ఆ రోజు నేను లక్ష్మణ్ జూలా వైపు వెళ్ళాను. ఆ ప్రదేశము మంచి హడావిడికి నిలయము. నది క్రిందగా ప్రవహిస్తూ వుంటుంది. జూల(ఉయ్యాల) వంతెన పైకి వెళ్ళటానికి అంచలంచలుగా వెళ్ళాలి. అలా వెళ్ళే దారి పూర్తిగా దుకాణాలు మధ్యలో వుంటుంది. ఆ దారిలో మంచి సాంబ్రాణి సువాసన వెదజల్లుతూ వుంటుంది. రుద్రాక్షలు వంటివి ఎన్నో కుప్పలుగా అమ్ముతుంటారు. వెండి ఆభరణాలు, బట్టలూ… పెన్నులు, చందనపు బొమ్మలు… ఎన్నో సావనీర్లుగా తీసుకుపోవటానికి. వాటిని దాటుతూ వెడుతుంటే మూలకు ఒక పుస్తకాల షాపు కనపడిదింది. దానిని ఆనుకొని కాఫీ షాపు.
మనకు అమెరికాలో ప్రతి పుస్తకాల షాపుకు అనుబంధముగా ఒక కాఫీషాపు తప్పక వుంటుంది. ఒక పుస్తకము కొని, ఒక కాఫీతో చదవమని చెబుతారు. చక్కటి వాతవరణములో మనము పుస్తకాలు చదువుతూ గడిపెయ్యవచ్చు. ఇక్కడ అలాంటి సెట్టింగు బహుశా విదేశీ యాత్రికులను ఆకర్షించటానికై వుంటుంది. నే బుక్స్ షాపులోకి వెళ్ళాను. ‘ఓహో! అద్భుతమైన విజ్ఞానము’. కన్నుల పండుగలా వుంది. వాటి మధ్య ‘మహావతార్ బాబాజీ’ గురించిన బుక్ ఒకటి కనపడింది. కొని, కాఫీషాపులోకి నడిచా. ఆ కాఫీషాపు ఒక వైపు కిటికీలే వున్నాయి. ఆ కిటీకీలంతా గంగ మీదకు వున్నాయి. ఆ ప్రక్కనే భరతమాత మందిరము. మొత్తము భారతదేశములో భరతమాత మందిరమున్నది రుషికేషులోనే. ఆ కాఫీషాపు విదేశీయుల కోసమే వున్నట్లుగా అంతా వారే. మన దేశ ప్రజలు ఒక్కరూ లేరు, నేను తప్ప. అక్కడ అమ్మే బ్రెడ్డులు, వెరైటీ అంతా అమెరికా మెనునే. ఇది తప్పక వారికోసమే చేసిన ఏర్పాటు. సమోసా ఒక్కటి అమ్ముతున్నారు దేశీ రుచులతో!
నే ఒక టీ, ఒక క్రూసాంటు బ్రెడ్ తెమ్మని చల్లని గంగ గాలిని పీలుస్తూ బుక్ చదువుతూ వుంటే, “నేనిక్కడ కూర్చోవచ్చా” అని అడిగారు. తలఎత్తి చూస్తే ఒక విదేశీ మహిళ. చెక్ రిపబ్లికు నుంచి వచ్చానని చెప్పింది. ఆమెకు యోగా వచ్చుట. మరింత అడ్వాన్స్ కోర్సు కోసము ఇక్కడికి వచ్చానని చెప్పింది. యోగా కోసము వచ్చేవారే చాలా మంది ఈ విదేశీయులు. మా జిమ్‌లో ఇన్సస్రట్కర్ కూడా యోగా రుషీకేష్‌లో చేశానని గొప్పగా చెప్పేది. అది గుర్తుకు వచ్చింది.
