వానాకాలం ముగిసి ఇటీవల కాస్తంత శాంతించిన ఆకాశంలో హఠాత్తుగా సూర్యుడు మాయమయ్యాడు. గుంపులు గుంపులుగా మేఘాలు వచ్చిచేరాయి. ఉన్నట్టుండి ఆకాశం ఉరుములతో హూంకరించింది. క్షణాల్లో వాన మొదలై జోరందుకుంది. ఈ అకాల వర్షాలేమిటో. మానవ తప్పిదాలతో వాతావరణమంతా గందరగోళంగా మారి ఎండా కాలంలో వానలు, వానాకాలంలో ఎండలు.. అనుకుంటుంటే వాన వెలిసింది. చెట్లు ఆనందస్నానాలు చేసి తలలూపుతూ ఆకుల కురులార బెట్టుకుంటున్నాయి. నా చూపులన్నీ నింగి పైనే. నేను కోరుకున్న దృశ్యం గగనాన కొలువుతీరింది. అదే.. రమణీయ సప్తవర్ణాలంకృత ఇంద్రధనుస్సు. మది ఆనందాల నది అయింది. బాల్యంలో వానొస్తుంది అనగానే ప్లే గ్రౌండ్ నుంచి కదలబుద్ధయ్యేది కాదు. కారణం ఇంద్రధనస్సు చూడాలన్న కోరిక. ‘ఇంద్ర ధనస్సు’ పేరుతో ఓ తెలుగు చిత్రం కూడా వచ్చింది. అసలీ రంగుల ప్రపంచం ఎంత సుందరమైంది! మన చుట్టూతా ఎన్ని రంగులో. ఎటుచూస్తే అటు వర్ణ మనోహరం. నీలి గగనం, ఎర్రని సూరీడు, నీలి సంద్రం, పచ్చని చెట్టు, ఎర్ర మందారం, పచ్చని చిలక, నల్లని కోయిల.. అందుకే ఆత్రేయ..
‘ఎంతో రసికుడు దేవుడు ఎన్నిపూవులెన్ని రంగులెన్ని సొగసులిచ్చాడు అన్నిటిలో నిన్నే చూడమన్నాడు పువ్వులన్నీ ఏరి నీ బొమ్మ చేసినాడు రంగులన్నీ రంగరించి పూతపూసినాడు.. నల్లని కురులలోకి మల్లెపూలు సొగసు పసిడి రంగు ప్రియురాలికి గులాబీలు మెరుగు ముద్దులొలుకు మోముకు ముద్దబంతి పొందికా మొత్తంగా ఏ పువ్వూ నీకు సాటి రాదుగా..’ అన్నారు.
చిన్నప్పుడు న్యూటన్ వర్ణచక్రం గురించి చదువుకోవటం గుర్తుకొచ్చింది. న్యూటన్ పదహారువందల అరవై ఆరులో ఓ వర్ణచక్రాన్ని రూపొందించాడు. అందులో ఏడు రంగుల్ని.. వయొలెట్, ఇండిగో, బ్లూ, గీస్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ (విబ్జియార్)లను పొందుపరిచాడు. ఈ చక్రాన్ని అతి వేగంగా తిప్పినపుడు కనిపించేది కేవలం తెలుపు మాత్రమే. ఈ రంగులు పట్టకంగుండా పయనించినప్పుడు తెల్లనికాంతిని ఏర్పరుస్తాయి.
ఒక్కోరంగుది ఒక్కో ప్రత్యేకత. ఎరుపు శక్తికి, బలానికి సంకేతమయితే ఆకుపచ్చ సామరస్యతకు, కాషాయం త్యాగానికి, తెలుపు పవిత్రతకు, శాంతికి, నీలం ఆహ్లాదానికి, ప్రశాంతతకు, పసుపు సౌభాగ్యానికి సంకేతాలుగా చెపుతారు. దేవుళ్లను మాత్రం నీలమేఘచ్ఛాయలోనే కవులు వర్ణించారు. రాముడు నీలమేఘశ్యాముడని, కృష్ణయ్య నల్లనయ్య అని చదువుతుంటాం. రంగులంటే ముఖ్యంగా – గుర్తొచ్చే పాట ‘తూర్పువెళ్లే రైలు’లో ఆరుద్రగారి పాట..
