మొన్నే అమెజాన్ ప్రైమ్‌లో ‘మర్డర్’ సినిమా చూడటం జరిగింది. ఇది మాములు రొటీన్ సినిమా అయితే కాదు. వైవిధ్యాన్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఇది ఖచ్చితంగా నచ్చుతుంది.
ఇది జానర్ ఏమిటి అంటే అందరూ అనుకుంటున్నట్టు ఇది క్రైం చిత్రం కానీ, ప్రతీకారత్మక హింసాత్మక చిత్రం కానీ కాదు. ఇది కరుణరసాత్మక చిత్రం. లోతైన ఆధ్యాత్మిక భావాల్ని రంగరించి ఆలోచింపజేసే చిత్రం. ప్రతీ టీనేజర్, ప్రతీ తల్లి తండ్రీ తప్పక చూడదగ్గ చిత్రం.
రాం గోపాల్ వర్మ నిర్మించి, దర్శకత్వ సహాకారం అందించిన ఈ చిత్రానికి దర్శకుడు రాం గోపాల్ వర్మ కాదు. ఈ చిత్ర దర్శకుడు ఆనంద్ చంద్ర అనే తెలుగు దర్శకుడు అట (నేనైతే ఇతని పేరు ఎప్పుడు వినలేదు), ఇతను దిశా ఎన్కౌంటర్ అనే సినిమా కూడా తీశాడట. అది ఇంకా విడుదల అయినట్టు లేదు. ఏది ఏమయినా ఈ ‘మర్డర్’తో ఇతను ఒక మంచి దర్శకుడు అన్నభరోసా కలిగించాడు. ఈ సినిమా నిర్మాతలుగా నట్టి కరుణ, క్రాంతి అని పేర్కొన్నారు. మరి రాంగోపాల్ వర్మ పాత్ర ఏమిటీ తెలియదు.
‘’నేను రాం గోపాల్ వర్మ సినిమాలు ఇష్టపడతాను’ అని చెప్పటానికి మనం జంకే విధంగా ఆయన తన సినిమాలు తీయటం మొదలెట్టినప్పటి నుంచి కొద్దిగా ఆయన సినిమాలు చూడటం తగ్గించాను.
అదీకాక ఎవరికి పడితే వారికి ఇంటర్వ్యూలు ఇవ్వటం, ఆయా ఇంటర్వ్యూలలో కూడా ఆయన తన చిత్తానికి తోచిన విధంగా మాట్లాడటం, చిరంజీవి, పవన్ కళ్యాణ్, వీహెచ్, గరికపాటి, చాగంటి వంటి ప్రముఖులపై అనావస్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వారితో కోరి వివాదాలు పెంచుకోవడం, రెచ్చగొచ్చేలా మాట్లాడటం, వెటకారంగా సమాధానాలు ఇవ్వటం ఇలాంటి వ్యవహార శైలి వల్ల క్రమంగా ఆర్జీవి అంటే ఒక విధమైన విముఖత పెంచుకున్నారు విజ్ఞులు అందరూ.
‘నేను నాకోసం సినిమాలు తీసుకుంటున్నాను, నా సినిమాలు మిమ్మల్నిఎవడు చూడమన్నాడు?’ అన్న విధంగా మాట్లాడటం, అసభ్యతతో కూడిన మాటలు పబ్లిక్‌గా టీవీ షోలలో మాట్లాడటం, వివాహ వ్యవస్థని కించపరిచేలాగా మాట్లాడటం, ఎందరో నమ్మి ఆచరిస్తున్న పద్దతులను నిర్హేతుకంగా విమర్శించటం ఆయన ప్రవృత్తిగా మారింది ఇటీవల.
ఇటీవల ఆయన వద్ద కథలు అయిపోయాయో ఏమో, సమాజంలో జరుగుతున్న సంచలనాత్మక సంఘటనలు ఆధారంగా సినిమాలు తీయటం ఆయన పనిగా పెట్టుకున్నాడు.
