1987 ఏప్రిల్‌లో నేను ఆకాశవాణి శిక్షణా సంస్థకు (ఢిల్లీ) బదిలీ మీద హైదరాబాదు నుండి వెళ్లి చేరాను. 1982-87 మధ్య కాలంలో హైదరాబాదులో వుండగా ప్రకాశం అభివృద్ధి అద్యయన సంస్థ ఆధ్వర్యంలో నేను అనేక సభా నిర్వహణలలో పాలు పంచుకున్నాను. అప్పుడు సంస్థ అధ్యక్షులుగా మాజీ I.A.S అధికారి యం.రామకృష్ణయ్య, ప్రధాన కార్యదర్శిగా టంగుటూరి సూర్యనారాయణ వ్యవహరించారు. నేను ఢిల్లీ చేరిన తర్వాత ఢిల్లీలో కూడా ఏదైనా ఒక పెద్ద సమావేశం ఏర్పాటు చేసి ప్రకాశం పంతులు ఆశయాలు ప్రచారం చేయాలని సంకల్పించాం. మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు కావూరి సాంబశివరావు తమ భవనంలో (ఢిల్లీ) మా సంస్థ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకొనేందుకు అంగీకరించారు.
ప్రకాశం 116వ జయంతి సందర్భంగా మూడు రోజుల సందస్సును పంచాయితీ రాజ్ వ్యవస్థపై 1987 ఆగస్టు 22,23,24 తేదీలలో నిర్వహించాలని సంకల్పించాం. ఎలక్షన్ కమీషన్ సభ్యులు జి.వి.జి. కృష్ణమూర్తి సారధ్యం వహించారు. దేశ రాజధానిలో ప్రకాశం కాంస్య విగ్రహం చేపడితే బాగుంటుందనే సలహా వచ్చింది. ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రాంగణం ముందు విగ్రహ స్థాపనకు స్థలం ప్రభుత్వం కేటాయించింది. కావూరి సాంబశివరావు పదివేలు తొలి చందాను అందించారు.
ఆగస్టు 22న విజ్ఞానభవన్‌లో భారీ ఎత్తున ఢిల్లీ ఆంధ్రులందరూ కలుసుకునేలా సభను నిర్వహించాలని ఒక కమిటీ ఏర్పాటైంది. ప్రధాని రాజీవ్ గాంధీ సభకు ముఖ్య అతిథిగా విచ్చేయడానికి అంగీకరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యన్.టి.రామారావు కూడా అంగీకరించారు. 23,24 తేదీలలో ఏ.పి భవన్లో రెండు రోజుల సదస్సుకు ప్రణాళిక సిద్ధమయింది. విస్తృత ప్రచారం జరిగింది.
సభలో సీనియర్ పార్లమెంటేరియన్ యన్.జి.రంగాకు సన్మానం చేయాలని నిర్ణయమైంది. అప్పుడు కాంగ్రెసు ప్రభుత్వం నడుస్తోంది. తెలుగుదేశం నాయకులకు ఈ సభ విజయవంతం కావడం ఇష్టమున్నట్లు లేదు. ఉపేంద్ర అప్పట్లో పార్టీ వ్యవహారాలు ఢీల్లీలో పర్యవేక్షిస్తున్నారు. ఆ సాయంకాలం సభకు రావలసిన ముఖ్యమంత్రి రామారావు ‘రాలేకపోతున్నామ’ని సందేశం చివరి క్షణంలో పంపారు.
తర్వాత విశ్వసనీయంగా తెలిసిన విషయమిది.
ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ ఒక సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. ముఖ్యమంత్రి రావలసినంత గొప్పసభ కాదు అనే వర్తమానం ఎవరో హైదరాబాదు చేరవేశారు.
విజ్ఞానభవన్‌లో వేల సంఖ్యలో ఆగస్టు 22న ఆంధ్రులు సభాసీనులయ్యారు. వేదికపై రాజీవ్ గాంధీ (ప్రధాని)తో బాటు యన్.జి.రంగా తదితర పెద్దలు అలంకరించారు. రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ పంపిన శుభ సందేశం సభలో నేను చదివి వినిపించాను. ప్రకాశం విగ్రహ స్థాపనను ప్రధాని ప్రశంసించారు. సభ దిగ్విజయం కావడంలో, సెక్యూరిటీ ఏర్పాట్ల పర్యవేక్షణలో ఢిల్లీ పోలీసు శాఖ అత్యున్నతాధికారి యు.యన్.రావు తోడ్పడ్డారు. ఆంధ్రులందరు నిర్వహకులను ప్రశంసించారు.