కూర్చొని బుక్ చదువుతూ ఒక గంట గడిపాను. మనసు చాలా తేలికపడింది. గంగలో దూకాలన్న ఆలోచన స్థానే బాబాజీ నిలచారు. నేను బాబాజీ మహావతార్ గురించి కొంత వివరాలు చదవగలిగాను. బాబాజీ గురించి తీసుకున్న పుస్తకము యోగరాజ్ సిద్ధనాత్చే రచించబడినది. అందులో వారు క్రియా యోగా గురించి వివరాలతో పాటూ ఎన్నో ఇతరములైన వివరాలు వుంచారు. వారి ఆలోచనల ప్రకారము మహావతార్ బాబాజీ గోరక్షానాథ ఒక్కరే. నవనాథులను నాథ్ సంప్రదాయానికి చెందిన యోగులలోని వారని చెబుతారు. వారు శివుని నుంచి వచ్చిన పరంపరగా తలుస్తారు. శక్తివంతమైన నాథ్ సంప్రదాయమే నేటికీ సాధకులలో అత్యంత గౌరవప్రదమైనదిగా పేరు పొందింది. వారి సాధన పరమ కఠోరమైనది. గురువు మాటకు తిరుగు వుండదా సంప్రదాయములో. గురువు గంగలో దూకమంటే దూకుతారు, చావమంటే చస్తారు. శిష్యుని జీవితము గురువుకు అంకితము. అత్యంత క్లిష్టమైన యోగవిధానములో సాధకులు వారు. కాలి వేళ్ళ మీద శరీరబరువు వుంచి మోకాళ్ళు వంచి గొంతుకులా కూర్చని మూలాధారాన్నీ తాకుతూ తపస్సు చేస్తారట వారు. చెవులకు పెద్ద రింగులు ధరిస్తారు. చేతిలో దండము. వారెక్కడవుంటే అక్కడ ధుని తప్పని సరి. లోక క్షేమము కోసము తప్ప మరిదేనికీ తమ శక్తులు వాడరు. వారికి అష్ట సిద్ధులూ, నవనిధులూ అరచేతిలో వుంటాయి. సామాన్య ప్రజలంటే కరుణతో వుంటారు. వారలో మచ్ఛేంద్రనాథుడు చాలా ప్రఖ్యాతి. సాయిబాబాది కూడా నాథ సంప్రదాయమే నని చెబుతారు. అందుకే ఆయన ధునిని వెలిగించి వుంచేవారనీ చెబుతారు. నాథ సాంప్రదాయ సాహిత్యము కూడా మనకు విరివిరిగా దొరుకుతోంది రుషికేష్‌లో.
***
మహవతారు బాబాజీ చూడటానికి ఎల్లప్పుడూ 25 సంవత్సరాల వ్యక్తిలా వుంటారుట. ఆయన పొడవైన నల్లని కురులతో బంగారు రంగు మేని ఛాయతో మెరిసిపోతూ వుంటారుట. ఒక చిన్న పంచె మాత్రమే ధరిస్తారుట. ఆయనను కలిసిన వారంతా లహిరీ మహాశయులు వాడిన బాబాజీ అనే పేరునే వాడటం జరిగింది. ఆయనను కలిసిన వారు తమలో తాము చర్చించుకోవడం ద్వారా తామంతా కలిసింది ఒకే వ్యక్తినేనని నిర్ణయించుకున్నారు.
మనము ‘గురుభ్యో నమః’ అన్న ప్రతీసారి ఆ నమస్కారము బాబాజీకి వెడుతుంది.
స్వయంగా బాబాజీ క్రియా యోగ పద్ధతులను, శారీరక స్థితిని ఆరోగ్యముగా నిలుపు కొనుటకు ఉపయోగించారు. మనకి అతి తక్కువగా తెలిసిన కాయకల్ప చికిత్స ద్వారా బాబాజీ వారు అనేకసార్లు నిత్య యౌవ్వనమును సాధించినట్లుగా, లాహిరి మహాశయుల శిష్యులైన ప్రణవానంద స్వామికి తెలిపారుట. ఈ కాయకల్ప చికిత్సలో ఉపవాసము. సుదీర్ఘనిద్ర, ధ్యానము మూలికా ప్రయోగములు ఉన్నాయిట.