‘తూర్పువెళ్లే రైలు’లో ఆరుద్రగారి పాట.. “చుట్టూ చెంగావి చీర కట్టాలె చిలకమ్మా తెల్లచీరకందం నువ్వే తేవాలే చిట్టెమ్మా నల్లచీర కట్టుకున్నా నవ్వాలే చిన్నమ్మ ఎర్రచీరె కట్టుకుంటే సందెపొద్దు నువ్వమ్మా పచ్చచీర కట్టుక అంటే పంటచేను సిరివమ్మా నేరేడు పళ్లరంగు జీరాడే కుచ్చెళ్లు.. వంగపండు రంగులోన పొంగుతాయి సొగసుల్లు వన్నె వన్నె చీరలోన నీ ఒళ్లే హరివిల్లు..” ఎంతో లలితంగా, హృద్యంగా సాగే వలపుగీతం.
బంగారు బాబు చిత్రంలో హుషారుగా సాగే ‘చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నదీ
దాని జిమ్మ దియ్య… అందమంతా చీరలోనే ఉన్నది’ అని ఓ హిట్ పాట ఉంది.
అన్నట్లు మనకు అందమైన రంగుల పండగ హోలీ ఉందికదా. వసంతాలు చల్లుకుంటూ ఆనందంలో మునిగే రోజు.
హోలీ పాట అనగానే ముందుగా గుర్తొచ్చేది ‘ఫూల్ ఔర్ పత్తర్’లో ఆశాభోంస్లే పాడిన
‘లాయి హై హజారోం రంగ్ హోలీ కోయి తన్ కేలియే కోయి మన్ కేలియే లాయి హై హజారోం రంగ్ హోలీ కోయి తో మారే హై భర్ పిచ్ కారీ కోయి రంగ్ డాలే నజర్ మిత్ వాలి..”
మంచి జోష్‌లో సాగుతుంది ఆ హోలీ సన్నివేశం. అందులో అందరితోపాటు ఓ కుక్క కూడా ముందుకాళ్లు రెండూ ఎత్తి డ్యాన్స్ చేయడం భలేగా ఉంటుంది.
అంతలో ‘సిల్సిలా’లో అమితాబ్ తానే స్వయంగా పాడుకున్న హోలీ పాట గుర్తొచ్చింది. అది..
‘రంగ్ బర్సే.. అరె రంగ్ బర్సే. భగె చునర్వాలీ రంగ్ బర్సే అరె కీనె మారి పిచికారీ తోరీ భీగీ అంగియా ఓ రంగ్ రసియా, రంగ్ రసియా హొ..”
ఈ పాటను అమితాబ్ నాన్నగారు హరివంశ్ రాయ్ బచన్ రాయడం విశేషం. ‘షోలే’ చిత్రంలో ఆనంద్ బక్షీ రాసిన
“హోలీ కె దిన్ దిల్ ఖిల్ జాతె హై.. చలో సహేలి.. చలో సహేలి చలో రె సాధీ.. చలో రే సాథీ యే పక్డో యే పక్డో, యే పక్డో. ఇస్సే న చోడో..’ చాలా పాపులర్.
అన్నట్లు భారతదేశానికి ప్రతీక అయిన త్రివర్ణ పతాకంలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులుండటం తెలిసిందే. అలాగే వేర్వేరు రంగాల వారికి వేర్వేరు రంగుల యూనిఫామ్‌లు ఉండటమూ మామూలే. స్కూలు పిల్లలకు సైతం ఒక్కో స్కూల్‌కు ఒక్కో రంగు యూనిఫామ్ ఉండటం తెలిసిందే.
