కశ్యపుడి పైనున్న అభిమానంతో గంగానది వితస్తను తనలో కలిపి వేసుకుంది. అందుకే సింధునదిని గంగానదిలా భావించవచ్చు. వితస్త నదిని యమునలా భావించవచ్చు. ఈ రెండు నదులు కలిసే స్థలాన్ని ప్రయాగతో సమంగా భావించాలి. గంగానదితో సంగమం అయ్యే స్థలంలో యమునా నది గంగతో అంది:
“ప్రయాగలో మనం సంగమించే స్థలంలో నా పేరు నీ పేరులో కలిసిపోయింది. కశ్మీరంలో నీ నామం నాదయింది”.
అప్పుడు గంగానది అంది: “నీతో కలిసినప్పుడు నన్ను సింధునది అంటారు” అని.
అది విన్న సతి, సింధునదితో కలిసి పోతున్నదల్లా హిమాలయాలు దాటిపోవటానికి నిరాకరించింది, అదృశ్యమయింది.
ఈ విషయం తెలుసుకున్న కశ్యపుడు సతీదేవిని ప్రార్థించాడు.
“ఓ సుందరమైన నదీమాతా, నీ కోసం ఏర్పరిచిన దారిలోకి ప్రయాణించాల్సి ఉంటుంది. లేకపోతే కశ్మీరమంతా సరస్సుగా మారిపోతుంది!”
కశ్యపుడి ప్రార్థనను మన్నించి అతడు ఏర్పాటు చేసిన దారిలో ప్రవహించడం ప్రారంభించినా సతీదేవి కోపం తగ్గలేదు. అందుకని మిగతా దారి అంతా అతి పవిత్రంగా భావించినా ఇక్కడ మాత్రం మురికిగా, అపవిత్రంగా భావిస్తారు. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అంశం.
ఋషులు ప్రతిదాన్నీ జీవం ఉన్నదానిలా భావించారు. వాటికి మానవత్వం ఆపాదించారు. వాటి ద్వారా నిగూఢంగా అనేక సత్యాలను మానవాళికి, భావి తరాలకు అందజేశారు.
అర్థం చేసుకున్న వారికి అద్భుతమైన సత్యాలు దొరుకుతాయి. లేనివారికి అందమైన ఆసక్తికరమైన కథ మిగులుతుంది.
సతీదేవి నది రూపం దాల్చింది. లక్ష్మీదేవి కూడా నదీరూపం ధరించింది. కానీ సతీదేవి తనపై ఆధిపత్యం చలాయిస్తుందని భయపడింది. నిజానికి అలాగే జరిగేసరికి కశ్మీరు ప్రాంతానికి శాపం పెట్టింది.
తరువాత కోపం తెచ్చుకోవటం ‘సతి’ వంతయింది.
సింధునది, గంగా నది మాట్లాడుకుంటున్నాయి.
అవి పెద్ద నదులు.
వాటితో కలిసే ఏ నది అయినా ప్రధాన నది స్థాయిని కోల్పోయి ఉపనది అయిపోతుంది. సతికి ఇది తెలుసు.
కాని వారిద్దరూ మాట్లాదుకోవటం విన్నది. గంగలో కలిస్తే తన అస్తిత్వం కోల్పోవలసి వస్తుందని భయపడింది. హిమాలయాలు వదిలి రాలేదు. గమనిస్తే, హిమాలయాలలో జనించిన అనేక నదులు పర్వతం వదిలి మైదాన ప్రాంతాలలోకి రాగానే ఇతర నదులతో కలుస్తాయి. అలా కలసి తమ అస్తిత్వం కోల్పోతాయి కొన్ని నదులు. కొన్ని నదులు మాత్రం తమ అస్తిత్వాన్ని నిలుపుకుంటాయి. నిజానికి మనం నదిని ఒక పేరుతో పిలుస్తాం కానీ ఆ ఒక పేరుతో పిలిచే నదిలో అనేక ఉపనదుల నీరు ఉంటుంది. కానీ ఆ నదులు ఈ పెద్ద నదిలో కలవటంతో తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. ఇలా ప్రవహించే నది, అనేక ఉపనదుల నీటిని తనలో కలుపుకుంటూ పోయి సముద్రంలో కలిసి తన అస్తిత్వాన్ని కోల్పోతుంది. ఇది జగతి రీతి.
