Yes, love is inevitable…
చుట్టూ ఉవ్వెత్తున్న ఎగిసిపడే ప్రేమ కెరటాల మధ్యన నడి సముద్రంలో వుండీ ఆ ప్రేమ జడిలో చమరించక పోవటం కఠిన శిల లాంటి గీతకే చెల్లిందనుకున్నాను.
కాని చిత్రంగా విభిన్నమైన ఆ కరగని పాషాణం ఒడ్డున పడ్డాక ఆ కెరటాల తడి కోసం తడుముకుంది. ప్రేమ తాకిడిని తప్పించుకోలేక పోయింది.
కాని అనూహ్యంగా కెరటాలు నిశ్చలమై పోయాయి.
***
గీత మంచాన్ని పంచుకోవాలని అతనెప్పుడూ ఆశ పడలేదు.
గీత పడుకునే పడక గదిలో ఓ మూల స్థానమిస్తే అనిర్వచనీయానందాన్ని పొందేవాడు.
స్త్రీపురుషులిద్దరూ ఒకే గదిలో తలుపులు మూసుకు పడుకుంటే ఏదో జరిగే వుంటుందని భావించే సంకుచిత నమ్మకానికి గీత పూర్తిగా విరుద్ధం. అయినప్పటికీ మన సంస్కృతిలో పకడ్బందీగా సాంఘీకంగా మలచబడ్డ జెండర్ విధాన ప్రభావం నుండి మాత్రం గీత తప్పించుకోలేక పోయింది.
అతను ఆర్మీ రిటైర్డ్ కెప్టెన్. అతనిని చూసే వరకూ గీత ఆర్మీ అనగానే అందరు అనుకున్నట్టుగానే గట్టి గుండె, కరుకు మనసు, కటువు మాట అనుకునేది. అతనిలోని ప్రేమతత్వము, కరుణరసము గీత అంచనాలను తారుమారు చేసాయి.
అతను ప్రతి చిన్న సంఘటనకూ కదిలిపోతుండేవాడు. ఏ మాత్రం దయనీయ పరిస్థితులలో ఏ జీవి కనిపించినా అల్లల్లాడిపోయేవాడు.
‘అయ్యో పాపం, బేచారా’ అనే పదాలెప్పుడూ అతని నాలుక చివర వుండేవి.
పిల్లి నోటికి చిక్కి ప్రాణాలు కోల్పోయే కోడిపిల్ల అతని అరచేతుల్లో తిరిగి ప్రాణం పుంజుకునేది.
కుక్క కాటు పడి సొమ్మసిల్లి చతికిలబడ్డ పిల్లి అతని సంరక్షణలో సేద తీరి కోలుకునేది.
లారీ కింద పడి కాలు విరగ్గొట్టుకున్న కుక్క అతని ప్రేమపూరిత పరిరక్షణలో బలాన్ని పుంజుకుని పరుగులు పెట్టేది.
కష్టంలో వున్న ఏ జీవినైనా తరతమ బేధాలు లేకుండా చేరదీసే వాడతను. అతని చిరునవ్వులో కూడా కరుణ జాలువారేది.
ఆకలితో అలమటించే కడుపులు నింపటంలో అతని దయార్ద్ర హృదయం తృప్తి పడేది.
గీత భర్త రమణ సిటీ అవుట్‌స్కర్ట్స్‌లో తనకంటూ ప్రత్యేకంగా ఒక గెస్ట్‌హౌస్ కట్టుకునే సమయంలో కెప్టెన్ సాబ్ పరిచయమయ్యాడు. అతనూ అక్కడే తనకో గృహం నిర్మించుకున్నాడు. రెండు భవనాల నిర్మాణాలు ఒకేసారి ప్రారంభమయ్యాయి. మొదట్లో రమణ బోరు వేయించలేదు. కెప్టెన్ బోరు నీటితోనే రెండిళ్ళ కట్టడాలు పూర్తయ్యాయి. అలా వాళ్ళిద్దరి మధ్యా స్నేహం గాఢమైంది. ఎనిమిది నెలల పాటు సాగిన ఆ నిర్మాణ కాలంలో అతను రమణకు బాగా దగ్గరయ్యాడు.
ఇంటి పనిని పర్యవేక్షిస్తూ ప్రతిరోజూ ఇద్దరూ క్రమం తప్పకుండా కలవటం, అడపాదడపా ఓ పెగ్గేయటం అలవాటయ్యింది. అతను రమణకు మంచి మిత్రుడయి క్రమంగా మొత్తం కుటుంబానికి మిత్రుడిగా ఎదిగాడు.
ఇల్లు కట్టడం పూర్తయ్యాక కూడా గీత నిమిత్తం లేకుండా రమణ కట్టుకున్న గెస్ట్‌హౌస్‌లో వాళ్ళిద్దరూ క్రమం తప్పకుండా కలుస్తుండేవారు.
