అక్కడ వున్న స్వామిజీ చిదానంద సరస్వతి వారు. ఆయన ఎన్నో ప్రజోపకార కార్యక్రమాలలో సేవలు అందిస్తున్నారు, ప్రజల సేవ చేస్తున్నారు. ఆశ్రమము నడుపుతూ ప్రతి సంవత్సరము యోగా ఫెస్టివల్ చేస్తారు. పిల్లల గురించి కొన్ని ప్రతిష్ఠాకరమైన కార్యక్రమాలు స్వామిజీ చేస్తున్నారు. అందులో ముఖ్యమైనవి మంచినీటి సరఫరా. ప్రతివారికి మంచినీరు, త్రాగు నీరు వుండాలని ఆయన భావన. ఆయన అందుకోసము ఎన్నో ఉన్నతమైన క్రార్యక్రమాలను ప్రారంభించారు. ఇండియన్ హ్యుమానిటేరిమన్ సంస్థ, గంగా యాక్షన్ పరివార్, శక్తి పౌండేషను వంటివి కొన్ని. దానితో పాటు ప్రతి ఏడాది ఇంటర్నేషనల్ యోగా క్రేంద్రముగా కూడా వారి ఆశ్రమము నిలయముగా వుంది.
వారి ఆశ్రమానికి కొద్ది కాలము ముందు అంటే బహుశా పది పదిహేను సంవత్సరాలకు మునుపు అమెరికా నుంచి కొందరు విద్యార్థులు జిజ్ఞాసువులుగా వచ్చారుట. వారిలో ఒక యువతికి కొంచము ఆధ్యాత్మికత మీద ఇంట్రస్టు ఎక్కువగా వుంది. అప్పుడే కాలేజి చదువు కానిచ్చిన ఆమె భారతదేశము మీద ప్రేమతో వచ్చింది. ఈ ఆశ్రమానికి వసతికి వచ్చింది. ఆశ్రమముకు వచ్చిన వారు గురువుగారి దర్శనము చేసుకుంటారుగా సామాన్యముగా. అలా ఆమె స్వామిజీ దర్శనానికి వెళ్ళింది.
గురూజీ చిదానంద సరస్వతి గారు ఏమనుకున్నారో ఆమెను చూచి “నీ ఇంటికి స్వాగతము” (welcome home) అన్నారుట. ఆ మాట ఆమె మనసులో నిలబడిపోయింది. తిరిగి తన సొంతవూరైన లాస్ఏంజిల్స్ వెళ్ళినా మనసు కుదుటపడలేదు. ఇంట్లో అమ్మానాన్నకు “నేను భారతదేశము వెడుతున్నాను. ఇక రాను” అని చెప్పి, చక్కా రుషికేష్ లోని ఈ పరమార్థ ఆశ్రమానికి వచ్చేసింది.
ఇక గురువుగారు కొన్ని రోజులు చూసి ఆమెలోని సీరియస్నెస్కు సంతోషించి ఆమెకు సన్యాసము ఇచ్చారు. ఆమె ఆశ్రమములో ఎన్నో పనుల చూసుకుంటుంది. కమ్యూనికేషన్స్ లాంటివి చూస్తుంది. బయట సభలు, ప్రపంచ దేశాలలో కార్యక్రమాలు, ఆశ్రమానికి ఫండ్సు గురించి, ఇలా ఎన్నో పనులు ఆమె చూస్తుంది. ఆశ్రమములో స్వామీజికి తలలో నాలుకైయ్యింది. అక్కడ ఆమె రెండవ వరుస గౌరవప్రదమైన స్థానములో వుంది. ఆమెను సాధ్వి ప్రియదర్శినిజీ అంటారు. ఈ కథ విన్న తరువాత శ్రీ చిదానంద నా గురువేమో అన్న ఆశ నన్ను వదలలేదు. అందుకే ఆయనను కలవాలని మరోసారన్నా ఆశ్రమము వెళ్ళాలని ముందే అనుకున్నా. ఆ సాయంత్రము అందుకే గంగానది దాటి ఆశ్రమానికి వెళ్ళాను.