రంగులు పూలకే కాదు, రాళ్లకూ ఉంటాయి. అంతెందుకు ఏకంగా రంగులు మార్చే పర్వతమే ఉంది. అదే ఉలురు. దీన్ని గతంలో అయర్స్ రాక్ అనేవాళ్లు, ఆస్ట్రేలియాలో ఉన్న ఈ పర్వతం తొమ్మిది రంగుల్లో కనిపిస్తుంది. ప్రపంచంలోని అతి పెద్ద మోనోలిక్స్లో ఇదొకటి. మూడువందల మిలియన్ల సంవత్సరాల కిందట ఏర్పడిన శాండ్‌స్టోన్ ఆకృతి. ఈ ఉలురు మూడొందల నలభై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉండి, తొమ్మిది కిలోమీటర్ల చుట్టుకొలతతో ఉంటుంది. స్థానిక అనంగు జాతి ప్రజలు దీన్ని పవిత్రమైందిగా భావిస్తారు. సాధారణంగా – టెర్రకోట రంగులో ఉండే ఈ రాయి ఉదయాలలో ప్రకాశవంతమైన ఎరుపు రంగులోను, సూర్యాస్తమయ సమయంలో నీలం లేదా – ఊదా రంగుల్లోనూ కనిపిస్తుంటుంది. రాళ్లే కాదు, రత్నాలకు వేర్వేరు రంగులున్నాయి. నవరత్నాలలో పచ్చలు, కెంపులు, పుష్యరాగాలు, ఇంద్రనీలం, పగడం.. ఇవన్నీ రంగులతో మురిపించేవే. అన్నట్లు ఎర్ర సముద్రాన్ని మరిచిపోతే ఎలా!
ఆఫ్రికా, ఆసియాల మధ్య ఉన్న హిందూ మహాసముద్ర భాగాన్నే ఎర్రసముద్రమని పిలుస్తారు. ఇంతకూ ఇది ఎర్రసముద్రం ఎందుకయ్యిందంటే ఇందులో ‘ట్రికోడెస్మియమ్ ఎరిత్రేయమ్’ అనే ఓ రకం ఆల్గే ఉండటం వల్లే. ఈ ఆల్గే మరణించినపుడు నీలి-ఆకుపచ్చ రంగుల్లో ఉండే సముద్రం, ఎరుపు-ముదురు గోధుమ రంగులోకి మారుతుంది.
పెయింటర్లు వర్ణచిత్రాలు వేయడం మామూలే. అందులో తైలవర్ణ చిత్రాలు మరో రకం. ప్రస్తుతమైతే అనేకానేక రంగుల టెక్నిక్‌లు అందుబాటు లోకోచ్చాయి. సినిమాలు సైతం మొదట్లో నలుపు, తెలుపుల్లో ఉండేవి. ఆపైన రంగుల సినిమాలు మొదలయ్యాయి. ఈస్ట్‌మన్ కలర్, ఆర్వోకలర్.. ఇలా. టీవీలు కూడా మొదట్లో నలుపు, తెలుపువి మాత్రమే ఉండేవి. ఆపైన కలర్ టీవీలు రంగప్రవేశం చేశాయి. కాలంతో పాటు మనిషి నిత్యం నిద్రలో కనే కలలు కూడా రంగులద్దుకున్నాయి. ‘అభినందన’ చిత్రంలో నాయకుడు, నాయికను..
‘రంగులలో కలవో ఎద పొంగులలో కళవో..’ అంటూ పొగిడే ఓ చక్కటి పాట ఉంది. అంతెందుకు మనిషి తెలుపైనా, నలుపైనా అరచేయి అచ్చతెలుపే కదా. కానీ ఆ అరచేతికే గోరింటాకు పెడితే.. ఎంచక్కని రంగు పండుతుంది కదా. ‘గోరింటాకు’ చిత్రంలో అరచేయి ఎలా పండితే ఎటువంటి మొగుడొస్తాడన్నది దేవులపల్లి పాటలో ఎంచక్కా పండించారు. అది..
గోరింట పూచింది కొమ్మా లేకుండా మురిపాలా అరచేత మొగ్గా తొడిగింది.. ఎంచక్కా పండేనా ఎర్రాని చుక్కా పేరంటాలకి శ్రీరామ రక్ష | కన్నె పేరంటాలకి కలకాలం రక్ష.. మామిడీ చిగురెరుపూ మంకెన పువ్వెరుపూ మణులన్నింటిలోనా మాణిక్యం ఎరుపూ.. సందె వెలుగుల్లోనా దాగె మబ్బెరుపూ తానెరుపు అమ్మాయి తనవారిలోనా… మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు.. సింధూరంలా పూస్తే చిట్టీ చేయంతా అందాల చందమామ అతనే దిగి వస్తాడు..
తెలుగుదనం ఉట్టిపడే పాట.