అతను తన ఇంటి వెనుక వున్న విశాలమైన ఖాళీ స్థలాన్ని పూల, పళ్ళ, కూరగాయల మొక్కలతో మంచి తోటలా తీర్చిదిద్దుకున్నాడు.
అతను స్వహస్తాలతో విత్తులు వేసి ప్రేమగా సాగు చేసి పెంచుకునే మొక్కలు అతని స్పర్శకు పులకించేవి. అతని ప్రేమే ఎరువుగా పెరిగిన అతని తోటలోని ప్రతి చెట్టు అతని శ్వాసను గుర్తించేది. పరిమళించే అతని తోట ఎప్పుడూ అతని దరహాసమంత పచ్చగా వుండేది.
అతని తోట పంట ఇరుగుపొరుగుల ఇంటి వంటయ్యేది.
బొప్పాయి, జామకాయ, టమాటా, వంకాయ, బెండకాయ, ములక్కాడ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఒకటేమిటి ఎవరికి కావలసినవి వారు కోసుకునేవారు. మన కెప్టెన్ సాబ్ తోట అనేవారు. అతని నిర్మలత్వంతో అందరికీ ‘మన’ మనిషయ్యాడు.
పూర్తిగా పండని పచ్చికాయలు, నిండా వికసించని పసి మొగ్గలను ఎవరైనా కోసినప్పుడు మాత్రం అతని సున్నితమైన మనసు గిలగిలలాడేది.
పసిపిల్లలను.. అనాథలను, పూలను… మొక్కలను, పశువులను.. పక్షులను వేటిని చూసినా ఎంతో ఉద్వేగంగా స్పందించి మైనంలా కరిగిపోయే మృదువైన మనసు అతనిది. ప్రేమపూరితమైన సరళమైన పలుకు అతని సొంతం.
దేముడు ఏనుగులాంటి ఆరడుగుల అంత భారీ విగ్రహానికి ఇంత సున్నితమైన మనసెలా ఇచ్చాడో గీతకు అర్థమయ్యేది కాదు.
అనుకోని వ్యాధి బారిన పడి రమణ అకాల మృత్యువు పాలయ్యాడు. కెప్టెన్ సాబ్ మనసుకు దగ్గరయిన రమణ హఠాత్తు నిర్యాణం, అతనిని నిలువునా కృంగదీసింది. ఫ్యామిలీకి దూరంగా ఒంటరిగా వుండే అతని గుండె లోతుల్లో ఆకస్మిక శూన్యత ఏర్పడింది.
రమణ పోవటం, అమెరికాలో వున్న రమణ కూతురికి బాబు పుట్టటం ఒకేసారి జరిగాయి. రమణే మళ్ళీ పుట్టాడని అందరూ చెప్పుకున్నారు. వాడికి తాత పేరు కలిసి వచ్చేట్టుగా వెంకట రమణ అని పేరు పెట్టారు.
రమణ పోయాక తల్లి పంచన చేరిన గీత చీకటిమయ జీవితానికి వెలుగునివ్వటానికి గీత కూతురు శ్వేత అప్పుడే ఉదయించిన తన నెల్లాళ్ళ పసి కందుని తన పొత్తిళ్ళ నుండి తుంచి ఇండియాలో వున్న గీత ఒళ్ళో పెట్టింది.
చిట్టి మనవడు దత్త పుత్రుడై గీత మనసంతా ధవనంలా పరుచుకున్నాడు.
వాడి పసిడి అందాలతో బోసి నవ్వులతో గీత మనసును ఊరడించి ఉత్తేజ పరిచేవాడు. చిన్ని రమణుడు గీతనే కాకుండా కెప్టెన్ సాబ్‌కి దూరమయిన రమణ మనవడిగా అతడినీ వశ పరుచుకున్నాడు. అతనికి చిన్ని రమణలో స్నేహితుడు రమణే కనిపించేవాడు. అతను ఎంతగా రమణ ముద్దు మురిపాలకు బానిసయ్యాడంటే పాతిక కిలోమీటర్ల దూరాన వున్న గీత ఇంటికి తరచూ వెళ్తుండేవాడు.
తల్లి పంచన చేరిన మగదిక్కు లేని గీతకు అతని సహాయ సహకారాలు ఎంతో ఆసరాగా వుండేవి. అతని రాక పసివాడి వినోదానికి, మానసిక వికాసానికి, సరయిన పెరుగుదలకు దోహదపడేది. రమణను బయట తిప్పటంలో అతను ఎంతో సంతోషంగా గీతకు తోడయ్యేవాడు. గీత కారులోనే అమ్మతో సహా అందరూ కలిసి వెళ్ళే వాళ్ళు.