ముంబాయి బాంబు పేలుళ్ళు, రాయలసీమ ముఠా కక్షలు, బెజవాడ అల్లర్లు, లక్ష్మీ పార్వతీ ఎన్టీఆర్‌ల వివాహానంతర పరిణామాలు, చందనం దుంగల స్మగ్లర్ వీరప్పన్ కాల్చివేత, పవన్ కళ్యాణ్ రాజకీయరంగ ప్రవేశం, కరోనా భయం ఇలా యథార్థ సంఘటనల ఆధారంగా సినిమాలు అన్న పేరిట సినిమాలు తీయటం ఆయన పాటిస్తున్న లేటెస్ట్ ట్రెండ్.
ఈ తరహా సినిమాలు ఎలా ఉంటున్నాయి అన్నది అటుంచితే, ఆయన ‘ఆ సినిమా తీస్తాను’ అని ప్రకటించిన నాటి నుండి, ఆయా సంఘటనలతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉన్న వ్యక్తులు ఆయా సినిమాల్లో ఏముందో కూడా తెలియని పరిస్థితిలో, తమను గూర్చి ఆర్జీవి విమర్శిస్తూ తీస్తున్నాడో, సమర్థిస్తూ తీస్తున్నాడో తెలియక ఎందుకైనా మంచిది అని ప్రెస్ కాన్పరెన్సులు పెట్టి ఆర్జీవిని తూర్పారపడుతూ, అమ్మనా బూతులు తిడుతూ ప్రజలకు విపరీతమైన వినోదాన్నీ, ఆర్జీవికి, దరిమిలా ఆ చిత్రానికి విపరీతమైన ప్రచారం ఉచితంగా కల్పించిపెడుతున్నారు.
ఆయన మా ఊరికి వస్తే ప్రాణాలతో తిరిగి వెళ్ళడని, మక్కెలిరగగొడతామని ఇలా వివిధ రకాలుగా తమ ఆందోళనని ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తూ వస్తుంటారు. ఇవన్నీ ఒకెత్తు అయితే ఆర్జీవి మీద లెక్కకు మిక్కిలిగా కోర్టులలో కేసులు పెట్టడం ఇలా రకరకాలుగు ఉచిత ప్రచారాన్ని తమకు తెలియకుండానే రాం గోపాల్ వర్మకి చేసి పెడుతున్నారు ఆయా సంఘటనలతో ముడిపడి ఉన్న వ్యక్తులు.
అయితే ఏ మాటకా మాటే చెప్పుకోవాలి, ఇటీవల ఇలా నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఆయన తీసిన కిల్లింగ్ వీరప్పన్, 26/11, లక్ష్మీస్ ఎన్టీఆర్ తదితర సినిమాలు అన్నీ కూడా ఒక రకంగా బాగున్నాయి అని చెప్పవచ్చు. ఈ సినిమాలలో ముఖ్యంగా ఆయన పాఠిస్తున్న నియమం ఏమిటి అంటే చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా ఆకర్షణియంగా చెపుతున్నాడు.
అంటే కిల్లింగ్ వీరప్పన్‌లో ఆయన వీరప్పన్ మంచివాడా చెడ్డవాడా అన్న చర్చకి దిగలేదు. ఆ పాత్రని సమర్థించనూ లేదు, విమర్శించనూ లేదు. ఆయన గతాన్ని తవ్వి తీయలేదు. కేవలం వీరప్పన్ని అంతమొందించటం అన్న ప్రక్రియలో ఇమిడి ఉన్న థ్రిల్ ఆయన్ని ఆకట్టుకుంది. అన్ని ఏండ్లుగా పోలీసుల కళ్ళుకప్పి తిరుగుతున్న వీరప్పన్ని తెలివిగా/లేదా మోసంతో ఎలా మట్టుపెట్టారు అన్న అంశాన్ని ఒక్కటే చెప్పదలచుకున్నాడు. అదే చూపాడు. చూపదలచుకున్న విషయాన్ని ఎక్కడా బిగి సడలకుండా చూపాడు.