ఇన్ని రంగులు, ఎన్నెన్నో అందాలు కనువిందు అవుతున్నాయంటే మనకు చూపుభాగ్యం ఉన్నందువల్లే.
మరి కనుచూపు కరవైనవారి మాటో..
అలాటి చెల్లెల్ని ఉద్దేశించి ఓ అక్క ‘తొలికోడి కూసింది’ చిత్రంలో ఇలా పాడుతుంది..
అందమైన లోకమనీ రంగురంగులుంటాయనీ అందరూ అంటుంటారు రామరామ అంత అందమైంది కానేకాదు చెల్లెమ్మా.. చెల్లెమ్మా.. అందమైంది కానే కాదు చెల్లెమ్మా..
అంటూ బాహ్యసౌందర్యమే కానీ అంతఃసౌందర్యం లేని లోకాన్ని వివరిస్తుంది. చివరకు ‘కళ్లు లేని భాగ్యశాలి నీవమ్మా ఈ లోకం కుళ్లు నువ్వు చూడలేవు చెల్లెమ్మా’ అంటుంది. ఆత్రేయగారు ఈ పాటలో లోకం తీరును ఎంత వాస్తవికంగా కళ్లకు కట్టారో! అంధత్వం లేకపోయినా అన్నీ మామాలుగానే చూడగలిగే కొందరికి కొన్ని రంగులు మాత్రం కనిపించవు. దాన్నే ‘వర్ణ అంధత్వం’ అంటారు. ఈ వర్ణ అంధత నం లేకపోయినా కొంతమంది రంగుల్ని సరిగా చెప్పలేరు. ఎరుపు, పచ్చ, నీలం… ఈ రంగులు కాకుండా కొత్త రంగు కనిపిస్తే కొన్నాళ్లు ఇంగ్లీష్ కలర్ అనేవాళ్లు. అంతేనా.. ఎవరికి తోచినట్లుగా వారు రంగులకు పేర్లు పెట్టి వాడేయడం కూడా వింటూనే ఉంటాం. సిమెంటురంగు, రాచిప్పరంగు, గచ్చకాయ రంగు, మజ్జిగ పులుసు రంగు, పప్పుగోంగూర రంగు, కాఫీ కలర్, వక్కరంగు.. ఇలా ఎన్నో. పప్పుగోంగూర రంగు అని అమ్మమ్మ అనేది. చిన్నప్పుడు అదేమిటో అనుకునేదాన్ని. ఆ తర్వాత తెలిసిది పసుపు, ముదురాకుపచ్చ కలగలిసిన రంగని. రంగు షేడ్‌లో తేడాలొచ్చినప్పుడు కరెక్టుగా అర్ధమవ్వాలంటే పోలిక చెప్పక తప్పదు మరి. వాస్తవానికి మనిషి కన్ను పది మిలియన్ రంగులను గుర్తించగలదట.
చిన్నపిల్లలకు బడిలో, బొమ్మలకు రంగులు వేయడం నేర్పుతారు. అందుకోసం రకరకాల కలరింగ్ బుక్స్ మార్కెట్లో దొరుకుతున్నాయి. క్రేయాన్, రంగు పెన్నిళ్లు, రంగుల స్కెచ్ పెన్నులు, వాటర్ కలర్స్, పోస్టర్ కలర్స్, ఆయిల్ కలర్స్, అక్రిలిక్ కలర్స్, పేస్టల్ కలర్స్.. ఇలా ఎన్నెన్నో సరంజామాలు పెయింటర్ల ప్రాణప్రద సంపదలు. అసలు పిల్లల ఆటవస్తువులు, చదువుకు సంబంధించిన వస్తువులు అన్నీ కూడా వారిని ఆకట్టుకునేటట్లుగా రంగులతో నిండి ఉంటాయి. పెన్సిళ్లే కాదు, రకరకాల రంగుల బొమ్మల్లో రబ్బర్లు, పుస్తకాల్లో రంగు బొమ్మలు, రంగుల బెలూన్లు, రంగుల బ్యాగ్‌లు, రంగుల టిఫిన్ బాక్స్‌లు.. ఫర్నిచర్ కూడా చిన్న క్లాసుల్లో ప్రత్యేకంగా రంగులతో ఉంటుంది. చాక్లెట్లు, జెమ్స్ కూడా రంగుల్లో ఉండి పిల్లా పెద్దల నోరూరిస్తుంటాయి. రంగులంటే అభిరుచి లేనివారెవరుంటారు?