ఈ జగతి రీతిని ఆధారం చేసుకుని అందమైన కథలు, కవితలు సృజించారు. విశ్వనాథ వారి కిన్నెరసాని ఇలాంటి కవిత.
కిన్నెరసానిని సముద్రడు మోహిస్తాడు. సముద్రుడి నుంచి రక్షించేందుకు గోదావరి కిన్నెరసానిని తనలో కలిపేసుకుంటుంది. కిన్నెరసాని అస్తిత్వం కోల్పోతుంది. ఆ తరువత గోదావరి సముద్ర సంగమం జరిగినా అది గోదావరితో తప్ప అక్కడ కిన్నెరసాని ప్రసక్తి లేదు!
అత్యంత సుందరమూ, అద్భుతమూ అయిన గాథ!
ఈ కథ ద్వారా కవి మానవ సంబంధాలు, మానవ మనస్తత్వాలు, జగతి రీతి వంటి అనేక అంశాలను కవితలో పొందుపరుస్తాడు.
ఇక్కడ ‘నీలమత పురాణం’ లోనూ సతి వితస్తలా మారి సింధునదితో కలసి ప్రవహించి గంగా నదిలో తన అస్తిత్వాన్ని కోల్పోయే కథ ద్వారా ఒక వైపు భౌగోళిక పరిస్థితులు, నదీ ప్రవాహాన్ని వర్ణిస్తు, మరో వైపు మానవ మనస్తత్వాన్ని, సామాజిక పరిధిలో అహాన్ని అణచివేసుకోవాల్సిన ఆవశ్యకతను అతి సున్నితంగా ప్రదర్శించారు.
తన అస్తిత్వాన్ని కోల్పోవటం ఎవ్వరికీ ఇష్టం ఉండదు. కానీ సామాజిక సంక్షేమం కోసం, ప్రకృతి నియమ పాలన కోసం తప్పనిసరిగా అస్తిత్వాన్ని కోల్పోవలసి వస్తుంది. అహాన్ని అణుచుకోలేని వారి ఈ నిజాన్ని గ్రహించరు, ప్రతిఘటిస్తారు.
సతీదేవి అదే చేసింది.
కానీ ప్రకృతి నియమం ఎప్పుడూ ఒప్పుకోక తప్పదు. అక్కడే ఆగిపోతే ఆ నది నీరు కశ్మీరాన్ని సరస్సుగా మారుస్తుంది. కాబట్టి ముందుకు పోకతప్పదు. ముందుకు కదిలింది. కానీ అక్కడ, ఎక్కడయితే ముందుకు పోనని సతీదేవి మొరాయించిందే, అక్కడ నీరు బురదమయం అయింది. ఆ ప్రాంతంలో నదిని అపవిత్రంగా భావిస్తారు. అహం ఎంతటి పవిత్రుడనయినా అపవిత్రం చేస్తుంది.
నైసర్గిన పరిస్థితులను అనుసరించి, వితస్త నది ప్రవాహాన్ని గమనిస్తే నది అయిష్టంగా హిమాలయాలను దిగి సమతల ప్రదేశాలకి వస్తున్నట్టు తోస్తుంది. ప్రవాహవేగం మంద్రం అవుతుంది. నీరు తనలో తాను సుళ్ళు తిరుగుతుంది. బురదమయం అవుతుంది. ఇతర ప్రాంతాలలో స్వచ్ఛంగా ఉండే నీరు అక్కడ మాత్రం మురికి నీరు అవుతుంది. ఆపై మళ్ళీ స్వచ్ఛ ప్రవాహం అవుతుంది.
అంటే పురాణాలలోని కథలు పైకి కట్టుకథలా తోచినా, అవి పుట్టు కథలు. అవి నిజాన్ని ప్రదర్శిస్తాయి.
అయితే మనకు అలవాటయిన నిజం వేరు. అవి నిజాన్ని ప్రదర్శించే విధానం వేరు. మరో వైపు నుంచి చూస్తే ఎంత లోతుగా ప్రకృతిని, నదీ ప్రవాహాన్ని, నదుల గతులను, మానవ మనస్తత్వాన్ని, సామాజిక మనస్తత్వాన్ని గమనించారో పూర్వీకులు అని ఆశ్చర్యం కలుగుతుంది.