అదే విధంగా లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో లక్ష్మీ పార్వతితో ఎన్టీఆర్ గారి వివాహం, తదనంతర పరిణామాలు చూపదలచుకున్నాడు చూపాడు. అంతే. ఎక్కడా బోర్ కొట్టకుండా, హృదయాల్ని కదిలిస్తూ, కొండొకచో మనతో కన్నీరు పెట్టిస్తూ, మనల్ని ఆసాంతం కట్టిపడేసేలా తీశాడు. అది ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ఎవరికైనా అనిపిస్తే అది వారి ఖర్మ అన్న ధోరణిలో తనదైన బాణిలో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఆ సినిమా విడుదల తేది ప్రకటించింది లగాయతు ఒక మాజీ ముఖ్యమంత్రిగారు విపరీతంగా కంగారు పడటం, ఆ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో విడుదల కాకుండా స్టే తెచ్చుకోవడం ఇవన్నీ మనం ముందే చెప్పుకున్నట్టు, వర్మ చిత్రం ప్రచారానికి పనికి వచ్చిన అంశాలు.
అదే విధంగా 26/11 సినిమాలో కూడా ఇలాగే తను చెప్పదలచుకున్నది సూటిగా ఆకట్టుకునేలాగా చెప్పాడు. అంతే.
ఇవన్నీ ఒక ఎత్తైతే ఆయా పాత్రలకు ఎన్నుకునే నటీనటులు “వీళ్ళు నీకెక్కడ దొరుకుతారు ఆర్జీవి, వీరు అచ్చు నిజ జీవితంలోని మనుషుల పోలికలతో అచ్చు అలాగే ఉంటున్నారు, వారి హావభావాలు, మాట తీరు అన్నీ ముమ్మూర్తులా వారిని పోలి ఉంటున్నాయి” అని విమర్శకులు శైతం ఆయన్ని మెచ్చుకునేలా ఆయన తీయగలుగుతున్నారు అంటే ఆయన ఎంత అంకిత భావంతో హోం వర్క్ చేసుకుంటున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు.
అదే పరంపరలో ఇప్పుడు లేటెస్టుగా మర్డర్ సినిమా.
ఇటీవల కాలంలో హైదరాబాద్‌కి దగ్గర ఉన్న మిర్యాలగుడాలో పెను సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్యోదంతంలో కూడా మన రాంగోపాల్ వర్మ కి సినిమాకి పనికి వచ్చే కథాంశం కనిపించింది.
నిజజీవిత మనుషులు మారుతి రావు, అమృత, ప్రణయ్ తదితరులు ఆయనకు పాత్రలుగా తోచారు. ఒక మంచి సెంటిమెంట్ తో సెన్సేషనల్ సినిమాగా తీయవచ్చని ఆయనకి అనిపించింది.
యథా ప్రకారం ఆయన ఈ సినిమా విషయం ప్రకటించగానే తీవ్రమైన వివాదాల్ని ఎదుర్కొన్నారు.
ఇక సినిమా విషయానికి వస్తే,
మాధవరావు (శ్రీకాంత్ అయ్యంగార్) ఒక చిన్న ఊర్లో వ్యాపారవేత్త. కష్టపడి పైకొచ్చి సమాజంలో మంచిపేరు ప్రఖ్యాతులతో కులాసాగా జీవిస్తూ ఉంటాడు. ఆయనకు అనుకూలవతి అయిన భార్య వనజ (బాపు మనవరాలు గాయత్రి భార్గవి) ఒకే ఒక బిడ్డ నమ్రత (సాహితి ఆవంచ). ఆయనకు ఆ బిడ్డ అంటే పంచప్రాణాలు. అప్పుడప్పుడు కనిపించే ఇతర పాత్రలు – ప్రవీణ్- అల్లుడు (గణేష్ నాయుడు), మాధవరావు గారి తమ్ముడు, మాధవరావు గారి స్నేహితుడు (కేశవ్ దీపక్), వాళ్ళింట్లో వంట మనిషి, కాస్తా అనుమానం కలిగేలా కనిపించే సెక్యూరిటీ గార్డు.