చిట్టి రమణ ‘ఉప్పు’ ఆడదామంటే అతను వాడిని వీపున ఉప్పు బస్తాలా మోసుకుంటూ తిరిగేవాడు. రమణ ఏనుగాట ఆడదామంటే అతని వీపు మీద వాడిని కూర్చో పెట్టుకుని ఏనుగు లాంటి మనిషి చంటి పిల్లాడిలా నేలమీద మోకాళ్ళ మీద పాకేవాడు. రమణ ‘డుర్రు’ పోదామంటే అతను తన బైక్ మీద వాడిని కూర్చోబెట్టి ఇంటి చుట్టూ రౌండ్లు వేసేవాడు. రమణ ‘కా’ అంటే ‘కా’, ‘కీ’ అంటే ‘కీ’ గా వాడిని కెప్టెన్ సాబ్ గారం చేసేవాడు.
మాల్స్ కీ, పార్కులకూ, జూకీ, సర్కస్సులకూ రమణను ఎంటర్టైన్ చేస్తూ అతను తిప్పినప్పుడు గీతకు ఒక మగ మనిషి ఆసరా, తోడూ ఎంతో అవసరంలా అనిపించినా రాత్రి అయ్యేసరికి అతనిని గుమ్మం దాటించి తలుపులు వేసుకుంటే గాని నిశ్చింతగా నిద్ర పోయేది కాదు గీత. గీత నరనరాన అనాదిగా ఇంకిపోయిన ఏదో ‘మిత్’ ఆమెపై చిత్రమైన ప్రభావం చూపేది.
నిజానికి గీతకు పరాయి పురుషుడు రాత్రి వేళ తన ఇంట్లో ఎందుకున్నాడన్న ప్రశ్నను ఎదుర్కోవాల్సి వస్తుందన్న జంకు లేదు.
అతను తనింట్లో వుంటే ఇరుగు పొరుగు ఏమనుకుంటారో అన్న సామాజిక వెరుపు ముందే లేదు.
కాని గీత తన అణువణువునా బాగా జీర్ణించుకు పోయి పాతుకు పోయిన జెండర్ బైయస్ నుండి ఉత్పన్నమైన ఒక సందిగ్ధత, అయిష్టత నుండి బయట పడలేక పోయింది.
ఒక రోజున రమణతో అందరు కలిసి జూ పార్కుకి వెళ్ళారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి భోజనం అయిన వెంటనే అలిసిన అతను అక్కడే హాలులో సోఫాలో నడుం వాల్చేసాడు. అలిసి వున్నాడేమో గీత అతనిని గమనించే లోపే గురక పెట్టటం మొదలెట్టాడు.
గీతకు ఆ రాత్రికి అతను తన ఇంట్లోనే వుండిపోతాడేమోనని భయం వేసింది.
పరాయి మగాడు తన ఇంట్లో పడుకుంటాడన్న భావన మనసులో కలకలంగా అనిపించింది.
అతనేదో అర్ధరాత్రి వేళ దురాక్రమణ చేస్తాడన్న భయమెప్పుడూ లేదు. అసలు పురుష స్పర్షకు తను మైలపడిపోతుందనో, అపవిత్రమైపోతుందోనన్న ఆలోచన ఎప్పుడూ లేదు.
మరెందుకో అతను పగలంతా ఎంత సహాయ సహకారాలు అందచేసినా సరే చీకటి పడే వేళకు ఇంటి నుండి తరిమేసేది. ఏవో కారణాలతో కన్విన్సింగ్‌గా జస్టిఫై చేసుకునేది.
సోఫాలో అతని గురక గీతకు చిరాకనిపించింది. ప్రొద్దుటి నుండీ రమణని మోస్తూ తిప్పినప్పుడు, ఆడించినప్పుడు ఆనందించిన గీత మొదటిసారిగా తన ఇంట్లో నిద్ర పోతున్న అతనిని భరించలేక పోయింది.
“పగలంతా నీకూ, నీ మనవడికీ గాడిద చాకిరీ చేయించుకుని చీకటి పడేసరికి అలా చిర్రుబుర్రులాడతావెందుకు… ఈ మూల నుండి ఆ మూలనున్న అతనింటికి పాతిక కిలోమీటర్లు ఈ రాత్రప్పుడు వెళ్ళకపోతే ఇక్కడ మనింట్లోనే ఏదో మూల అతను పడుకోకూడదా…” అంటూ గీత తల్లి రికమండేషను.
ఓ తరం వెనుక స్త్రీ అయినా ఆ తల్లికున్న ఆలోచనా వైశాల్యం గీతలో లేదు. ఆ అమ్మ కడుపున తప్ప పుట్టింది గీత.
“కూడదు…” అంది మొండిగా. నిజానికి ఎందుకు కూడదో కారణం గీతకూ తెలియదు.
