు అది ఎలాంటి అవకాశమంటే, యూనివర్శిటీలో లెక్చరర్‌గా చేరిన వ్యక్తి అక్కడే వైస్-ఛాన్స్లర్ కావడంతో సమానం. అప్పటి ట్రయినింగ్ సెంటర్ డైరక్టరుగా వున్న యస్. కె. శర్మ నేరుగా డైరక్టర్ జనరల్ అమృతరావ్ షిండేని కలిసి నన్ను ట్రయినింగ్ సెంటర్ లోనే డిప్యూటీ డైరక్టరుగా వుంచమన్నారు. ఆయన కుదరదన్నారు. ‘అయితే నన్ను కూడా మరో చోటికి మార్చ’మని శర్మ అనడంతో విధిలేక నన్ను రెండు పదవులు చూడమని ఆర్డరు మార్చారు. 1988 జూలై నుండి 1990 ఆగస్టు వరకు జోడు గుర్రాల స్వారీ చేసి, నేనే అడిగి అనంతపురం కొత్త స్టేషన్‌కు వేయించుకున్నాను.
మూడో మజిలీ 2000 సెప్టెంబరు నుండి నేను డైరక్టరేట్‌లో పాలసీ విభాగం డైరక్టర్‌గా పని చేశాను. అది చాలా క్లిష్టమైన, కష్టమైన ఇష్టమైన పదవి. డి.జి.కి బృహస్పతిలా పని చేయాలి. 180 కేంద్రాలు భారతదేశంలో ఏ ఏ రిలేలు ఎప్పుడు చేయాలో ఆదేశాలు పంపాలి. 2001లో నాకు ప్రమోషన్ వచ్చి దూరదర్శన్‌కు డి.జి.గా వెళ్ళేంత వరకు డ్రామా, స్పోకెన్ వర్డ్, పి.ఆర్., ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగాలు కూడా అంటగట్టారు. అప్పటి డి.జి. గైక్వాడ్‌కు నాపై అతి ప్రేమ అలా వరించింది. ఇలా నాలుగు గుర్రాలు లాగే రథంలో దూరదర్శన్ వరకు పయనించాను.
ఆకాశవాణికి ఆదాయం సమకూర్చి పెట్టే విభాగం ఇది. నూతన భవన నిర్మాణాలు జరుగుతున్నందున సి.బి.ఎస్. (Commercial Broadcasting Services) విభాగము, ప్రాంతీయ విభాగము ఏ.సి.గార్డ్సులో అద్దె భవనంలో పని చేస్తున్నాయి. నేను జనవరి 31, 1985న బాధ్యతలు స్వీకరించాను. నాకు ముందున్న కృష్ణమూర్తి పదోన్నతిపై డైరక్టరుగా తిరునల్వేలి బదిలీ అయ్యారు. శిక్షణా సంస్థలో పని చేసే పి.యు. అయూబ్ నూతన నాగర్ కోయిల్ కేంద్రానికి వెళ్లారు. ఆ కేంద్రం 1984 అక్టోబరు 31 న ప్రారంభమయింది. ఆ రోజే శ్రీమతి ఇందిరాగాంధీ హత్యోదంతం జరిగింది. ఆ తర్వాత ఒరిస్సా లోని కేంజర్లో, రాజస్థాన్ లోని కోటలో, ఆంధ్రప్రదేశ్‌లోని ఆదిలాబాదులో వరుసగా స్థానిక రేడియో కేంద్రాలు ప్రారంభమయ్యాయి.
సి.బి.ఎస్. కేంద్రానికి నేనే అధిపతిని. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌లుగా జి.కె. మరార్ (తర్వాత దూరదర్శన్ కేంద్ర డైరక్టరు), చల్లా ప్రసాదరావు, కె. రామానుజంలు పని చేస్తున్నారు. వీరు గాక, డ్యూటీ అనౌన్సర్లు, అనౌసర్లు, అకౌంట్స్ విభాగం వుంది. యు.వి.యస్.ఆర్. ఆంజనేయులు అసిస్టెంట్ స్టేషన్ ఇంజనీరు. హైదరాబాద్-బి కేంద్రం మీద ప్రసారాలు జరుగుతాయి. ఎక్కువగా సినీ సంగీతం మీద ఆధారపడతాము. బొంబాయిలోని సెంట్రల్ సేల్స్ యూనిట్ మాకు కోఆర్డినేటర్. డైరక్టరేట్‌లో వాణిజ్య ప్రసార విభాగ డైరక్టరుగా యం.యస్. బేడి పర్యవేక్షిస్తున్నారు. ఆ పదవిలో తర్వాతి కాలంలో దాదాపు ఒక దశాబ్ది కాలం అనుభవజ్ఞులు బి.ఆర్. చలపతిరావు పనిచేసి సంస్థకు పేరు తెచ్చారు.