ఏ రంగు కారు కొనాలి, ఏ రంగు ఫ్రిజ్ కొనాలి, ఏ రంగు ఫర్నిచర్ కొనాలి, ఇంటికి ఏ రంగులు వేయించాలి? ఏ రంగు చీర కొనాలి, ఏ రంగు చీర కట్టుకోవాలి, ఏ రంగు గాజులు వేసుకోవాలి, ఆఖరికి ఏ రంగు చెప్పులు ధరించాలి.. నిత్యం రంగుల గురించిన ఆలోచన ఉంటూనే ఉంటుంది. ఇవన్నీ అటుంచి జుట్టుకు రంగేసుకోవడం ఇటీవల కాలంలో అతి సాధారణమైపోయింది. హెయిర్ డైలు అనేక రకాలు. ఇందులో ఎక్కువశాతం నలుపు, కొద్దిశాతం మంది రెడ్డిష్ బ్రౌన్ వాడుతుంటారు. ఇవే కాకుండా నీలం, లేత గులాబి, లేత ఆకుపచ్చ.. ఇలా రకరకాల రంగులు పాశ్చాత్య దేశాలలో విరివిగా వాడుకలో ఉన్నాయి. మన దేశానికి త్వరలోనే ఆ ఫ్యాషన్ విచ్చేయవచ్చు.
రంగురంగుల గాజుల మోజులు సరేసరి. బంగారు గాజులున్నా, మరెన్నో రకాల గాజులున్నా రంగురంగుల మట్టిగాజులంటే మనసుపడే మగువలెందరో. గోళ్ల రంగులు మరో సౌందర్య కళ. ఎన్ని రకాల రంగులో. గతంలో కేవలం ఎరుపు, లేత గులాబి.. వంటి కొన్ని రంగులే ఎక్కువగా కనిపించేవి. ఇప్పుడు రకరకాల షేడ్లు. కొన్ని రంగుల్ని చూస్తుంటే గోళ్ల అందం పెంచేందుకో, తుంచేందుకో కూడా అర్థంకాదు. రంగుల్లో ఫుడ్ కలర్స్ వేరు. స్వీట్ల తయారీలో ఆకర్షణీయంగా ఉండేందుకు రంగులు వాడుతుంటారు. అలాగే ఐస్ క్రీములకు, కేక్‌లకు కూడా రంగులు వాడతారు. వీటినే ఫుడ్ కలర్స్ అంటారు.
రంగులతో కూడిన కళ రంగోలి. అందాల రంగోలి డిజైన్లు సృజనాత్మకత ఉట్టిపడుతూ, చూపుల్ని కట్టిపడేస్తాయి. రంగులకు సంబంధించి ఎన్నో సామెతలు, నానుడులు వింటుంటాం.
కాకి ముక్కుకు దొండపండు; ఎలుకతోకను తెచ్చి ఎంత ఉతికిన కాని నలుపు నలుపే కాని తెలుపు కాదు; తెల్లనివన్నీ పాలూ కాదు, నల్లని వన్నీ నీళ్లు కాదు; తొండ ముదిరితే ఊసరవెల్లి.. వంటివెన్నో. అదేకాదు, తెల్లముఖం వేశాడు, సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కాయి, కోపంతో కళ్లు ఎర్రబారాయి, ముఖంలో రంగులు మారాయి.. ఇలా ఆయా వ్యక్తుల్ని వర్ణించటమూ కద్దు. మనుషుల్లోనూ రంగులున్నాయి. నలుపు, తెలుపు చామనచాయ.. అయితే ఏకంగా నల్లజాతి, తెల్లజాతి అంటూ వివక్ష పెరగటం, విద్వేషాలు రగలటం ఎంతో ఘోరం, నేరం. మనుషుల్లో ఇన్నిరంగు లెందుకంటే సైన్స్ శాస్త్రీయ సమాధానాలిస్తుంది. అయితే ‘సప్తపది’ చిత్రంలో వేటూరిగారు ఈ విషయమై ఓ చక్కటి గీతం రాశారు.