“ప్రొద్దునే లేచాక మళ్ళీ నాకు ఏవో అవసరాలుంటాయి… మళ్ళీ చీకటి పడ్డాక ఆ వేళప్పుడు వెళ్ళటం ఎందుకు అంటావు. అలా అతను మనింట్లోనే ఎప్పటికీ వుండిపోతాడా..” గీత తల్లి పైన అరిచింది.
నిజానికి అతనలా వుండిపోతే గీతకు వచ్చే నష్టము, గీత రాచకార్యాలకు తగ్గే ప్రైవసీ ఏమీ లేదు.
అతను రాత్రుళ్ళు వుండటం గీతకు నచ్చదంతే.
అమ్మ తనను కాదని అతనికి వత్తాసు పలకటం కూడా నచ్చలేదు.
కాని ఏమీ మాటాడలేక మౌనంగా వుండి పోయింది. పైగా గీత ఇష్టానికి వ్యతిరేకంగా అమ్మ అనుమతితో అడపాదడపా రాత్రుళ్ళు కూడా తమ ఇంట్లోనే వుండిపోతున్నాడని అతని పైన కక్ష పెంచుకుంది.
మామూలుగానే పసిపిల్లలంటే వాత్సల్యానురాగాలున్న అతనికి రమణ త్వరగా మచ్చికయ్యాడు. అతను వచ్చినప్పుడల్లా రమణకి ఇష్టమైన కిండర్ జాయ్లు తెస్తుండేవాడు. కిండర్ జాయ్లు చూసిన జాయ్‌లో వెలిగిపోయే పసివాడి మొహం అతని మొహాన్ని వెలిగించేది. అతడిని రమణ ‘కిండర్ జాయ్ తాత’ అని పిలిచేవాడు. ‘తాత’ అన్న వాడి పిలుపుకి అతని తనువెల్లా పులకించి చలించి పోయేవాడు. గీతకు అతని లోని నిజాయితీ, నిర్మలత్వం, సహనం, ప్రశాంతత నచ్చేవే తప్ప అతను గీత పైన కనబరిచే ప్రత్యేక శ్రద్ధ, స్నేహార్తి నచ్చేవి కావు.
కెప్టెన్ సాబ్ రమణ పైన ఎంతగా మమకారం పెంచుకున్నాడంటే గీత అతనిని ఎంత నిరసనగా చూసినా అభిమానం చంపుకుని వాడిని చూడటం కోసం వెళ్ళేవాడు. అలా వెళ్ళినవాడు ఒక్కోసారి ఉండిపోయేవాడు. రమణ గీత దగ్గర కాకుండా అతని దగ్గర పడుకోవటానికి ఇష్టపడే వాడు. అతను ఆ ఇంట్లో పడుకున్న రోజున రమణకి పండుగలా వుండేది.
ఓ రోజున హఠాత్తుగా మధురైలో వుంటున్న కెప్టెన్ సాబ్ భార్య పోయింది. ఎప్పుడూ పెద్దగా భార్యతో కలిసి లేనప్పటికీ ఆవిడ పోయాక అతను తల్లిని కోల్పోయిన అనాథ బిడ్డలా అనిపించాడు. అప్పటివరకూ ఆర్మీ బింకంతో వుండే అతని శరీరం నవనాడులూ కృంగినట్టయ్యింది. మొదటిసారి అతని పట్ల గీత మనసు మెత్తబడి స్పందించింది. గీత తల్లికి అతని పైన ప్రేమ రెట్టింపు అయ్యింది.
అతను భార్య పోయాక మధురై వెళ్ళటం పూర్తిగా తగ్గించేసాడు. హైదరాబాదులో తను కట్టుకున్న ఇంట్లో కూడా తక్కువగా వుండే వాడు. ఎక్కడ తిరిగే వాడో తెలియదు. మనిషి చాలా ఉదాసీనంగా ఉంటూ రమణతో ఎక్కువ సమయం గడపటానికి ఇష్టపడేవాడు. గీతను బాధపెట్టటం ఇష్టం లేక రాత్రుళ్ళు మటుకు గీత ఇంటి నుండి వెళ్ళిపోయేవాడు.
అతను గీత ఇంట్లో వున్న ఒక రాత్రి ఓ సారి హాలులో AC పాడయి పోయింది. సలసల కాలుతున్న వెట్రిఫైడ్ టైల్స్.. ఆవిర్లు చిమ్ముతున్న గోడలు. హాలు సెగలు గక్కుతూ వేడెక్కిపోయి వుంది. గెస్ట్ బెడ్రూంలో ఏసీ లేదు.
గీత తల్లి ఎంతో పెద్ద మనసుతో అతనిని తన బెడ్రూంలో పడుకోమని తను హాలులో దీవాన్ పైనో లేదా గీత గదిలోనో పడుకుంటానంది. గీత అతను ఇంటి అల్లుడేమీ కాడనీ, తల్లిని ఆమె రూము నుండి మారొద్దని గట్టిగా వారించింది.