మహావతార్ బాబాజీ శిష్యుల యొక్క మనస్తత్వానికి, శక్తి సామర్థ్యములకు అనుగుణంగా సూచనలిచ్చుచూ సాధన అభివృద్ధి చెందునట్లు చేయుచు, సంసిద్ధులైన వారికి అంచెలంచెలుగా సాధన రహస్యములను తెలుపుతారు. అవతార పురుషులు అందరూ విశ్వనాటకములో అవసరమైనపుడు వారి వారి పాత్రలను పోషిస్తారు. బాబాజీది శివుని అవతారము అని భక్తుల నమ్మకము. ప్రకృతి చేతనావస్థలో లీనమైన మానవుని చీకటి నుండి వెలుతురు లోకి తీసుకుని వెళ్ళటానికి, మానవత్వమునకు ఆధ్యాత్మిక విలువలను అందించటానికి, జీవితపు ఒత్తిడికి లోనై దారి తప్పిన మానవులకు సన్మార్గులుగా చేయుటము, బాబాజీ ముఖ్యమైన పని.
క్రియా యోగా చేసిన వారికి కుండలిని జాగృతి జరుగుతుందని వివరిస్తారు. క్రియాయోగము గురువు ద్వారా మాత్రమే స్వీకరించి సాధన చేయ్యాలి. కుండలిని గురించి సవివరముగా చర్చించారు సిద్ధనాథుడు. వారు చెప్పినదాని బట్టి కుండలిని అన్నది (ఎల్కక్ట్రో మాగ్నటిక్) విద్యుత్ అయస్కాంత ప్రాణశక్తి. ప్రతివారిలోనూ మూలాధారములో ముడుచుకు వుంటుంది. అది కుండలినీ.
కుండలి అను పేరు వివిధ యోగ గ్రంథాలలో కనిపిస్తుంది. కుండలిని శక్తి మేల్కొనని యెడల సర్వయోగ సాధనలు వ్యర్థములు అంటారు. ఈ కుండలిని అనేది వెన్నుపాము కిందభాగములో సర్పాకృతిని పొంది నిద్రావస్థలో ఉన్న ఒక సూక్ష్మ నాడి. ఇది సమస్త శక్తి మహిమలకు, సమస్త జ్ఞాన, విజ్ఞానములకు ఆధారభూతం అయిన కేంద్రస్థానం. ఈ కుండలినీశక్తి మేల్కొననంత వరకు మానవుడు అజ్ఞానిగానే ఉంటాడు. కుండలిని జాగరణ అయిన కొద్దికాలంలోనే పూర్ణమైన ఙ్ఞానమును, సమస్త మహిమలు కలుగును.
వెన్నుపాము కిందిభాగంలో చుట్ట చుట్టుకున్న ఈ కుండలిని శక్తి వెంట్రుకలా సన్నగా ఉంటుంది. ఇది సాధారణముగా నిద్రావస్థలో ఉంటుంది. ఎప్పుడైతే నిద్రావస్థలో ఉన్న కుండలి సరైన గురుప్రసాదం వలన మేలుకొని సకల పద్మాలు అనగా చక్రాలను చీల్చుకొని పోవుతుందో అప్పుడు సాధకునిలో మార్పు వస్తుంది. ఈ కుండలినికి అనేక నామములు కలవు. కుటిలాంగి, భుజంగి, శక్తి, ఈశ్వరి, కుండలిని, ఇత్యాదివి. లలితా సహస్రనామాలలో కూడా మనకు కుండలిని గురించి చాలా వివరము కనపడుతుంది. “మహాశక్తి కుండలినీ బిసతంత్రుతనీయసే” అన్న అమ్మవారి నామము తెలుపుతుంది ఆమె గురించి.
కుండలినీ గురించి పురాణాలు కూడా మనకు వివరాలిస్తాయి. వ్యక్తిలోని కుండలిని శక్తి దీనిని వ్యష్ఠి కుండలిని అంటారు. దీనికి సుబ్రహ్మణ్యస్వామిని అధిపతిగా చెబుతారు. రెండవది బ్రహ్మాండమునందున్న కుండలినీ శక్తి. దీనికి ఆదిశేషుడు అధిదేవత.
“మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహంస్థితం స్వాధిష్ఠానే హృదిమరుత మాకాశముపరిమనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథంసహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే” (సౌందర్యలహరి).
షట్ చక్రాలోకి పైకి పైకి ఎగబాకి, తిరుగుతూ కుండలిని సహస్రారములోకి ప్రవేశిస్తుందని సౌందర్యలహరిలో శంకరులు వివరించారు.
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™