బస్‌లో లలితకళాతోరణంకి వెళ్ళాం. అమ్మా, మా వారు ముందువరుసలో కూర్చున్నారు. అవార్డుల ప్రదానం ప్రారంభించాకా, ఎంతకీ రచనా రంగం వైపు రారు. నాకు చిరాకు వచ్చేది ఎక్కడంటే, కథ ముందు కదా సినిమాకి! ఎందుకు అవార్డులు ఇచ్చేటప్పుడు ఆఖరికి ఇస్తారు? ప్రాధాన్యం ఇవ్వనే ఇవ్వరు. హీరోకీ, హీరోయిన్‌కీ, కమేడియన్కీ ప్రాధాన్యత వద్దనడం లేదు. కానీ కథకీ, ప్రొడక్షన్‌కీ, పాటలకీ, స్టంట్స్కీ, ఈ ఆర్డర్లో వెళ్తే, ఆ హీరో హీరోయిన్ల కోసం ప్రజలు తప్పనిసరిగా వేచి వుంటారు. కథకి చిట్టచివరికి ఇస్తే ఆడిటోరియంలో ఎవరుంటారు? అసలీ నంది అవార్డులకే, స్టేజ్ మీద ఎక్కువ జనం వుంటారు, కింద కన్నా! అసలు నాకు షాక్ ఎక్కడ తగిలిందంటే, నంది అవార్డు ముఖ్యమంత్రి ఇవ్వాలి. కానీ ఆయన అవసరమైన పని పడి వెళ్ళిపోవడంతో అప్పటి బొగ్గు శాఖామాత్యులు దాసరి నారాయణరావు గారు అవార్డులు ఇస్తున్నారు.
ఏది అవాయిడ్ చెయ్యాలనుకుంటామో అదే జరుగుతుంటుంది నా విషయంలో. దాసరి నారాయణరావు గారు కథా హక్కుల వేదికకి ప్రెసిడెంట్‌గా వున్నప్పుడు రచయితల వివాదాలు తీర్చడానికి, నన్ను అందులో మెంబర్‌గా వేస్తే, నేను వుండనన్నాను! ఆకెళ్ళ గారు మా జనరల్ సెక్రెటరీ. “ఎందుకమ్మా?” అన్నారు. “ఆయనకి నమస్కారం పెట్టాల్సొస్తుందండీ, నా కిష్టం లేదు” అన్నాను. ఆయన ఏం అడగలేదు, ఆ పైన!
ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు అంటే నాకు గౌరవం లేక ఆ మాట అనలేదు! రామానాయుడు గారితో, అక్కినేని నాగేశ్వరరావు గారితో నాకున్న అనుబంధం నేను చెప్పానుగా. కానీ ఈయనతో నాకో చేదు సంఘటన జరిగింది. నేను సినీ పరిశ్రమకి వస్తున్న కొత్తల్లో, రాగసప్తస్వరంకి మెంబరుగా వున్నప్పుడు 96, 97 సంవత్సరం సంగతి, నేను రాజ్యలక్ష్మి గారితో దాసరి గారి ఆఫీస్‌కి వెళ్ళాను.
“ఈ అమ్మాయి రమణీ ప్రభాకర్, మంచి రచయిత్రి, నవలలు రాస్తోంది” అని రాజ్యలక్ష్మి పరిచయం చేసింది. “ఏం రాసావు?” అని ఆయన అడిగారు. “‘మధురమైన ఓటమి’, ‘మొగుడే రెండో ప్రియుడు'” అని చెప్పాను.
“ఆ నవలలు తీసుకుని పధ్నాలుగవ తేదీన ఆఫీస్‌కి రా. మీ ఫోన్ నెంబర్ ఇవ్వు” అన్నారు.
నేను పొంగిపోయాను. ఫోన్ నెంబర్ ఇచ్చి ఆయన కాఫీ తెప్పిస్తే తాగి వచ్చాను. కనిపించినవాళ్ళకీ, కనిపించని వాళ్ళకీ కూడా “దాసరి గారిని కలిసాను… ‘నన్ను గురువుగారూ అని పిలవమన్నారు!’ మళ్ళీ రమ్మనారు” అని చెప్పాను.
మర్నాడు ప్రొద్దుటే ఫోన్ వచ్చింది. “నేను దాసరి నారాయణరావుని” అన్నారు. నేను చాలా అనందపడ్డాను. “ఎల్లుండి వస్తున్నావు కదా, అది తెలుసుకుందాం అనే!” అన్నారు. “అయ్యో… తప్పకుండా వస్తానండీ” అన్నాను.
కానీ నేను చాలా శ్రమపడీ, నడిచీ, ఓసారి వెళ్ళిన ఆఫీసే అయినా, వెతుక్కుంటూ వెళ్ళి చాలా ఆశాభంగం చెందాను, ఆయన ప్రవర్తన వలనా, మాటల వలనా! చనిపోయిన వాళ్ళని మనం గౌరవించాలి అని నా అభిప్రాయం… చాలా బాధపడ్డాను ఓ స్త్రీగా, రచయిత్రిగా ఆ రోజున. ఆయనకీ చెడ్డ రోజే, నా లాగే! ఎందుకంటే, మానవులు అన్నప్పుడు ఒకేలా ప్రవర్తించరు. కొన్నిసార్లే అవతలి వారిని బాధపెట్టేట్టు ప్రవర్తిస్తారు… ఆ రోజున వెళ్ళడం, అదీ ఫిబ్రవరి పధ్నాలుగున… నా తప్పు! ఇంతకన్నా ఈ విషయం ప్రస్తావించడం నాకిష్టం లేదు. నేను ఆ రోజు తర్వాత ఆయనని కలవడం కానీ, ఆ పేరు తలవడం కానీ ఆయన బ్రతికి వుండగా ఎన్నడూ చెయ్యలేదు! నేను చాలా ఘాటుగా, కరుకుగా మాట్లాడగలను. స్త్రీగా నాతో ఎవరైనా చనువు మీరి ప్రవర్తిస్తే… నా నాలికకి పదునెక్కువ! ఒక్కోసారి చేతికి కూడా…
కొన్ని చేదు సంఘటనలూ… కొన్ని తీపి సంఘటనలూ కలిస్తేనే జీవితం కదా! ఎప్పుడైనా ఎవరి వల్లనైనా బాధ కలిగితే, అదే తలచుకుంటూ, ఏడుస్తూ, వారిని శాపనార్థాలు పెడుతూ కూర్చోకూడదు!