రమణ అంత వేడిలోనూ అతని దగ్గరే హాలులో పడుకుంటానని మారాం చేసాడు. అతను వాడిని సముదాయించి గీత బెడ్రూంలో పడుకోబెట్టి వెళ్ళాడు.
గీత తల్లి విశాలమైన గీత బెడ్రూంలో కనీసం కింద ఓ స్పేర్ పరుపు వేస్తే అతను కాస్త సుఖంగా చల్లగా పడుకుంటాడని గీతకు సలహా ఇచ్చింది. తల్లి సలహాకి గీతకు మండింది. కాని హాలులో గాభరా పుట్టిస్తున్న వేడికి అతని పైన దయ కలిగింది. అయినా హాలులో ఏసీ పాడయినప్పుడు అతను ఇక్కడెందుకు ఉండిపోవాలని కోపం కూడా వచ్చింది.
అసలు గీతలో జాలి దయ అనేవి లేవో, లేక తోటి మనుషుల మీద ప్రేమ లోపించిందో, తనపై తనకే నమ్మకం లేదో, అసలు గీతలో మానవత్వమే నశించి పోయిందో ఆమెకే తెలియట్లేదు.
గెస్ట్ బెడ్రూంలో పరుపు తెచ్చి విసురుగా తన బెడ్రూంలో మరో మూల వేసింది. చిరాకు మొహంతో రుసరుసలాడుతూ అతనిని వచ్చి పడుకోమంది. అతను అపనమ్మకంగా గీత వైపు చూసి ఆశ్చర్యానందాలతో వెళ్ళి పడుకున్నాడు.
అతనికి గీత తన బెడ్రూం షేర్ చేయటం మహా అదృష్టంలా వుంది. కింద పరుపు వేసినా అతనిలో ఎలాంటి చిన్నతనపు భావన లేకుండా పైగా సంతోష పడటం చూసి గీతకు ఆశ్చర్యమేసింది. చెట్టంత మగాడిని అలా కింద పడుకోబెట్టడం గిల్టీగా కూడా అనిపించింది. అతను పడుకున్న మరు నిముషంలోనే గురకలు పెట్టటం మొదలెట్టాడు.
అతను సౌకర్యంగా కొడుకు కోడళ్ళతో మధురైలో వుండకుండా ఒక కెప్టెన్ ర్యాంకు ఆఫీసర్ అయ్యీ అలా రమణపై ప్రేమతో తనెంత అగౌరవ పరిచినా అలా సహించి భరించటం, లొంగిపోయి పడి వుండటంలో అంతరార్ధం ఏమిటో గీతకు అర్థం అయ్యేది కాదు.
అయినా తన కాఠిన్యాన్ని వదిలి నాలుగు ప్రేమ వాక్కులు పలకలేక పోయేది.
ప్రేమరాహిత్యంలో కొట్టుకునేది. గీతకే క్లారిటీ లేని కారణాలు ఆమెను కలవర పెట్టేవి.
ఏ జన్మలోనో అతను తనకు బాకీ పడి వుంటాడని ఏదో మిగిలిపోయిన ఋణానుబంధం తీర్చుకోటానికే వచ్చాడనుకునేదే తప్ప గీతకు మరో ఆలోచన వచ్చేది కాదు.
కూతురి బలవంతం మీద రమణకి ఐదేళ్ళు నిండుతూండగా గీత భారతదేశం వదిలి నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోయింది. తమతో అంత అనుబంధం పెంచుకున్న అతని గురించి వీసమెత్తయినా ఆలోచించకుండా వలసపోయింది. సముద్రమంత అగాధమైన అతని ప్రేమను అర్థం చేసుకోలేక కెరటాల్లా ఎగిసిపడే అనురాగ వీచికలను దరి చేరనీయక సప్త సముద్రాలు దాటి తన రాతను తనే లిఖించుకుంటూ వెళ్ళిపోయింది.
గీత లేని భాగ్యనగరంలో వుండలేక అతను మధురై వెళ్ళిపోయాడు. సురక్షితంగా వుంటుందని అతని బైక్ గీత ఇంటి పార్కింగ్ లోనే పెట్టాడు.
గీత అతనిని చూసి రెండేళ్ళయ్యింది. అమెరికాలో అల్లుడి ఇంట్లో వుంటున్న గీతలో ఇప్పుడు తెలియని వెలితి, మనస్తాపము, అశాంతి చెలరేగి కెప్టెన్ సాబ్ గుర్తుకు రాసాగాడు. గీతకు అతని మధు హాసం గుర్తొచ్చి తనను వేధిస్తున్న ఒంటరితనపు గాయానికి అతని ప్రేమే లేపనంలా తోచింది ఆమెకు. అనేక సంఘర్షణల అనంతరం అంతఃమధనం తరువాత ఆమెకు ఏదో దిశానిర్దేశం అయినట్టనిపించింది.