ఆ బిడ్డకు చిన్నప్పటి నుంచీ కోరినవెల్లా కోరింది తడవుగా అందివ్వటం ఆయన చేసిన పొరపాటు అని వాయిస్ ఓవర్లో మాధవరావు పాత్రే చెపుతుంది. ఆ విధంగా ఆ అమ్మాయికి తను ఏది కోరినా తండ్రి కాదనడు అన్న ఒక గుడ్డి నమ్మకాన్ని ఆయన కల్పించాడు. అప్పుడప్పుడూ తల్లి పాత్ర ఆ పిల్లకి మంచి చెడులు చెప్పబోయినా తండ్రి వారించి ఆ పిల్లకి మద్దతు పలుకుతూ వెళతాడు. ఒక్కోసారి తల్లి పాత్రని చారులో కరివేపాకులా తీసేస్తూ కూతురిని నెత్తిన పెట్టుకుని చూసుకుంటూ ఉంటాడు. కాలేజిలో ఒక మగ స్నేహితుడు ప్రవీణ్ నమ్రతకి వల వేసి అమాయకురాలైన ఆ అమ్మాయిని వలలో వేసుకుని పెళ్ళికి తొందర పెడుతుంటాడు. ఇక ఆ పిల్ల అతన్ని పెళ్ళి చేసుకోవడం, మాధవరావు ఆ కుర్రాణ్ణి కిరాయి హంతకుడితో నరికి చంపించడం, ఆ మానసిక వత్తిడికారణంగా చివరికి ఆయనే ఆత్మహత్య చేసుకుని చనిపోవడం ఇది స్థూలంగా కథ.
ఇది మాధవరావు కోణంలో తీసిన కథ. అతను ఎందుకు అంతటి తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు అన్న అంశాన్ని దర్శకుడు చాలా బలంగా కన్విన్సింగ్‌గా తీశాడు.
ప్రియుడి వత్తిడికి తలవగ్గి తన తండ్రిముందు పెళ్ళి ప్రస్తావన తెస్తుంది నమ్రత. అయితే ఆ పిల్ల ఊహించని విధంగా ఆయన ఆ ప్రస్తావనకి ఒప్పుకోడు. ఆ పిల్ల క్షణాల్లో తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది. ‘ఈ ఇంటికి వస్తే అతనే అల్లుడుగా వస్తాడు, లేదా నేను అతను ఇద్దరం చచ్చి పోతాము’ అని ప్రకటిస్తుంది. అప్పటిదాకా అల్లారుముద్దుగా చూసుకున్న తండ్రిని పరమశత్రువుగా భావిస్తుంది. ఆ పిల్ల బాడీ లాంగ్వేజి, వాడే భాష, మాట తీరు, తలితండ్రులను ఎదిరించే తీరు ఇవన్నీ మనల్నే కాక తల్లి తండ్రులని కూడా ఆశ్చర్యపరుస్తాయి.
ఆ పిల్లని బంధించి పెట్టినా కూడా వారి కళ్ళు కప్పి వెళ్ళి కోరిన కుర్రాడ్ని రిజిస్టర్ మేరేజి చేసుకుంటుంది.
ఈ సినిమా యావత్తు తండ్రి కోణంలో తీయటం జరిగింది.
ఈ పిల్ల ప్రేమించిన కుర్రాడు పూర్తి నాటు. అతని స్నేహితులు మోటార్ సైకిళ్ళ మీద వచ్చి మామగారింటి ఎదురుగా వాళ్ళ నిశ్చితార్థం ఫ్లెక్సీ ఏర్పాటు చేయటం, ఆ కుర్రాడు నమ్రతని ఎక్కించుకుని మోటార్ సైకిల్‌పై వచ్చి ‘ఒరేయ్ మాధవరావ్! నేనే నీ అల్లుడిని’ అని గట్టిగా అరిచి రెచ్చగొట్టటం, తాను నమ్రత ముద్దు పెట్టుకునే దృశ్యాలు, ఇతర శృంగార దృశ్యాలు మామగారికి వాట్సప్ లో వీడియోలో పంపటం ఇవన్నీ ఆ కుర్రాడు చేసే రెచ్చగొట్టే చర్యలు.
ఈ విధంగా ఏ రకంగా చూసినా ఆ కుర్రాడిది పూర్తిగా తప్పు. మిర్యాలగుడాలో నిజజీవితంలో ఈ సంఘటన జరిగినప్పుడు ఆ కుర్రాడి ప్రవర్తన గూర్చి ఈ వివరాలు మీడియాలో వచ్చాయి.
దీన్ని పరువు హత్య అన్న కోణంలో కాక ఒక తండ్రి మనోవేదన అన్న కోణంలో చాలా చక్కగా చెప్పాడు దర్శకుడు.