సభ విజయ వార్తలు హైదరాబాదుకు చేరాయి. మర్నాడు సభకు ముఖ్యమంత్రి రాకపోతే విరుద్ధ సంకేతాలు వెళతాయని స్పష్టం చేశారు. 23వ తేదీ ఉదయం 10 గంటలకు ఏ.పి.భవన్లో సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రామారావుగారు మరి కొద్ది నిముషాలలో వచ్చి సభలో పాల్గొంటారని పంచాయతీరాజ్ శాఖామాత్యులు కరణం రామచంద్రరావు తెలిపారు. సభాసదులలో ప్రముఖ గాంధేయవాది వావిలాల గోపాలకృష్ణయ్య ఉన్నారు. ముఖ్యమంత్రి సభలో పాల్గొని వావిలాలను ఘనంగా ప్రశంసించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి కూడా వచ్చారు.
నేను ఆ సభలో సదస్సు తీర్మానాలను ప్రకటించాను. ఆ విధంగా సూత్రప్రాయంగా అంగీకరింపబడిన ప్రకాశం కాంస్య విగ్రహ స్థాపన సఫలీకృతమైంది.
ఏ.పి.భవన్ ప్రాంగణం ముందు ప్రకాశం కాంస్య విగ్రహాన్ని భారత ప్రధాని పి.వి.నరసింహారావు 1992 నవంబరు 8 నాడు ఆవిష్కరించారు. అప్పటి ఢిల్లీ ప్రముఖలందరూ ఆ సభలో పాల్గొన్నారు. విగ్రహం తయారీ మొదలు ఢిల్లీలో వివిధ శాఖల సమన్వయ విషయాలను ఎలక్షన్ కమీషనర్ జి.వి.జి. కృష్ణమూర్తి పర్యవేక్షించి సులభతరం చేశారు. విగ్రహంలో ప్రకాశం తల పైకెత్తుకున్నట్లుగా లేదు. ‘ఏం కృష్ణమూర్తీ ఇలా వుందని’ పి.వి. గారు చమత్కరించారు. మళ్లీ విగ్రహం తల ఎత్తుకొని నిలిచింది.
ఆ సాయంకాలం 7 అక్బర్ రోడ్లో ప్రధాని నివాసంలో మా ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థ కార్యవర్గము, మాజీ మంత్రులు మండలి వెంకట కృష్టారావు, లుకలాపు లక్ష్మణదాసు తదితరులు పి.వి. గారితో గడిపాము. అదొక మధురానుభూతి.
1989 చివర్లో లోక్‌సభకు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెసేతర పార్టీలు జట్టుగా చేరి ఎన్నికలలో పోటీ చేశాయి. జనతాదళ్ పార్టీ నాయకత్వంలో బి.జె.పి, తదితర వామపక్షాలు, డి.యం.కె., అసోం గణ పరిషత్తులు నేషనల్ ఫ్రంట్‌గా ఏర్పడ్డాయి. యన్.టి.రామారావు అధ్యక్షులుగా, వి.పి.సింగ్ సమావేశకర్తగా, ప్రతిపక్షనాయకుడైన ఉపేంద్ర ప్రధాన కార్యదర్శిగా నేషనల్ ఫ్రంట్ పని చేసింది. కనీస మెజారిటీతో ఆ ఫ్రంట్ గెలిచింది.
ప్రధానిగా ప్రమాణ స్వీకారం జరగాలి. దేవీలాల్, చంద్రశేఖర్‌ల పేర్లు బయటికి వచ్చాయి. చివరకు వి.పి.సింగ్ ఫ్రంట్ నాయకుడిగా ఎంపికయ్యారు. అప్పట్లో రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ ప్రధాని ప్రమాణ స్వీకారానికి డిసెంబరు 2, 1989 తేదీని నిర్ణయించారు.
అప్పుడు నేను ఢిల్లీలో పని చేస్తున్నాను. (1987-1990) ఆ హడావిడి చూద్దామని అశోకా రోడ్డులోని ఆంధ్రప్రదేశ్ భవన్ కెళ్లాను. ముఖ్యమంత్రి యన్.టి.రామారావు ఢిల్లీలోని A.P భవన్ వసతి గృహంలో సంప్రదింపులు జరుపుతున్నారు. వివిధ పార్టీల నాయకులు వస్తూ పోతున్నారు. ప్రమాణ స్వీకారానికి మరో అరగంట సమయం కూడా లేదు. అశోకా రోడ్డుకు ఫర్లాంగులోపు వున్న మరో పార్లమెంటు సభ్యుని క్వార్టర్లో వి.పి. సింగ్ చర్చలు జరుపుతున్నారు. ఇద్దరు ఉపప్రధానుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఒకరు దేవీలాల్. మరొకరు యన్.టి.రామారావు.