గోవుల్లు తెల్లన.. గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన? … తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా ఎందుకుండవ్ కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా ఏమో.. అని.. చివరకు ఎందువలన అంటే అందువలన ఎందువలనా అంటే దైవ ఘటన’ అని ముగిస్తారు.
ఎస్.జానకి చిన్నపిల్లలా లేగొంతుకను పలికించటం ఈ పాటకు ప్రత్యేక అందాన్నిచ్చింది.
సృష్టిలో కొన్ని ప్రాణులకు ఆత్మ రక్షణ కోసం, మనుగడ కోసం పరిస్థితులను బట్టి రంగులు మార్చుకొనే సదుపాయం ఉంది. ఊసరవెల్లి కూడా అవసరార్ధమే చుట్టూ ఉన్న పరిసరాల రంగుల్లో కలిసేలా మిశ్రమరంగుల్లోకి మారుతుంది. అది వాటి జీవితావసరం. కానీ మనిషి స్వార్ధంతో, సమయానుకూలంగా రంగులు (వైఖరి) మార్చడం మంచిది కాదు. రంగుల విషయంలో నికార్సయిన రంగులు, వెలిసిపోయే రంగులు అని చెప్పుకుంటుంటాం. ‘నలుపు’ గ్యారంటీ రంగు అని జోక్ చేయడం కూడా తెలిసిందే. ‘మనిషి ఎప్పుడూ నికార్సయిన రంగులాగా వ్యక్తిత్వ ఔన్నత్యం కలిగి ఉండాలి’ అనుకుంటుంటే షెల్ సిల్వర్ స్క్రీన్ పొయమ్ ఒకటి గుర్తొచ్చింది.
‘మై స్కి న్ ఈజ్ కైండ్ ఆఫ్ సార్ట్ ఆఫ్ బ్రౌనిష్ పింకిష్ ఎల్లోయిష్ వైట్ మై ఐస్ ఆర్ గ్రేయిష్ బ్లూయిష్ గ్రీన్ బట్ ఐయామ్ టోల్డ్ దే లుక్ ఆరెంజ్ ఇన్ ది నైట్ మై హెయిర్ ఈజ్ రెడ్డిష్ బ్లాండిష్ బ్రౌన్ బట్ ఇటీజ్ సిల్వర్ వెన్ ఇటీజ్ వెట్ ఎండ్ ఆల్ ది కలర్స్ అయామ్ ఇన్ సైడ్ హావ్ నాట్ బీన్ ఇన్వెంటెడ్ యెట్’..
‘మ్యావ్’ అరుపు వినపడటంతో నా ‘కలరింగ్’ ఆగిపోయింది.. చీకట్లో తెల్లపిల్లి, ఎప్పుడు చీకటయిందో..
ఈ చీకటి ఎంత నలుపో అనుకుంటూ.. తడుముకుంటూ లైట్ స్విచ్ నొక్కాను. తెల్లని కాంతి ఇల్లంతా పరుచుకుని ‘ఇక లోనికి పదపద’ మంది.
జొన్నలగడ్డ శ్యామల సీనియర్ జర్నలిస్టు. ఉదయం దినపత్రికలో పని చేసేవారు. వార్త దినపత్రికలో ఆదివారం అనుబంధం ఇన్ఛార్జ్ గా పని చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్ట్. వృత్తి ధర్మంగా అసంఖ్యాకమైన కవర్ స్టోరీలు, ఫీచర్లు, పుస్తక సమీక్షలు రాసినవారు. శ్యామల 60కి పైగా కథలు రాశారు. ఆంధ్రప్రభ, యువ, ఉదయం, వార్త, ఇండియా టుడే లలో వీరి కథలు ప్రచురితమయ్యాయి. ముఖ్యంగా వీరి ‘పడక్కుర్చీ’ కథ అనేక ప్రశంసలు పొందింది. పలు హస్య కథలు కూడా రచించారు. కొన్ని కథలు ఇతర కథాసంపుటాలలో వచ్చాయి. భూమిక కథల పోటీలో ఒకసారి బహుమతి గెలుచుకున్నారు. పూతరేకులు, సాలోచనం, సాధన వంటి కాలమ్‌లు రాశారు.