‘నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నేను నిర్మించానమ్మా అందుకే నీకు అందంగా కనిపిస్తోంది. నీవు నిజజీవితంలోని కష్టాలని చూడలేదు’ అన్న మాధవరావు మాటలు కన్నీళ్ళు పెట్టిస్తాయి.
‘వాడిది నిజమైన ప్రేమ కాదమ్మా, నిన్ను వలవేసి పట్టారు. నీ వెనుక ఉన్న ఆస్తిపై వాళ్ళు కన్ను వేశారు’
‘వాణ్ణి వదిలి వచ్చేయి తల్లీ. నా మాట విను’
ఇలా శ్రీకాంత్ అయ్యంగారు తన నటనతో మనల్ని మంత్ర ముగ్ధులను చేస్తాడు. నమ్రత పాత్రలో సాహితీ కూడా చాలా బాగా నటించింది. మొదట్లో గోముగా తండ్రి భుజం చుట్టూ చేతులు వేసి గారాలు పోయిన నమ్రతేనా ఈ పిల్ల అన్న స్థాయిలో తల్లి తండ్రులపట్ల ఏహ్యతని ప్రదర్శించటంలో ఆ అమ్మాయి నటన చాలా బాగుంది.
ఆనంద్ చంద్ర చాలా అనుభవఙ్జుడైన దర్శకుడిలా తీశాడు. రాం గోపాల్ వర్మ ఆధ్వర్యంలో తీసినట్టు తెలుస్తూనే ఉంది.
ఎక్కడా కూడా అనవసరమైన కథనాలు, అనవసరమైన సన్నివేశాలు లేవు. నమ్రత, ప్రవీణ్‌ల మధ్య ప్రణయంని ఒకటి రెండు సార్లు ఫోన్లలో మాట్లాడుకుంటున్నటు చూపడంతో మనకు ఎస్టాబ్లిష్ చేస్తాడు. అంతే. అనవసరంగా కాలేజీ దృశ్యాలు, కాంటిన్ దృశ్యాలు, డ్యూయేట్లు ఇలా ఏమి తలనొప్పి పెట్టలేదు ప్రేక్షకులకు. చాలా సున్నితంగా అసలు కథలోకి వచ్చేస్తాడు డైరెక్టర్. ఈ విధమైన నరేషన్ వల్ల కొందరికి ఇది డాక్యుమెంటరీ లాగా కూడా తోచింది.
ఈ సినిమా యావత్తు ఒక విషాద మూడ్‌ని సృష్టించడంలో దర్శకుడు కృతకృత్యుడు అయ్యాడు.
ఈ సినిమాని చూసి తల్లి తండ్రులు, పిల్లలూ ఎన్నో సత్యాలు నేర్చుకోవచ్చు.
ఎంతో ఆధ్యాత్మికత దాగి ఉంది రాములో అనిపించింది ఈ సినిమా చూశాక. అమితంగా దేనిని ఇష్టపడినా భంగపాటు తప్పదు. అవధికి మించి దేనిపైనా వ్యామోహం పెట్టుకోరాదు అనిపించింది.
జీవితాన్ని డిటాచ్మెంట్తో జీవించకపోతే ఇలాంటి పెను ప్రమాదాలు తప్పవు. నేను, నాది, నా పిల్లలు, నా భార్య, నా పేరు, నా ప్రతిష్ఠ అని అనవసరమైన మాయలో పడితే ఈ సినిమాలో మాధవరావు లాగా పిచ్చివాడయి పోయేది ఖాయం. అతను క్రమంగా దిగజారిన వైనాన్ని బాగా చూపించారు దర్శకుడు.
వ్యాపార పనులు మానేస్తాడు, స్నేహితులతో కలవడం మానేస్తాడు. త్రాగుడుకి విపరీతంగా బానిస అవుతాడు. భార్యని పట్టించుకోడు, తన ఆరోగ్యాన్ని పట్టించుకోడు.
ఎంత సేపున్నా నమ్రతా నమ్రతా అని కలవరిస్తూ వీధి గుమ్మం వైపు చూస్తూ ఆ పిల్ల వచ్చేసినట్టు కలలు కంటూ ఉంటాడు.
ఆశ, మోహం, మితిమీరిన ప్రేమ వల్ల దుఃఖమే తప్ప అతను బావుకునింది ఏమీ లేదు.