తెలుగు మిత్రులం వి.పి.సింగ్ వున్న యింటి ముందుకు చేరాం. అక్కడ మరొక గదిలో ఉపేంద్ర, తదితర నాయకులున్నారు. జనం కోలాహలంగా ఎదురు చూస్తున్నారు. హఠాత్ పరిణామంగా ఒక్క దేవీలాల్ మాత్రమే ఉపప్రధానిగా ప్రకటించబడ్డారు. ఉపేంద్రను కేంద్రంలో క్యాబినెట్ మంత్రిగా తీసుకున్నారు. ఆయనకు పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖలు అప్పగించారు. దాదాపు మధ్యాహ్న వేళ భవనం బయటకు వి.పి.సింగ్ అనుయాయులతో వచ్చారు. పాదచారిగా కొంత దూరం కార్యకర్తలతో ముందుకు నడిచారు. ప్రజలు హర్షధ్వానాలు చేస్తుండగా కార్లో బయలుదేరి రాష్ట్రపతి భవనానికి వెళ్లారు. మరో కార్లో ఉపేంద్ర రాష్ట్రపతి భవనం చేరుకున్నారు.
6వ తేదీ సాయంకాలం ఉపేంద్ర శాస్త్రి భవన్‌లోని తన కార్యాలయంలో సమాచార ప్రసారశాఖల మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రా అసోసియేషన్ పక్షాన డా.వి.కృష్ణమూర్తి, తదితరులు, ఆకాశవాణిలో పని చేస్తున్న నేను, మరి కొందరు తెలుగు మిత్రులం వెళ్లి వారిని పుష్పగుచ్చాలతో అభినందించాం.
“25 సంవత్సరాల తర్వాత (1963లో బెజవాడ గోపాలరెడ్డి) ఈ పదవిలోకి 1989లో మీరు వచ్చారు” అని నేను ఉపేంద్రగారితో ప్రస్తావించాను. డిసెంబరు2, 1989 నుండి, 1990 నవంబరు 10 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆ పర్యాయం కేంద్ర మంత్రులుగా పలువురు కొలువుదీరారు. శ్రీయుతులు అరుణ్ గాంధీ, జార్జి ఫెర్నాండెజ్, అజిత్ సింగ్, ఐ.కె.గుజ్రాల్, మధు దండావతే, మురసోలీ మారన్, యం.యస్.గురుపాదస్వామి, కె.పి.కున్నికృష్ణన్, మహమ్మద్ సయీద్ ముఫ్తీ, ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, రామ్ విలాస్ పాశ్వాన్, శరద్ పవార్, నీలమణి రౌత్రాయ్ ప్రభృతులు మంత్రులయ్యారు.
1977-79 మధ్యకాలంలో జనతా ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా ఉన్న మధు దండావతే వద్ద ఉపేంద్ర స్పెషల్ అసిస్టెంట్‌గా పని చేశారు. ఇప్పుడు ఇద్దరు కేంద్రమంత్రులు కావడం విశేషం. రాజకీయ చతురత, వాగ్ధాటి, కార్యదీక్ష, సమయజ్ఞత ఉపేంద్రకు లభించిన వరాలు.
1990లో కేంద్ర ప్రసారశాఖల మంత్రిగా ఉపేంద్ర ప్రసారభారతి బిల్లును లోకసభలో ప్రవేశపెట్టారు. సంకీర్ణ ప్రభుత్వహయాంలో అది నెగ్గలేదు. 1997లో ప్రసారభారతి బిల్లుకు మోక్షం కలిగింది. అప్పుడు సమాచార ప్రసార శాఖల మంత్రిగా తెలుగువారే అయిన యస్.జైపాల్ రెడ్డి వ్యవహరించడం అరుదైన ఘటన.
తొలుత లెక్చరర్‌గానూ, తరువాత ఆకాశవాణి, దూరదర్శన్లలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వర్తించి అడిషనల్ డైరక్టర్ జనరల్, దూరదర్శన్గా ఉద్యోగ విరమణ చేశారు. పద్యంపై మక్కువ కలిగిన అనంతపద్మనాభరావు 150కి పైగా అవధానాలు చేశారు. కథలు, నవలలు వ్రాశారు. అనువాద బహుమతులు పొందారు. ‘దాంపత్య జీవన సౌరభం’, ‘మన పండుగలు’, ‘తలపుల తలుపులు’, ‘అలనాటి ఆకాశవాణి’, ‘అంతరంగ తరంగం’, ‘కథామందారం’, ‘గోరింట పూచింది’ వంటి పుస్తకాలను వెలువరించారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి పలు అవార్డులు పొందారు.
సర్ మీరు పైన వ్రాసిన విషయంలో 1989 న కొలువుదీరిన మంత్రిమండలిలో శరద్ పవార్ పేరుకూడ చేర్చారు. కానీ శరద్ పవార్ అప్పుడు మహారాష్ట్ర రాజకీయాలలో మాత్రమే ఉన్నారు. 1991 లో పివి గారు ప్రదాని అయ్యాక పవార్ రక్షణమంత్రి అయ్యారు. మీ అనుభవాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి సర్ . అభినందనలు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™