ప్రవహించడం ప్రారంభించిన వితస్తని ఉద్దేశించి కశ్యపుడన్నాడు:
“వితస్త నది రూపం ధరించిన దైవామా, పర్వతపుత్రి… నీవు నదివి కావు, పుణ్యవతివి. శివుడి సగభాగానివి. ఈ నదిలో స్నానమాడినవారు తమను నీ తరంగాలు స్వర్గానికి కొనిపోవటం చూసి తరిస్తారు. నదిలో స్నానమాడుతూ వారు నీటిలో ఉన్నామా, స్వర్గంలో ఉన్నామా అని భ్రమ పడతారు. నరకాగ్నినీ నీ చల్లటి నీటి తరగలు నశింపజేస్తాయి. అతి భయంకరమైన పాపాలు చేసినవారు కూడా ఈ నీటిలో స్నానమాడి బ్రహ్మలోకాలకు చేరుకొని తరిస్తారు. ఈ నీటిలో స్నానం చేసినవారు కలలో కూడా యమలోకపు బాధలను అనుభవించరు. తమ విధ్యుక్త ధర్మాలు చిత్తశుద్ధితో నిర్వహించేవారు వితస్తలో స్నానమాడటంతో ముక్తిని పొందుతారు. గంగానదీ స్నానంతో స్వర్గం చేరుకుంటారు. ముల్లోకాలను పవిత్రం చేయగలిగే వితస్తా, నువ్వు ఉమవు. దేవతల మాతవు, మామూలు నదివి కావు. దేశప్రజల క్షేమం కోరి ముందుకు సాగిపో. నువ్వు శివుడి భార్యవు. మామూలు నదివి కావు. సముద్రం కూడా శివుడే. శంకర సంగమం కోసం వేగంగా సాగిపో.”
కశ్యపుడి మాటలు విన్న వితస్త ఉత్సాహంగా ముందుకు సాగింది. హిమాలయాల శిరస్సుపైని కేశాల నడుమ పాపిట తీస్తున్నట్టుగా ఉరుకుల పరుగుల ముందుకు సాగింది. దారిలో వేలకొద్దీ నదులను, ఉపనదులను కలుపుకుని ముందుకుసాగింది. స్వైరాజక, మాత్రా, భోగప్రస్థల గుండా ప్రవహిస్తూ గంగానదిని కలిసింది.
వితస్త లక్ష్మితో కలిసి, అదితి, దితి, సుశచి, గంగా యమునలతో కలసి ప్రవహించడం వల్ల కశ్మీరం పరమ పవిత్రం అయింది.
నాలుగు యుగాలు ప్రవహించిన తరువాత అశ్యయుజ మాసాంతాన, మానవులు తమ పంటను కోసుకుని కశ్మీరాన్ని వదిలి వెళ్ళారు.
కానీ కశ్యపుడి వంశానికి చెందిన చంద్రదేవుడు మాత్రం నిరాశ వల్ల, భవిష్యత్తులో జరిగే సంఘటనల ప్రభావం వల్ల కశ్మీరాన్ని వదిలి వెళ్ళలేదు.
(ఇంకా ఉంది)
నదీ ప్రవాహం—-మానవ జాతి ప్రయాణం !చదువుతూ ఆధునిక కాలానికి అన్వయిస్తూ సాగుతున్న మీ రచనా ప్రవాహం లో మునకలేస్తున్నాము.
అనేక ఆసక్తికర విషయాలు తెలియజేస్తున్న శ్రీ మురళీ కృష్ణ గారికి ధన్యవాదాలు.
మురళీకృష్ణ గారూ నమస్తే కాశ్మీర్ చరిత్రను చెపుతూ నదులూ, ఉపనదులూ, ప్రవాహం ప్రాంతాలు, నదులు అలకలూ, మానవ కళ్యాణం కోసం రాజీ పడడాలూ, సంగమస్థానాలూ మధ్యలో వచ్చే బైబిల్ ప్రకటనలతో మీ నీలమతపురాణం అద్భుతంగా ఉంది. అభినందనలు తెలియజేస్తూ శ్రీలక్ష్మి చివుకుల విజయనగరం
నదుల గురించి ఆసక్తికర కథనాన్ని అందిస్తున్న మీకు అనేక ధన్యవాదాలు
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™