స్వామిజీ లేరు. ఆయన మరో వూరు వెళ్ళారు ఇప్పుడే రారని చెప్పారు. నాకు తలుపులు మూసుకుపోతున్న భావన కలిగింది. ఆశ చావక సాధ్విజీని కలవటానికి కుదురుతుందా అని అడిగాను. ఆమె కూడా బిజీగా వున్నారని చెప్పారు. కుదరదు కలవటము. రాజేష్ జీ కనిపించారు పూర్వము నాకు కలిగిన ఇబ్బందికి చాలా విచారము ప్రకటించారు. నాతో ఆయన చాలా ఆదరముగా మాట్లాడాడు. స్వామిజీ రాసిన ‘శాంతి’ అన్న పుస్తకము నాకు గిప్టుగా ఇచ్చారు. నేను ఆయనకు నమస్కారము పెట్టి బయటకు వచ్చేశా. అలా అనుమానము లేకుండా శ్రీ చిదానంద సరస్వతీ స్వామిజీ నా గురువు కాదని నిశ్చయించుకున్నాను.
అయినా ఎవరి కథ విన్నా, చదివినా నాకు అలాంటిది జరగాలన్న నా పిచ్చిని నేను తిట్టుకున్నాను. ఈ ఆధ్యాత్మిక పరుగుపందెము ఎవ్వరికి సంబంధము లేనిది. ఎవ్వరి పరుగు వారిదే. ఒక గురువుగారివద్ద ఇద్దరు శిష్యులు ఒకే సమయంలో వచ్చి చేరారుట. గురువుగారు ఇద్దరికీ విడి విడిగా పిలిచి మంత్రం ఇచ్చి చెయ్యమని పంపారుట. ఒకనికి దాదాపు నెలలో సిద్ధి కలిగింది. అతను గురువుకు నమస్కరించి వెళ్ళి తను ఆశ్రమము వేసుకొని నడుపుకోవటము మొదలెట్టాడు.
రెండవ వాడికి ఎన్ని రోజులు గడిచినా సిద్ధి కుదరలేదు. గురువు మీద అనుమానము కూడా కలిగింది. తనను గురువు మోసము చేశాడని పూర్తిగా అనుకున్నాడు. ఏళ్ళు గడిచినా మార్పులేదు.
ఒకరోజు వెళ్ళి గురువును నిలదీశాడట. “నాకు పిచ్చిది, వాడికి మంచి పనిచేసే మంత్రము ఇచ్చారు గురువుగారు” అంటూ దెబ్బలాడాడు.
దానికి గురువుగారు “నాయనా నీకు వాడికీ ఒకటే ఇచ్చాను. నీవు ఆ మంత్రాన్నీ, నా సమర్ధతను లెక్కకట్టటానికే సమయము చాలటము లేదు. ఇక సిద్ధి ఎక్కడిది? వాడు పూర్తి విశ్వాసముతో మంత్రము చేసి సిద్ధి పొందాడు. ముందు నీలో వున్న లోపము సవరించుకో” అని చెప్పాడు. గురువు యందు శరణాగతి వుండాలి. ఎవరి ఆధ్యాత్మిక ఎదుగుదల వారిదే. పోటి లేదీ పరుగు పందెములో. మనతో మనమే చేస్తున్న యుద్ధము. మన మూలాలు తెలుసుకునే యత్నం కదా! వాడికి బుద్ది వచ్చి గురువును పూర్తి విశ్వాసముతో సేవించి సిద్ధి పొందాడు. అందుకే ఇందులో పూర్వాపరాలు కూడా వుంటాయి కదా. ప్రతి వారి అనుభవమూలా నా అనుభవము వుండాలనుకోవటము పరమ మూర్ఖము.
“అరణ్యేన వాసస్య గేహిన కార్యేన దేహీ మనో వర్తతే మే త్వ నర్ఘ్యెమనస్చేన లగ్నమ్ గురోరంఘ్రి పద్మేతథ కిమ్ తథ కిమ్ తథకిమ్ తథ కిమ్॥”(గురు అష్టకము. శంరాచార్య విరచితము)
అడవిలో వుండాలనుకున్నా, ఇంట్లో వుండాలనుకున్నా ఏమైనా సాధించాలనుకున్నా, వంటి మీద శ్రద్ధ లేని వారైనా కానీ గురువు పాదాల వద్ధ మనసు నిలుప లేకపోతే ఏమి లాభము?
అలా పరమార్థ నికేతను అన్న ద్వారము మూసుకుపొయింది నాకు.
