ప్రముఖ బ్రిటీష్ ఇంజనీరు సర్ ఆర్థర్ కాటన్ గారి సంగ్రహ జీవిత చరిత్రని అందిస్తూ, ఆయన చేసిన మూడు ప్రసంగాలను తెలుగులో అందిస్తున్నారు శ్రీ మువ్వల సుబ్బరామయ్య ఈ పుస్తకంలో.
***
“తెలుగువారికి పాత్రఃస్మరణీయుడైన సర్ ఆర్థర్ కాటన్ జీవిత చరిత్రలు గతంలో చాలానే వచ్చాయి. అయితే శ్రీ మువ్వల సుబ్బరామయ్య విభిన్నంగా వ్రాశారు. నీటి విలువను చాటి చెప్పిన మహత్తర రచన ఇది.
‘నీరు’, ‘నీటి విలువ’, ‘నీటిపై ఖర్చు’ గురించి సర్ ఆర్డర్ కాటన్ 1874లో చేసిన మూడు ప్రసంగాలు ఈ గ్రంథంలో శ్రీ సుబ్బరామయ్య గారు మన కందించారు. నీటిపై అవగాహన పెంచడానికి ఈ ప్రసంగాలు ఉపయోగపడతాయి. ప్రత్యేకించి ఇరిగేషన్ ఇంజనీర్లకు ఈ ప్రసంగాలు పాఠ్య గ్రంథాల వంటివి” అని ‘తెలుగు భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్’ అనే ముందుమాటలో శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారు పేర్కొన్నారు.
“పలువురు ప్రముఖ ఇంజనీర్లు భారతీయులకు తెలుసు. వారందరిలో సర్ ఆర్థర్ కాటన్‌కు ఒక ప్రత్యేక స్థానం వుంది. ప్రత్యేక తరహాకు చెందినవారు. ఆయన కేవలం ఇంజనీరు మాత్రమే కాదు. ఉత్సాహవంతుడు. గొప్ప భావుకుడు. మానవజాతి అభ్యున్నతికి కృషి చేయాలన్న దీక్ష, దక్షత కలవాడు.
మన మాతృభూమి గురించి ”లేదురా ఇటువంటి భూమి ఇంకెందు” అని మనం కీర్తించడం సహజం. కాని, ఆంగ్లేయుడు, సామ్రాజ్యవాదులు నియమించిన ఉద్యోగి అయిన శ్రీ కాటన్, మన దేశం గురించి ఆ విధంగా కీర్తించటం, అందుకనుగుణంగా భారతదేశాన్ని తీర్చిదిద్దటానికి కృషి చేయటం ఆయనలోని ప్రత్యేకత. నిజాయితీకి నిదర్శనం.
దక్షిణ భారతదేశానికి సర్ కాటన్ చేసిన అమూల్యమైన సేవలు ప్రతి ఒక్కరికీ తెలుసు. కాని, అత్యంత తపనతో, పకడ్బందీగా సమన్వయంతో కూడిన అఖిలభారత ఇరిగేషన్, నదీజలాల రవాణా వ్యవస్థకై తాను రూపొందించిన బృహత్ పథకం కోసం కాటన్ చేసిన ప్రబోధం, కృషి గురించి బహు కొద్దిమందికి మాత్రం తెలుసు. ఆయన ఉద్యోగ విరమణ చేసిన తరువాత కూడా, ఆ పథకం గురించి ప్రబోధించారు. అనేక సభలలో ప్రసంగించారు. గోష్ఠులలో వివరించారు. బ్రిటీష్ పార్లమెంటు కమిటీల ముందు సాక్ష్యం చెప్పారు. భారతదేశంలో ఇరిగేషన్, నదీజలాల నావిగేషన్ అభివృద్ధి చేయవలసిన అవసరం గురించి నొక్కి చెప్పారు.
సైనిక ఇంజనీరింగ్ వ్యవహారాల బ్రిటిష్ సంస్థ, 1874 సంవత్సరం డిసెంబరు 10, 14, 17 తేదీలలో ఛాథంలో (లండన్) జరిపిన సమావేశాలలో కాటన్ చేసిన మూడు ప్రసంగాల కాపీలు లభ్యం కావటం నా అదృష్టంగా భావిస్తున్నాను. వాటిని ప్రచురించి ప్రజల ముందుంచుతున్నాను. భారతీయ యువ ఇంజనీర్లు, సర్ ఆర్థర్ కాటన్ ఆనవేసి వదిలి వెళ్ళిన ఈ కార్యక్రమాన్ని చేపట్టి కొనసాగిస్తారన్న ఆశాభావంతో వీటిని ప్రచురిస్తున్నాను. ఇరిగేషన్, నదీజలాల రవాణా అభివృద్ధికి కృషి చేస్తారని, దేశంలో వున్న అపారమైన నీటి వనరులను, సర్ ఆర్థర్ కాటన్ శతాబ్దం క్రితం ఊహించిన మార్గంలో, పూర్తిగా అభివృద్ధి చేస్తారన్న ఆశతోనే ఈ ప్రసంగ వ్యాసాలను ప్రచురిస్తున్నాను” అని మువ్వల సుబ్బరామయ్యగారు ‘ఉపోద్ఘాతం’లో వ్యాఖ్యానించారు.
సర్ ఆర్థర్ కాటన్ మువ్వల సుబ్బరామయ్య ప్రచురణ: జయంతి పబ్లికేషన్స్, విజయవాడ పేజీలు: 152 వెల: ₹ 100.00 ప్రతులకు: జయంతి పబ్లికేషన్స్, 27-1-68, కారల్ మార్క్స్ రోడ్, గవర్నర్ పేట, విజయవాడ-520002 ఫోన్: 0866 2577828
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™