ముగ్గులు అంటే ఇష్టపడని ఆడపిల్లలే లేరు పూర్వకాలంలో. పెద కళ్లాపులు, ముగ్గులు, గొబ్బెమ్మలు, పిడకలు, అరిశలు అన్నీ ఆడవాళ్ళ పనులే. అందుకే సంక్రాంతి అంటేనే ఆడవాళ్ళ పండగ. గంగిరెద్దుల విన్యాసాలు, కృష్ణార్పణం అనే హరిదాసుల పాటలు, భోగిమంటల దగ్గర చలి కాచుకోవడాలూ ఒకటేమిటి ఈ నెలరోజులు పండగ వాతావరణమే. సంక్రాంతి అంటే ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి.
సంక్రాంతి నెల పట్టగానే ఇంటి ముందున్న పెరడంతా పేడనీళ్ళతో పచ్చగా కళ్ళాపి జల్లి, దానిపై తెల్లని ముగ్గుల్ని రంగుల్తో నింపి గొబ్బెమ్మలు పెట్టి పండుగను ఆహ్వానించే వాళ్ళం. గొబ్బెమ్మల కోసం ఆవుపేడ తెచ్చుకోవడాలూ, గొబ్బెమ్మలపై గుచ్చడానికి చెరువులోని తామరాలు తుంపుకోవడాలూ, సందెగొబ్బెమ్మలు పెట్టి కన్నె పిల్లలంతా పాటలు పాడుకోవడాలు అన్నీ సంక్రాంతి సరదాలే. గొబ్బెమ్మలను పిడకలుగా చేసి ఎండబెట్టి వాటితోనే పండగనాడు పొంగలి పెట్టి దేవుడికి నైవేద్యం పెట్టేవాళ్ళు.
నేను చిన్నప్పుడు బాగా ముగ్గులు వేసేదాన్ని. నేనే కాదు అప్పట్లో ఆడపిల్లలందరూ ముగ్గులు అంటే పడిచచ్చేవాళ్ళే. క్లాసు పుస్తకాల నిండా ముగ్గులే ఉండేవి. స్కూల్లో ఖాళీ పీరియడ్లో కూర్చొని అందరూ ముగ్గులు వేసుకునేవాళ్ళు. నేను మొదట్లో ముగును ఉన్నదున్నట్టుగానే వేసేదాన్ని. తర్వాత్తరవాత కొంత సృజన జోడించి కొత్త డిజైన్లు తయారుచేయటం అలవాటైంది. ఈ అలవాటు వలన కాలేజీలోనూ, పట్టణంలోనూ జరిగే ముగ్గుల పోటీల్లో పాల్గొని పస్ట్ ప్రైజులు సాధించాను. స్నేహితులు, బంధువుల మధ్య నేను బాగా ముగ్గులు వేస్తాననే పేరు వచ్చింది. నాకు పెళ్ళై సిరిసిల్ల వచ్చిన తరువాత నాకున్న ముగ్గుల నేపథ్యం చూసి పట్టణంలో జరిగే ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతగా ఆహ్వానిస్తున్నారు. మహిళలు వేసిన ముగ్గుల్లో పస్ట్ సెకండ్ నిర్ణయించడానికి గీత స్పష్టత, నవ్యత, వర్ణ సమ్మేళనం అనే మూడు విభాగాలు పెట్టం. వాటన్నిటికీ మార్కులు వేసి అన్నింటిలో ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ప్రైజులు ఇస్తున్నాం.
ఈ క్రమంలో నాకు కొన్ని సామాజిక సమస్యల్ని ముగ్గులుగా చిత్రీకరించాలన్న ఆలోచన వచ్చింది. మాది హాస్పిటల్ కాబట్టి మొదటగా ఆరోగ్య పరమైన సమస్యల్ని తీసుకున్నాను. పోలియో చుక్కలు, భ్రూణహత్యలు, కుటుంబ నియంతరణ, బాలికా సంరక్షణ వంటివి ముగ్గులయాయి. ఇంకా పర్యావరణ కాలుష్యం,జల సంరక్షణ, మేరా భారత్ మహాన్ వంటి వాటిని కూడా ముగ్గులుగా రూపొందించాను. పూర్వపు మెలిక ముగ్గులలో రధాలు , గంధపు గిన్నెలు, మల్లె పందిర్లు ఉండేవి. దాన్ని దృష్టిలో ఉంచుకొని మెలికలతో ఒక అమ్మాయి బొమ్మను తయారు చేశాను. దానికి ఒక మినీ కవితను జోడించాను.
సిగ్గు పడుతూమెలికలు తిరిగిన ముగ్గువీధి వీధంతాతననే చూస్తున్నదని
ఇలా నేను తయారు చేసిన ముగ్గులకు మినీ కవితలు జోడించి సంక్రాంతి నాడు బొమ్మల కొలువు పేరిట మా సృజన్ పిల్లల హాస్పిటల్లో ఎగ్జిబిషన్ పెడితే అంతా బావున్నాయని మెచ్చుకున్నారు. ఈ సంక్రాంతికి మా హస్పిటల్లో ప్రిస్క్రిప్షన్ పాడ్పై పాపబొమ్మ, మెలిక ముగ్గు కవిత ప్రింట్ చేశాము. 2008లో మేము సంక్రాతికి ఒరిస్సా వెళ్ళినపుడు అక్కడి తెలుగువారి సభలో నేను చదివిన సంక్రాంతి-సక్కినప్ప కవితకు మంచి స్పందన లభించింది.
నేను వ్రాసిన ‘మిఠాయిపొట్లం’ అనే పొడుపు కథల సంపుటిలో ముగ్గుల గురించి ఓ పొడుపు కథ వ్రాశాను.
“ఇళ్ల ముందు ఉదయాన్నే కూర్చుంటాయికానీ అప్పుల వాళ్ళు కాదునల్లటి కొప్పులు, కొప్పుల్లో పూలుంటాయికానీ ఆడవాళ్ళు కారు”
జవాబు: ముగ్గులు, గొబ్బెమ్మలు.
ఇలా చెప్పుకుంటూ పోతే సంక్రాంతితో ఎన్నో అనుబంధాలు గుర్తుకొస్తాయి.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™