హైదరాబాద్ కేంద్రం విజయవాడ లోని సి.బి.ఎస్. కేంద్రానికి కూడా ప్రకటనల టేపులు పంపాలి. వాణిజ్య ప్రకటనలు బుక్ చేయడానికి ఆకాశవాణి మూడు తరగతుల వారిపై ఆధారపడుతుంది. ఒకరు అక్రెడిటెడ్ (వీరికి అప్పు పెడతాము. నెల లోపు వారు డబ్బు చెల్లించవచ్చు). రెండో వర్గం రికగ్నయిజ్డ్. మూడు – రిజిస్టర్డ్. వీరు ముందుగా చెక్కులు చెల్లిస్తేనే ప్రకటనలు విడుదల చేస్తాము. నేను చేరిన మూడో రోజు ఫ్రిబ్రవరి 2 న అడిషనల్ డైరక్టర్ జనరల్ అమృతరావు షిండే హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. నేను వారిని మా ఆఫీసుకు కూడా ఆహ్వానించాను. ఆ రోజు వారి చేతుల మీదుగా తొలిసారి ‘తరంగ’ సుబ్రమణ్యానికి రిజిస్ట్రేషన్ పట్టా ఇప్పించాను. గత మూడున్నర దశాబ్దులుగా ‘తరంగ’ ప్రకటనల వాయు తరంగాలలో మేటియై సుబ్రమణ్యం సినిమా ప్రొడ్యూసర్ స్థాయి కెదిగాడు. ఇప్పుడు కూడా హైదరాబాద్‌లో మంచి అడ్వర్టైజర్.
నాకు సహాయకులుగా వున్న మరార్ అనుభవజ్ఞుడు. క్రికెట్ కామెంటేటర్. లోగడ ఎన్నో కార్యక్రమాలు చేశాడు. చల్లా ప్రసాదరావు చాణక్యుడు. రామానుజం సున్నిత వ్యక్తిత్వం గలవాడు. అకాల మరణం చెందాడు. మా ప్రసారాలలో రోజూ ఉదయం 8.30 వరకు 9.00 వరకు Sponsored Programmes బుక్ చేసేవారం.
1986 డిసెంబరు 18 వ తేదీ మా ప్రసాదరావు ఒక టేపు తెచ్చి “ఇందులో అభ్యంతరకర వాక్యాలున్నాయి. టేప్ తెచ్చిన అడ్వర్టయిజర్తో ఆ వాక్యాలు తీసివేయమన్నాను. అవి ఉదయమే ఈనాడు పత్రికలో యథాతథంగా వస్తాయి. మా యాజమనాన్యం కోర్టుకైనా వెళ్ళేందుకు సిద్ధమన్నాడు సార్! ఏం చెయ్యమంటారు” అన్నాడు ఆ చాణక్యుడు. వివరాలలోకి వెళ్తే, ఉషాకిరణ్ మూవీస్ వారి ‘పూజకు పనికిరాని పూలు’ సినిమా డైలాగులను మా ద్వారా Sponsored Programme క్రింద 20 రోజులు ప్రకటనగా బుక్ చేశారు. ఆ సీనులో వేశ్యాగృహంలో వేశ్యకు – ఆమె మేనేజరుకు మధ్య జరిగిన సంభాషణ అది. వారాంతంలో లెక్కలు సరిచూసుకుంటూ ఇలా అంటుంది:
వేశ్య – “ఈ వారంలో సింగిల్ షోలు ఎన్ని? ఫుల్ నైట్లు ఎన్ని?” అని ప్రశ్నిస్తుంది. ఈ వాక్యం ప్రసారం అభ్యంతరకరం. మా ప్రసాదరావు కొద్దిగా కిరికిరి పెట్టి చూద్దామని వచ్చాడు. నా దృష్టికి రాకుండా ప్రసారం చేసి వుంటే అదొక రకం. నా దృష్టికి వచ్చిన తర్వాత దానిని ఉదాసీనంగా వదలకూడదు. 24 గంటలలో ఒక నిర్ణయం తీసుకోవాలి. మా డైరక్టరేటుకు తెలియజేసి ప్రసారం ఆపివేసి వుండవచ్చు. కాని, వారు ఆకుకు అందకుండా పోకకు పొందకుండా ప్రసార తేదీ అయిపోయిన తర్వాత సమాధానమిస్తారు. ఆలోచించాను.