ఆ సాయంత్రము గంగా వడ్డున కూర్చుండిపోయాను. హారతి అయ్యింది. పలుచగా వున్న భక్తులు సద్దుమణిగారు. రాత్రి లక్ష్మణ్ ఝూలా వంతెన త్రివర్ణ పతాకపు మూడురంగుల దీపాలతో మెరుస్తున్నాయి. రాత్రి పూట గంగ మీద బోట్లు తిరగవు. మనము వంతెన మీదుగా నడచి గంగను దాటాలి. నేను స్వామిజీని కనీసము చూడకపోవటము వలన కలిగిన నిరుత్సాహముతో కూర్చుండిపోయాను. గంగ మీద దీపాల వెలుతురు పరావర్తనము చెందుతూ మెరుస్తోంది.
అలా చాలా సేపు కూర్చున్నానులా వుంది. టైం చూసుకోలేదు. ఒక పోలీసు వచ్చి నా ప్రక్కన కర్రతో నేల మీద కొట్టాడు. నా అటెన్షను కోసము అనుకుంటా. “ఎవరూ” అన్నాడు కొద్దిగా కరుకుగా, నేను లేచాను. అతను వదలకుండా నన్ను “ఎక్కడ్నుంచి వచ్చావని” వివరాలు అడిగాడు. ‘నేను మఠములో వున్నానని, స్వామిజీని కలవటానికి వచ్చానని’ చెప్పి వడివడిగా నడుస్తూ వంతెన వైపు వచ్చేశా. కాని అతను నన్ను మఠము వరకూ తన బైకు మీద ఫాలో అవటము నేను గమనించి ఆశ్చర్యపోయాను. పోలీసుల డ్యూటినా లేక మరోటా?
మఠములో అర్చకస్వామి అతనిని మాట్లాడి పంపించేశాడు. నేను ఏంటని అడిగితే “ఏం లేదు మాతాజీ” అన్నాడు. నేను అతను నన్ను అనుమానించాడా లేక మరోటా అని కొంత సేపు ఆలోచించి వదిలేశా. అలా జరిగింది కేవలము అప్పుడొక్కసారి మాత్రమే. ఆ ఆశ్రమము వైపుకు వెళ్ళవద్దని నాకు ప్రకృతి బహుశా చెబుతోందేమో. మనకు చాలా సార్లు తెలియదు కాని మన చుట్టూ గార్డియన్స్ వుంటారు, సనాతన ధర్మము నమ్మిన వారిని రక్షిస్తూ. గమనించవలసిన పని స్త్రీగా అది నా కనీసపు కర్తవ్యము అనుకున్నా, కానీ నాకు సామాన్యముగా వున్న ధైర్యంతో పాటూ ప్రస్తుత పరిస్థితులలో ఏదీ పట్టించుకునేలా లేను. అయినా ‘రాముని వారము. మాకేమి విచారము’..
***
జ్యోషీమఠ్ ప్రయాణము:
“పరీక్ష్యలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణో నిర్వేదమాయాత్।నాస్త్యకృతః కృతేన। తద్విజ్ఞానార్థం సగురుమేవాభిగచ్ఛేత్। సమిత్పాణిః శ్రోత్రియం బ్రహ్మనిష్ఠమ్॥” (ముండకోపనిషత్)
మానవ జన్మ కలుగుటయు, మోక్షము పొందవలెనని తీవ్రవాంఛయు, సద్గురు లాభము అను మూడును గొప్ప పుణ్యవశమున, దైవానుగ్రహమున కలుగును.
నేను మరురోజు మఠములోని అర్చకస్వామిని “జ్యోషిమఠము వెళ్ళాలంటే కుదురుతుందా?” అని ప్రశ్నించాను.
అతను “మీరు దేవప్రయాగ వెళ్ళారుగా” అన్నాడు.
“అది కాదు జ్యోషిమఠము” మళ్ళీ చెప్పాను.
“వెళ్ళవచ్చు. మీరు మీకై ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళి రండి. కాని ఆ దారిలో వున్నవి అన్నీ చూస్తూ వస్తే మీకు రెండు మూడు ట్రిప్పులు తగ్గుతాయి మాతాజీ!” అన్నాడు.
“దేవప్రయాగ దారిలోనేనా” అడిగాను.
“అవును. పంచప్రయాగలు అదే రూటు మాతాజీ! దారిలోవి కుదిరినవి అన్నీ చూసి రండి” అతను మళ్ళీ వివరించాడు.
(సశేషం)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™