స్వామీ వివేకానంద చెప్పిన ‘నీవు ప్రేమించడం వల్ల నీకు దుఃఖం కలుగదు, ప్రేమకి ప్రతిగా ప్రేమనే వాంఛించడం వల్ల నీకు దుఃఖం కలుగుతుంది’ అన్న మాటలు నిజమే కదా అనిపిస్తాయి.
గీతకారుడు చెప్పినట్టు కర్మ చేయటం వరకే నీ వంతు, ఆ పై నీకు ప్రతిఫలం మీద ఏ అధికారం లేదు అన్న భావనని అతను వంట బట్టించుకుని ఉంటే ఇందరి జీవితాలు నాశనం అయ్యేవి కావు.
ఒక విధమైన వైరాగ్యభావన అందరికీ అన్ని వేళలా జీవితంలో అవసరమే అని ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. అతని విపరీతమైన ప్రేమ వల్ల కూతురుకి లాభం కలుగలేదు, అల్లుడుకి లాభం కలుగలేదు, చివర్లో తానే ఆత్మహత్య చేసుకుని చనిపోవటం వల్ల కట్టుకున్న భార్యకి సైతం తీరని దుఃఖాన్ని మిగిల్చిపోయాడు. ఒక వ్యాపారవేత్తగా ఉండటం వల్ల అతని నిర్ణయం వల్ల భాగస్వాములు, ఉద్యోగులు, వినియోగదారులు అందరూ ఖచ్చితంగా ఇబ్బంది పడే ఉంటారు. అతను ఎవర్ని సుఖపెట్టినట్టు?
తను ఆత్మహత్య చేసుకోబోయే ముందు ఒకప్పుడు కూతురు ఉండిపోయిన ఖాళీ గదిలో అతను ఆ పిల్ల తాలూకూ ఒక్కొక్క వస్తువు తడుముతూ అనుభవించిన వేదన మనసున్న ఎవరికైనా కంట తడిపెట్టిస్తుంది.
దర్శకుడికి నూటికి నూరు మార్కులు. ఫోటోగ్రఫీ, సంగీతం కూడా ఈ సినిమాకు సంబంధించి మూడ్‌ని చక్కగా క్రియేట్ చేశాయి.
నిజజీవితంలో ప్రణయ్ కులం, మతం కూడా మీడియాలో చెప్పుకున్నారు. ఎందుకైనా మంచిదని మన రాము ఆ అంశాల జోలికి పోలేదు. చక్కగా హీరో హీరోయిన్ దుర్గ గుడికి వెళ్ళినట్టు చూపాడు. అంటే రాము కూడా డబల్ స్టాండర్డ్స్ ఉన్న వ్యక్తి అనే చెప్పుకోవాలి. అతను చూపే ధైర్యం అంతా మేకపోతు గాంభీర్యం అన్న మాట.
అల్లుడ్ని కిరాయి హంతకుడు నరికేసే దృశ్యం అప్పుడు ఒక సైకిక్ లాగా మాధవరావు పాత్ర నవ్వుతూ ఇంకా వేయ్ ఇంకో వేటు వేయ్ అన్న దగ్గర కాస్తా అతి అనిపించింది.
ముఖ్యంగా చెప్పుకోవాల్సింది క్లైమాక్స్. తన ప్రతి సినిమాలో ఏదో చాలా తెలివిగా తీస్తున్నాను అనుకుని క్లైమాక్స్‌ని చండాలంగా తీస్తాడు రాం గోపాల్ వర్మ. శివ ఆ రోజుల్లో ఎందుకు హిట్ అయిందో దేవుడికే తెలియాలి, కాని శివ కన్న క్షణక్షణం కోటి రెట్లు బాగుంది అయినా ఫ్లాప్ అయింది. శివలో సైతం క్లైమాక్స్ చెత్తగ తీసి పువ్వు పుట్టగానే పరిమళించును అని నిరూపించుకున్నాడు రాము.
పొయెటిక్ జస్టిస్ సామాన్య ప్రేక్షకుడికి తృప్తిని ఇస్తుంది. లేదా బాలచందర్‌లా పని కట్టుకుని విషాదాంతం చేయటం ఇంకో పద్దతి.