డిసెంబరు 20 తేదీ సాయంకాలం నాలుగు గంటలకు ఆ సినిమా నిర్మాత రామోజీరావు గారిని ఈనాడు కార్యాలయంలో కలిశాను. సాదరపూర్వక కుశలప్రశ్నల తర్వాత ఆయన ఒక ప్రశ్న వేశారు.
రామోజీ: “సెన్సార్ బోర్డు, ఆకాశవాణి – రెండూ ఒకే మంత్రిత్వశాఖలోనివే గదా! వారు ఆమోదించిన సినిమా డైలాగులు మీరు అభ్యంతర పెట్టడం భావ్యమా?”
ఒక్క క్షణం నివ్వెరపోయాను.
నేను: సార్! సినిమా హాలుకు అందరూ వెళతారు. ఇంట్లో రేడియో వింటున్న ఓ చిన్నపిల్లవాడు ఈ వాక్యం విని ‘సింగిల్ షో అంటే ఏమిటి నాన్నా!’ అని అడిగితే ఎలా సమాధానం చెబుతాడు సార్. అందుకే రేడియో, దూరదర్శన్‌లకు విడిగా ప్రత్యేక బోర్డులున్నాయి. ఆ కమిటీ విని కొన్ని అభ్యంతరకర సన్నివేశాలు తీసివేస్తారు.”
అట్లూరి రామారావు కూడా సమావేశంలో ఉన్నారు. ఒక్క క్షణం ఆలోచించిన రామోజీరావు గారు – వాళ్ళ మేనేజరుతో – “ఆ వాక్యం తీసెయ్యండి. అంతగా పట్టు పట్టనవసరం లేదు” అన్నారు పెద్ద మనస్సుతో. ఆ విధంగా గండం గట్టెక్కింది.
ఉదయం పూట ప్రసారం చేసే ఉదయం 8.30 వరకు 9.00 గంటల సమయం ఒక సంవత్సర కాలానికి ముందే ప్రకటనదారులు బుక్ చేశారు. ఇద్దరు ప్రకటనదారుల మధ్య ఆ సమయం రోజూ మార్చి రోజు పంపకం చేశాము. మూడో ప్రకటనదారుడు విజయవాడ నుండి ముందుకు వచ్చి తనకూ ఓ అరగంట కావాలని పేచీ పెట్టాడు.
1986 ఏప్రిల్ 1 నుండి ఉదయ ప్రసార సమయాన్ని 9 గంటల నుండి 30 నిముషాలు పొడిగిస్తున్నామనని మార్చి నెలాఖరులొ నేను టైరక్టరేట్కు టెలిగ్రాం పంపుతూ, వివరాలతో ఉత్తరం వ్రాసి ఆమోదం కోరాను. ఆదాయం బాగా పెరిగింది. రెండు అరగంటల సమయం సినిమా ప్రకటనలతో మరో ఆరు నెలలకు బుక్ అయిపోయింది. అడ్వర్టయిజర్లలో ఒకరు ఇది సహించలేక డైరక్టరేట్‌కు నాపై ఫిర్యాదులు చేశారు. డైరక్టరేట్ వారు వాస్తవాలు విచారించమని నవంబరులో బొంబాయి నుండి డైరక్టరు డి.పి. రామచంద్రను పంపారు.
ఆఫీసులో విచారణకు అడ్వర్టయిజర్లను పిలిపించాను. నా పరోక్షంలో విచారణ జరిగింది. వ్యక్తిగతంగా నా మీద ఎవరూ ఫిర్యాదు చేయలేదు. రికార్డులు సక్రమంగా ఉన్నాయి. అంతకు ముందు నెలలో ఇండియా టుడే సంచికలో అమరనాథ్ మీనన్ నన్ను ఇంటర్వ్యూ చేసి బాక్స్ ఐటమ్ ప్రచురించి ఈ ప్రోగ్రాములు బహుళ జనాదరణ పొందడాన్ని ప్రశంసిస్తూ వ్రాశాడు.