Excellent narration by smt shyamala Garu J guru Prasad
Colours of life, is the wonderful theme that ms Syamla has chosen weave her theme for M S this time. World will be poorer without colours, humans may not find life interesting without colours. Sir CV Raman got Nobel prize for his studies on colours. Syamala garu has done well in. her write up
శ్యామల మేడం గారి రంగుల కథ బాగుంది. వులురు కొండ గురించి అరుదైన సమాచారం అందించినందుకు ధన్యవాదములు. 🌹
శ్యామలగారి ” వర్ణమోహనం ” బాగుంది. మనిషి జీవితమే రంగులమయం. ప్రతీ జీవికి ఈ రంగులతో ప్రత్యేక సంబంధం ఉంది. మనిషి రంగుల వర్ణాన్ని.బట్టి ఆనందాన్ని పొందడం గానీ, అందాలను అనుభవించడంగానీ జరుగుతుంటుది. శ్యామలగారు ప్రకృతికి అందాలను తెచ్చిపెట్టే ఆస్ట్రేలియా లో ఉండే ‘ ఉలురు ‘ పర్వతం గురించి తెలియ జెప్పటంలో ప్రత్యేకత ఉంది.ఆ పర్వత విశేషాలు తెలియని పాఠకులకు తెలియ. జెప్పటం జరిగినట్టయింది. ప్రతీ జీవి తన మేను ఛాయ ఏదో ఒక రంగును గానీ రంగులను గానీ కలిగి ఉంటుంది. ఆ రంగులే వాటికి అందాన్ని, చూసేవారికి ఆనందాన్ని కలుగజేస్తుంది. అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచమంతా రంగులమయమన్న నగ్న సత్యాన్ని శ్యామలగారు కళ్ళకు కట్టి నట్టు తెలియజెప్పారు. శ్యామలగారికి అభినందనలు. శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి.
శ్రీమతి శ్యామల గారి”వర్ణ మోహనం” శీర్షిక పాఠకులకు తెలియని చాలా విషయాలను తెలియజేసింది.ఏకంగా తొమ్మిది రంగులను మార్చే”వులురు”పర్వతం గొప్పతనాన్ని,ఎర్ర సముద్రం గురించిన వివరణను,న్యూటన్ 1606లోరూపొందించిన ఏడు రంగుల ప్రత్యేకతను ప్రస్ఫుటం చేసే వర్ణచక్రం గొప్పదనం,సీల్ సీలా సినిమాలో అమితాబ్ గానం చేసిన రంగుల పాట,హరివంశరాయ్ బచ్చన్ రాసిన షోలే పాట,పూల్ ఔర్ పతర్ సినిమాలో ఆశాభోంస్లే పాటకు కుక్క డాన్స్ చేయడం….shelsilver screenరాసిన కలర్స్ poemగురించిన వివరణలు….ఆమె విద్వత్తుకు,జ్ఞాపకశక్తికి నిదర్శనంగా నిలుస్తాయి.శ్రీమతి శ్యామల గారి ప్రతి శీర్షిక ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుంది. కళాభివందనములతో విడదల సాంబశివరావు.
Beautifully written by Syamala with lot of information!!! Syamala Devi Dasika
‘వర్ణమోహనం’… Title is very beautiful. ముందుగా ఇంత చక్కటి title పెట్టినందుకు రచయిత్రి గారికి అభినందనలు. మోహనరాగం వింటున్నపుడు ఎంత శ్రావ్వంగా వుంటుందో అంతే హాయిగా ఉంది ఆర్టికల్ చదివినంతసేపూ..ఉలురు పర్వతం గురించి ఎంతో విలువైన సమాచారాన్ని పాఠకులతో పంచుకుని అర్టికల్ కి రంగులద్దారు. ఒక్కోరంగూ ఒక్కోదానికి ప్రతీక అంటూ రంగులకే నిర్వచనాన్నిచ్చే ప్రయత్నం చేసిన రచయిత్రి శ్యామల గారు పాఠకులను నిజంగానే రంగులప్రపంచంలోకి తీసుకెళ్లారు. …సందర్భానుసారంగా పేర్కొన్న సినీగీతాలు ఆర్టికల్ కు అదనపు ఆకర్షణ. ఇంత చక్కటి colourful article ను అందించిన రచయిత్రి గారికి ప్రత్యేక అభినందనలు 💐💐💐
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™