వీటన్నిటికి భిన్నంగా రాంగోపాల్ వర్మ సినిమాల క్లైమాక్స్‌లు ప్రత్యేకం. టీవీలో ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు కథ ఆసక్తిగొలుపుతూ నడుస్తు నడుస్తూ ఉండగా హటాత్తుగా కరెంట్ పోయి టీవీ చూడ్డం మానేయ్యాల్సి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయి రాంగోపాల్ వర్మ సినిమాల క్లైమాక్స్‌లు చాలా మట్టుకు.
కానీ ఈ సినిమాలో ముగింపు అర్థవంతంగా ఉంది. నిజ జీవితంలో అలా జరగలేదు కాకపోతే. రాంగోపాల్ వర్మ మార్క్ లేకుండా ఒక అర్థవంతమైన ముగింపుని చూసి ఒక మంచి సినిమా చూసిన తృప్తితో లేస్తాము.
ఏది ఏమయినప్పటికీ ఈ సినిమా కలిగించిన అనుభూతి నుంచి అంత సాధారణంగా బయటపడటం కష్టం. తక్కువ బడ్జెట్‌తో, చాలా లోతైన ఆలోచన, ఆవేదన కలిగించేలా తీసిన ఒక అర్థవంతమైన ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక చిత్రం.
డాక్టర్. రాయపెద్ది వివేకానంద్ గారి స్వంత ఊరు కడప. ప్రస్తుత నివాసం హైదరాబాద్. వృత్తి: వ్యక్తిత్వ వికాస శిక్షణ. ప్రవృత్తి: రచనలు చేయటం, మైకందుకుని తోచిన నాలుగు మంచి మాటలు చెప్పటం. టీవీలో, రేడియోల్లో నాలుగు మంచి మాటలు చెప్పటం. మెడికల్ రెప్‌గా వృత్తి జీవితాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి అదే రంగంలో హెచ్.ఆర్ మరియు ట్రెయినింగ్ మేనేజర్ అయ్యారు. 2004లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని స్వంతంగా రాయల్ సాఫ్ట్‌స్కిల్స్ కాంపస్ అనే ట్రెయినింగ్ కంపెనీని ప్రారంభించారు. వీరి కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. కథానికలు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. ఏమి వ్రాసామన్నది ఎంత ముఖ్యమో, ఎలా వ్రాసామన్నది అంతే ముఖ్యం అన్నది విశ్వసిస్తారు. ఏది వ్రాసినా సమాజానికి తన అక్షరాల వల్ల మేలు జరగాలని ఆశిస్తారు.
ఒక్క మాటలో చెప్పాలంటే చాలా చక్కగా ఉంది రివ్యూ. ప్రొఫెషనల్ సినీ క్రిటిక్స్ రాసే వాటికంటే కూడా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉన్నది. బుద్ధి, మరియూ హృదయం రెండూ ఉపయోగించాడు విమర్శకుడు తమ సమీక్షలో. హాట్స్ ఆఫ్
I like some of Varma’s great movies.
I will watch this MURDER movie deffenetly.
ఆకర్షణ కావచ్చు, మరేదైనా కావచ్చు, ప్రేమే లోకం అంటూ పెళ్లి చేసుకుంటున్న వారిని సమర్ధించమే “అభ్యుదయం” అనుకుంటున్నారు కొందరు అభ్యుదయవాదులు. అన్నేళ్ళు ప్రేమగా ప్రాణంలా పెంచిన తల్లిదండ్రులను ఒక్క క్షణం లో విదిలించుకొని, వదిలించుకొని “ప్రేమ” అనుకొని వెళ్ళిపోయే అమ్మాయిలకు చెంప పెట్టు లాంటి కఠినసత్యం ఈ రివ్యూ. “తండ్రి మనసు’ను ఆవిష్కరించిన రివ్యూ అద్భుతంగా ఉంది. ఆర్ద్రంగా ఉంది. నిష్పక్షపాతంగా నిర్మొహమాటంగా ఉంది. అభినందనలు.
Hats off for such an excellent and critical review. Very nicely articulated thoughts
Nice revert…. Dr Vivekananda is a multi talented person. He is a great person with high values….. But very humble…..
Very well analysed and effectively briefed the essence. Every parent and teenager should get this message🙏
Well integrated thoughts. Well done !!!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™