అంత కాలంగా గీత తన మనసులో గీసుకున్న సరిహద్దు గీతలను చెరిపేసి, తను చేసిన పొరపాటును సరిదిద్దుకుందామని తన చేతి గీతలను మార్చేసే ప్రయత్నంలో జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభిద్దామని నిర్ణయించుకుంది. ఎంత మహోన్నతమైన ప్రేమ స్ఫూర్తి నిస్తే ఒక పరిపూర్ణ స్త్రీ వున్న బంధాలన్నింటికీ దూరంగా వెళ్ళి కొత్తగా జీవితం మొదలెట్టాలని కోరుకుంటుంది..!
అప్పటికి గీత అతనితో ఫోనులో మాటాడి మూడు నెలలయ్యింది. ఎంతో ఉద్వేగంగా అతనికి ఫోను చేసింది. అతను కరోనా కారణంగా మధురైలో కొడుకు, కోడళ్ళతో వేరు పడి ఊరికి దూరంగా జనసంచారం లేని పొలంలో ఒక గదిలో వుంటున్నానని నిస్సత్తువగా చెప్పాడు.
అతని నీరసమైన మాట విన్న గీత గుండె తరుక్కు పోయింది. ఒక్క ఉదుటున అతని వద్ద వాలాలని బలంగా మనసు లాగింది. గీత తనలో కొత్త గీతను చూసి తనే ఆశ్చర్యపోయింది.
వెంటనే గీత ఇండియాకి టికెట్ బుక్ చేయించుకుంది. టికెట్ బుక్ అయ్యాక తను అతనిని చేరబోతున్నట్టు అతనికి చెబుదామని ఆదుర్దాగా సంభ్రమంతో ఫోను కలిపితే, అటు నుండి రెస్పాన్స్ లేదు.
గీత పిలుపు కోసం ఎప్పుడూ చకోరంలా వేచి వుండే అతని ఫోను నిశ్శబ్దమై పోయింది. నిశబ్దమైపోయిన అతని స్మృతిలో ఆమె స్తబ్దమైపోయింది.
అతను గీత పిలుపుకు అందనంత దూరం వెళ్ళిపోయాడు.
గీత ఇప్పటికీ అతను ఆమె తలపుల్లోకి వచ్చినప్పుడు, చిట్టి రమణ అతనిని తలిచినప్పుడూ పలకని అతని నంబరును ప్రయత్నిస్తూనే వుంటుంది.
రమణను తిప్పిన అతని బైక్ అతని జ్ఞాపకంగా రెండేళ్ళుగా గీత పార్కింగ్ లోనే వుంది.
అతని ప్రకటించని ప్రేమ, తను ప్రకటించిన అసహనం తలుచుకుని గీత బాధపడని ఘడియ లేదు.
కొన్ని బంధాలకు అర్ధముండదు. కాని అందులోని గాఢత్వానికి హద్దులుండవు.
కొన్ని ఇష్టాలకు కారణాలుండవు. ఎంతటి నిరసనా వాటిని తగ్గించవు.
కొన్ని భావాలు అప్రకటితంగానే అంతరించి పోతాయి. అయినా అమరం అవుతాయి.
కొన్ని ఆప్యాయతల విలువ వాటేసుకొన్నప్పుడు తెలియవు. అంతర్ధానమయ్యాక కావాలన్నా దొరకవు.
(మళ్ళీ కలుద్దాం)
ఈ రోజుల్లో హైటెక్ వేగంతో నవలలు, కథలు, కవిత్వం, సమీక్షలు రాస్తున్న రచయితల్లో శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి ముందు వరుసలో ఉంటారు. ఇప్పటి పాఠకులకు ఝాన్సీగారు కొత్త రచయిత్రి కానీ ఆవిడ యుక్త వయసులోనే రచించిన కథలు, కవితలు వివిధ పత్రికలలో వెలువడ్డాయి. కొన్ని వ్యక్తిగత కారణాల వలన మధ్యలో వారి రచనా వ్యాసంగానికి గండి పడింది. తిరిగి గత రెండేళ్ళుగా మళ్ళీ కలం పట్టిన ఝాన్సీగారి అనేక కథలు కవితలు వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి. వీరి కథలు, కవితలు ప్రతిలిపిలో అనేక బహుమతులు గెలుచుకున్నాయి. వీరు హైదరాబాదుకు చెందిన వారైనప్పటికీ ప్రస్తుత నివాసం ఆస్ట్రేలియా. తెలుగు సాహిత్యం పట్ల అమిత ప్రేమ ఉన్న ఝాన్సీగారు ఆంగ్లంలో కూడా పట్టభద్రులు. 2019లో ముద్రితమైన ‘అనాచ్చాదిత కథ’ అనే వీరి తొలినవల అసంఖ్యాక పాఠకుల అభిమానం చూరగొని అంపశయ్య నవీన్ గారి ప్రత్యేక బహుమతిని పొందినది. వీరి రెండో నవల ‘విరోధాభాస’.
