వినాలని ఎదురుచూసే వెదురు కోసం వేణునాదమవుతుంది గాలి కూడా. కమ్మని కబురులతో తెమ్మెర సమీపిస్తే తబ్బిబ్బై తలూపుతుంది పూలతీగైనా. నిశ్చలమై తటాకం నిరీక్షిస్తే తూనీగ కూడా చిత్రాలు రచిస్తుంది.
అడ్డంకులెదురైనా ఆగిపోక తనకోసం పరుగెత్తి వచ్చిన సెలయేటికి అవనత వదనయై వనమే ఆకుపూజ చేస్తుంది. చినుకులుగా ప్రేమను చిందించే మేఘం కోసం అగరు ధూపమైపోతుంది అవని సమస్తం. తన కోసం నింగి నుంచి నేలకు జారిన వానజల్లు తాకీ తాకగానే తటాకం తనువెల్లా పూలవనం!
స్పందించే హృదయాలదే సాహచర్యపు సౌందర్యం ఎరుకనేది ఉంటేనే సహజీవన సౌరభం! ప్రకృతికీ పురుషుడికీ మధ్య అణచివేత, ఆధిపత్యం అంతరిస్తేనే విరబూస్తుంది స్నేహసుమం! రెండు సగాలూ సగౌరవంగా ఒకటైతే పూర్ణత్వం, ఒకదాన్నించి రెండోదాన్ని తీసేస్తే మిగిలేది శూన్యం!
వారణాసి నాగలక్ష్మి పేరుమోసిన కథారచయిత్రి, కవి, గేయ రచయిత్రి. చిత్రలేఖనంలోనూ విశేష నైపుణ్యం ఉంది. “ఆసరా”, “వేకువ పాట” వీరి కథా సంపుటాలు. ‘ఆలంబన’ కథాసంపుటి, ‘వానచినుకులు’ లలిత గీతసంపుటి, ‘ఊర్వశి’ నృత్య నాటిక వీరి ఇతర పుస్తకాలు. వీటిలో ‘వానచినుకులు’ పుస్తకానికి తెలుగు యూనివర్శిటీ సాహితీ పురస్కారం లభించింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™