వారిని జీవితంలో నుండి డిలీట్ చేసి, పూర్తిగా మరిచిపోవాలన్నది నా వుద్దేశం! ఓ కిటికీ తెరిస్తే చెడు దృశ్యాలూ, చెడు వాసానా వస్తోంది అనుకోండీ… ఆ కిటికీ తలుపు వేసెయ్యాలి… అంతే కానీ, నేను తెరుచుకుంటానూ, ఆ మురుగు వాసన నాకు రాకూడదు అనుకుంటే లాభం లేదు…. మనని మనం కష్టపెట్టుకోవడమే అవుతుంది! అంతే… ఇది నా పంథా… కాలికి పనికి రాని చెప్పు కంచెలో విసిరేయాలి అన్నట్టు, చాలా పరిచయాల్ని విస్మరించాను!
సడెన్‌గా దాసరి నారాయణరావు గారు స్టేజ్ మీద కనబడేసరికీ నాకు ఎంతో షాక్ కలిగింది. నా జీవితంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన సంఘటన, నంది అవార్డు రావడం, అది ఈయన చేతుల మీదుగా అందుకోవడం విధి రాత… కానీ అది భగవత్సంకల్పం, ఎందుకంటే… “నువ్వు చాలా మామూలుగా అనుకున్న ఈ అమ్మాయి ప్రతిభ వున్న రచయిత్రి” అని అతనికి చెప్పినట్లయింది!
నేను ఆ వేదికకీ, ఆ అవార్డుకీ మర్యాదిచ్చి, నమస్కరించి ఆయన చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను! నా భర్త చిరునవ్వు నవ్వారు. మా మధ్య దాపరికాలు లేవు… ఎక్కడి కెళ్ళి వచ్చినా, ఆ రోజు విశేషంగా ఏం జరిగినా, నేను ఇంటికొచ్చి ఆయనకి పూస గుచ్చినట్లు చెప్తాను. ఆయనకి ఈ సంఘటన తెలుసు!
నిన్ననే అవార్డుల జ్యురీలో నా కో-మెంబర్ ‘ధ్వని’ అనే ఆవిడ “నేను పెళ్ళి చేసుకోలేదు… నా కాళ్ళ మీద నేను నిలబడాలని… పెళ్ళి స్వేచ్ఛకి ప్రతిబంధకం అని. మా అన్నయ్యా, అక్కయ్యా కూడా పెళ్ళి చేసుకోలేదు మా ఇంట్లో” అంది.
“నాకు చాలా చిన్న వయసులో 19 సంవత్సరాలకి పెళ్ళి అయింది… పెళ్ళి వల్ల నాకెంతో స్వేచ్ఛ వచ్చింది” అని చెప్పాను.
“సినిమా ఫీల్డు గురించి బయట జనానికి చాలా అపోహలుంటాయి కదా! మరి మీ ఆయనకి, నువ్వు వయసులో వున్నప్పుడు, చూడ్డానికి నదురుగానే వున్నావు కూడా… ఏమీ అనుమానాలు లేవా?” అని అడిగింది.
“మా ఇంట్లో, అటు పుట్టింట్లో, ఇటు అత్తగారింట్లో, సినిమా ఫీల్డు అంటే ఏమీ తెలీదు… అదే నా అదృష్టం… నా భర్తకి అన్నీ చెప్తాను… మిగతా వాళ్ళ దగ్గర అన్నీ దాస్తాను” అని చెప్పాను. ఆవిడ ఆశ్చర్యపోయింది. ఆవిడకీ దాదాపు నా వయసే వుంటుంది!
(సశేషం)
రొమాంటిక్ రచనలతో అనేక తెలుగు పాఠకుల హృదయాలలో స్థిరనివాసం ఏర్పరుచుకుని తీయతేనియలొలికే సంభాషణలతో అందరి హృదయాలను దోచుకుంటున్న ప్రఖ్యాత రచయిత్రి. ‘కాలమ్ దాటని కబుర్లు’ అనే పుస్తకం, ‘రేపల్లెలో రాధ’, ‘ఎవరే అతగాడు’, ‘అనూహ్య’, ‘ఖజూరహో’, ‘ఆ ఒక్కటి అడిగేసెయ్’ వంటి నవలలు వెలువరించారు.
Yes, that is Ramani garu 🙏 Role model for woman’s world. Inka inthaku minchina padalu maa laati Patakulaku spurinchavu.
Thanks Kalavati garu
చదవడానికే భయంగా ఉంది.. మీరు నిర్భయంగా వ్రాసేస్తున్నారు మేడం – సన్నిహిత్
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™