అది చదివిన సమాచార ప్రసార శాఖలో డైరక్టరు యం.కె. రామస్వామి ఈ విచారణ జరుగుతున్న రోజే హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఆయనను నేను, రామచంద్ర (బొంబాయి) మర్యాదపూర్వకంగా లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లో కలిశాము. ఆయన చేతిలో ఇండియా టుడే సంచిక వుంది. ఆయన రామచంద్రతో ఇలా అన్నారు:
“ఈ విధంగా కార్యక్రమాల ద్వారా రేడియో ఆదాయం పెంచడం అభినందనీయం. అన్ని వాణిజ్య కేంద్రాలను ఈ పద్ధతి ననుసరింవలసిందిగా ఆదేశాలివ్వండి.”
రామచంద్ర నిరుత్తరుడయ్యాడు. ‘కాగల కార్యము గంధర్వులు తీర్చారు’ అన్న సామెత గుర్తుకొచ్చింది.
1985 నాటికి దూరదర్శన్ ఛానళ్ళు ప్రచారంలో లేవు. రేడియోనే సామ్రాజ్యం చేస్తోంది. పలువురు సినీ ప్రముఖులతో పరిచయాలు ప్రసారం చేశాం. ఒక రోజు మధ్యాహ్నం విందు సమయంలో నేను భోజనం చేసి తలుపు తీసి బయటకు వచ్చి చూశాను. ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. ప్రముఖ సినీ పాటల రచయిత వేటూరి సుందరరామమూర్తి కూచొని వున్నారు. ప్యూన్ కూడా భోజనానికి వెళ్ళడం వల్ల వారు వచ్చిన వార్త నాకందలేదు. వారి కార్యక్రమ మొకటి ప్రకటనల రూపంలో ప్రసారాన్ని గూర్చి చర్చించడానికి వచ్చారు. వెంటనే అంగీకరించాను.
ఆకాశవాణిలో అన్ని విభాగాలలో పనిచేసే అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించాడు. చిన్న స్టేషన్ కడపతో ప్రారంభమై రాష్ట్ర రాజధాని కేంద్రంలో పనిచేసి వాణిజ్య కేంద్రం చేరాను. శిక్షణ కేంద్రం -హైదరాబాదులో, ఢిల్లోలలో 5 సంవత్సరాలు పనిచేశాను. అనంతపురం వంటి జిల్లా కేంద్రంలో పనిచేశాను. భారతదేశంలోనే తొలి స్వతంత్ర ఎఫ్.ఎమ్. కేంద్రమైన కొత్తగూడెం నా చేతుల మీదుగా 1989లో ప్రారంభింపజేశాను. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రం అధిపతిగా మూడేళ్ళు పనిచేయడం భాగ్యం. మీదు మిక్కిలి డైరక్టరేట్‌లో ప్రధాన నాడి అయిన పాలసీ విభాగాధిపతినయ్యాను. దేశంలోనే అత్యుత్తమ నేషనల్ ఛానెల్ డైరక్టర్ నయ్యాను. 25 ఏళ్ళ ఆకాశవాణి ప్రస్థానానంతరం చివరి ఐదేళ్ళు దూరదర్శన్ డి.డి.జి.గా పని చేశాను. ఇంత విస్తృత సౌభాగ్యం దైవకృప!
తొలుత లెక్చరర్‌గానూ, తరువాత ఆకాశవాణి, దూరదర్శన్లలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వర్తించి అడిషనల్ డైరక్టర్ జనరల్, దూరదర్శన్గా ఉద్యోగ విరమణ చేశారు. పద్యంపై మక్కువ కలిగిన అనంతపద్మనాభరావు 150కి పైగా అవధానాలు చేశారు. కథలు, నవలలు వ్రాశారు. అనువాద బహుమతులు పొందారు. ‘దాంపత్య జీవన సౌరభం’, ‘మన పండుగలు’, ‘తలపుల తలుపులు’, ‘అలనాటి ఆకాశవాణి’, ‘అంతరంగ తరంగం’, ‘కథామందారం’, ‘గోరింట పూచింది’ వంటి పుస్తకాలను వెలువరించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పలు అవార్డులు పొందారు.
Gananeeyameina sevalu chesaaru..abhinandanalu
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™