Well said … all lives will have many emotions unspoken 👍❤️
Yes Navneeth brother, all have emotions unspoken and stories untold
గీత పాత్ర అతని పాత్ర…ప్రత్యేకం. అతను కుర్రాడిని ప్రేమతో వశపరుచుకున్నది గీత కొరకే అన్నది స్పష్టం. గీత ద్విపాత్రాభినయం చేసిందా. అన్న అనుమానం పాటకుడికి కలగక తప్పదు. ఒకప్రక్క మనవడి పరంగా ‘అతని’ పట్ల ఆరాధనా భావం కలిగినా,అతని రాకపొకల విశయం లో నలుగురూ ఏదో అనుకుంటారన్న భయం లేకపోయినా,మరి గీత అలా ఎందుకు ప్రవర్టించింది? అమెరికా వెళ్లి అతనికొసం అంతగా ఆలోచించి,కేవలం అతనికొసం ఇండియా రావాలనుకున్న దీ? ఇవన్నీ పాటకుడిలొ ఉదయించగల ప్రశ్న లు. మరో ఎపిసోడ్ లో దీనికి క్లారిటీ వస్తుందేమో! రచయిత్రికి అభినందనలు.
డాక్టరుగారూ, మీకు రేకెత్తిన అనుమానాలు సమంజసమేనేమో…. కాకపోతే ఇక్కడ ద్విపాత్రాభినయం ఏమీ లేదు. పరిస్థితులను బట్టి ఒక్కో దశలో ఒక్కో రకంగా ఆలోచనాసరళి మారుతుంటుంది. అమెరికా వెళ్ళాక ఒంటరితనం ఎక్కువై అతని పట్ల గీత ఆలోచనలు మారొచ్చు. ఈ మధ్య నా స్నేహితురాలు మోకాళ్ళ నొప్పులతో కూర్చుంటే పైకి లేవటం కష్టమవుతోందని, రెండో పెళ్ళి చేసుకుని వుంటే మరో చేతి ఆసరా వుండేదని, ఎంతవరకూ అల్లుడు, కొడుకు తనకు చెయ్యందిస్తారని వాపోతోంది… కాళ్ళు బాగా పని చేసినప్పుడు కలగని ఆలోచన ఈ దశలో వచ్చింది. Change in the way of thinking happens according to situations Sir
అందుకే అన్నాను. ధన్య వాదాలు.
“కొన్ని ఆప్యాయతలువిలువ వాటేసుకున్నప్పుడు తెలియవు. అంతర్ధానం మయ్యాక కావాలన్నా దొరకవు” ఝాన్సీ మార్క్ కొటేషన్ సర్వకాలాలకీ వర్తించేది. గీతకే కాదు, ఎందరో మగవాళ్ళు కూడా గుర్తించాల్సిన విషయం.
సుశీలగారూ, మీ ఆత్మీయ స్పందనకు ధన్యవాదాలండీ💖
నా గొంతును ధారావాహికంగా వినిపిస్తున్న సంచిక యాజమాన్యానికి ఇతర సాంకేతిక సిబ్బందికి నా ధన్యవాదాలు🙏🏻🙏🏻
ఎత్తుగడ ప్రారంభ డైలాగ్”గీత మంచాన్ని పంచుకోవాలని అతను ఎప్పుడూ అనుకోలేదు, ఆమె పడక గదిలో ఓ మూలన పడుకొని స్తే చాలు ఎంతో ఆనందాన్ని పొందేవాడు ” పాఠకుల్లో ఉత్సా హాన్ని, అతృతని కలిగించేలా ముందుకు చదివిస్తుంది. హాట్ట్సాప్ మీ రచనా విధానానికి, (ఒక పురుషుడిగా నేనైతే చాలా ఉద్విగ్నతకు గురి అయ్యాను). కథనం మొత్తం ఒకే టెంపో లో ఎంతో ఉద్విగ్నంగా సాగినది, నాకు తెలిసి గీతలో జండర్ భావన మాటున స్త్రీ సహజమైన రసైక ప్రేమ భావన భరతముని చెప్పిన రస సూత్రమైన “వి భావ అనుభవ వ్యభిచారి భావ సంయోగ ద్రస నిష్పత్తి” సూత్రాన్ని అనుసరించి అమెరికా వెళ్ళిన గీతలో అక్కడి పరిసరాలు ఆమె మనసులో దాగిన బీజరూపంలో ఉన్న ప్రేమ కెరటమై ఉవ్వెత్తున లేచింది. హైదరాబాదులో ఉన్నప్పుడు గీత ప్రవర్తనకు కారణం భరతముని సూత్రానికి లోబడే ఉన్నది కాకపోతే జండర్ భావన గా చెప్పుకుంటున్నాము. ఏ స్త్రీ అయినా గీత లాగే ప్రవర్తిస్తుంది. గీత ప్రవర్తనను చాలా సహజంగా చూపించారు.
విషయము( కథ)ఎంత ఉదాత్తమైనదొ, చెప్పిన విధానం ( కథనం) కూడా అంతే ఉత్తమంగా, ఉద్విగ్నంగా, మలుపులు తిరుగుతూ పాఠకుడి అంచనాలకు అందకుండా నడిచినది. అన్ని పాత్రలు సమపాళ్ళల్లో నడిచాయి.
“దరి చేరని కెరటం” ఒక గొప్ప కథ గా ప్రసిద్ధి పొందుతుంది ప్రథమ బహుమతి గెలుచుకుంటుంది. సందేహం లేదు. ( కెప్టెన్, రమణ కు మిత్రుడై క్రమంగా మొత్తం కుటుంబానికి మిత్రుడిగా (ఎదిగాడు) “ఒదిగాడు” ).
……Saleem Mohammad
ఒడ్డున పడ్డ కఠినశిల, కెరటాలు నిశ్చలమవటం ఇలాంటి భాషా,భావనా కలిసిన ప్రయోగాలు ఝాన్సీ తప్ప ఎవరూ రాయలేరేమో👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
……..రాజకుమారి పి
Intro to the story is superb. మనిషిలోని భావోద్వేగాలు ఒక్కొక్కసారి లింగ వివక్షకి అతీతాలు. సమాజ దృక్కోణానికి భిన్నాలు. ఆలోచనాలోచనాలకు అందని దృశ్య సమాహారాలు. స్ఫటిక స్వచ్ఛతకు సాదృశాలు. Wonderful writeup.
…..Lakshminarayana Rao Bitra
మీ టైటిల్ ‘దరి చేరని కెరటం’ సూపర్…..తీరం చేరని కెరటాలు అని ఓ నలుగురు కవులు కలిపి ఎప్పుడో ఓ సంకలనం వేశారు…
…Rajkumar Bunga
అపార్థాలూ, అతి జాగ్రత్తలూ అందరినీ దూరం చేస్తాయి
Yes గీతా, thank you💖
Jhansi Garu! Baagundandi!! 👌👌👌
సాంబశివరావు గారూ, ధన్యవాదాలండీ🙏🏻🙏🏻
I feel responsibility is a big bond than love ❤️ I know your clutched gripped in love & responsibility. Your out burst is out dated dear old sister…..
The people now require fantasy
…..Narisetty Navneet Kumar
కొందరు మనుషులం తే.. ఎదురుగా ఉన్నప్పుడు విలువ తెలుసుకోరు.. దురమయ్యక దిగులు పడుతుంటారు . ఎప్పుడైనా గడిచిన క్షణము.. కరిగిన కాలం తిరిగి రావని ఎప్పటికి గ్రహిస్తారో
…… Chatrapati Yaddanapudi
Heart touching, melting, breaking…..Crying……..🌹 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మీ పెన్ పవర్ కి… 🌹🌹🌹 కొన్ని కొన్నింటికి ఏమి రెస్పాన్స్ ఇవ్వాలో తెలియదు… మనసు భారంగా మారిపోతుంది
……..రమాదేవి
Too late is too wrong..
…ఛత్రపతి యద్దనపూడి
మీ రాతల్లో నాకు యద్దనపూడి కనిపిస్తున్నారు.ఎంతో చక్కని భావోద్వేగాల పరిపూర్ణ రసరమ్యం మీ కధానికం. దరి చేరని కెరటాలు సూపర్బ్ టైటిల్. భర్త పోయిన ప్రతి ఆడది లో కలిగే ఆటుపోట్లను సహజంగా వ్రాశారు. ఏవైనా బంధాలు దూరమై నప్పుడే వాటి విలువల బరువు పెరుగుతుందనే మీ ఆర్ద్ర పూరిత కధ హృదయాన్ని హత్తుకుంది .ఇంత చక్కని శైలి మనసును ఆకట్టుకునే పదాలతో మీ రచనలు సూపర్బ్ హాట్సాఫ్ చదివే అవకాశం కలిగి నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు చక్కని రచనకు హృదయపూర్వక శుభాకాంక్షలు శుభాభినందనలు మీకు ఝాన్సీ గారు మరొక ఎపిసోడ్ కై ఆసక్తి గా ఎదురు చూస్తూ సంక్రాంతి శుభాకాంక్షలతో శెలవు 💐👏👌🎊💐👏👌🎉💐👏👌🎊💐👏👌🎉💐
అసలు ఎలా స్పందించాలో తెలియట్లేదు మేడం. అవ్యక్త భావావేషాలను సైతం వ్యక్తపరిచే మీ వ్యక్తికరణకు జోహార్లు 🙏🙏
….బంగారు కల్పగురి
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™