సాధారణంగా ఓషధీ శాస్త్రం, శస్త్ర చికిత్సలలో నిష్ణాతులవడానికి విద్యార్థులకు పన్నెండు సంవత్సరాలు పడుతుంది. కాని, జీవకుడిని ఏడు సంవత్సరాల విద్యాభ్యాసం తరువాత ఆచార్యులు పరీక్షించి, ఉత్తీర్ణుడిగా పరిగణించారు. నా విషయంలో, ఆరు సంవత్సరాలకే విద్య పూర్తయి, ఇక బోధించడానికి ఏమీ లేదని వారు ఉద్ఘాటించారు.
ఆంధ్రపథంలోని వేంగీ విషయానికి చెందిన రాజపుత్రుడు చంద్రకీర్తి – అతడు తక్షశిలలో ధనుర్వేదం, గజసూత్తం, న్యాయశాస్త్రం, యుద్ధ విద్య, మృగయాశాస్త్రం, మొదలైన పద్దెనిమిది కళలు అభ్యసించాడు. నేను ఓషధీ శాస్త్రంలో విద్యపూర్తి చేసిన తరువాత, చంద్రకీర్తి ప్రోద్బలం చేత ధనుర్వేదం మొదలైన కళలను అభ్యసించాను. అప్పుడే నౌకానిర్మాణ శాస్త్రం కూడా అధ్యయనం చేశాను.
ఆచార్యుని గురుకులంలో కేవలం నూట ఒక్క శిష్యులం మాత్రమే ఉండేవారము. వారిలో సగానికి పైగా బ్రాహ్మణులు, మిగిలిన వారు రాజపుత్రలు – ఇతర కులాలవారికి ఈ గురుకులంలో ప్రవేశం లేదు. కురుబూముల నుండి ఒకరు, మరొకరు వారణాసి నుంచి వచ్చి మాలో చేరారు.
ఆ విధంగా నాకు వైద్య విద్య పూర్తి అయిన తరువాత ఇతర విద్యలు నేర్చుకునే అవకాశం కలిగింది.
చంద్రకీర్తి ఆజానుబాహువు – వర్చస్వి – ధనుర్విద్యలో అసమానమైన ప్రతిభ చూపించి ఆచార్యుల మన్ననలు పొందాడు. తరువాత స్థానం నాకు లభించింది.
తక్కసిలలో విద్యలు పూర్తి చేసిన తరువాత చంద్రకీర్తికి దేశాటనంపై మనసు పోయింది. సువర్ణభూమి గురించి చాల చాల వార్తలు తక్కసిలలో వ్యాపించాయి. ఆ దేశం చేరడానికి సముద్రయానం ఉత్తమమైనది. భూమార్గాన్ని అనుసరిస్తే ఎన్నో కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. చాల అరణ్యాలను గడచి, పర్వతాలను ఆరోహించి, నదులను దాటి గమ్యం చేరుకోవాలి.
చంద్రకీర్తి భూమార్గమే ఎన్నుకున్నాడు. నన్ను తనకు సహాయంగా రమ్మన్నాడు. ఇటువంటి అనుభవం మరెక్కడా లభించదని నిర్ణయానికి వచ్చి, మేము సువర్ణ భూమికి బయలు దేరాము.
కేకయు, ముద్ర, శకల, పృథుడక, ఉసీనర దేశాల మీదుగా సువర్ణ భూమికి ప్రయాణమయాము. వ్రావస్తి, కుసీనర, పాటలీపుత్ర నగరాలమీదగా వంగదేశం దాటి, పార్ట్యోతిషం మీదుగా సువర్ణ భూమికి ప్రయాణం చేశాం. లౌహిత్య నదిని దాటుతున్నప్పుడు, మేము ప్రయాణం చేస్తున్న పడవ నడి యేట్లో విరిగి పోయింది. పదిమందిమి నీటిలో పడిపోయాము. నలుగురం మాత్రం ఈదుకుంటూ అవతలి గట్టు చురుకున్నాము.
కొంత దూరం ప్రయాణం చేసిన తరువాత మాకు ఒక పర్వతం ఎదురయింది. అక్కడ చిక్కగా అల్లిన వేప తీగలను పట్టుకొని పర్వత శిఖరం చేరుకున్నాము. ఇది వేత్రపథం.
ఆ పర్వతం తరువాత ఒక పీఠభూమి వచ్చింది. దానిని కోసుకుంటూ ఒకనది పారుతున్నది. ఆ నదిలో ఏ వస్తువు పడినా రాయిగా మారుతుందని చెప్పుకుంటారు. అపుడు నీటికి తగులకుండా నదిని దాటవలసి వచ్చింది. ఆ నది అంత వెడల్పు లేదు. లోతుగా పారుతున్నది. దాని గట్లపైన వెదురు పొదలున్నవి. కొన్ని వెదుళ్లు చాల పొడువుగా ఎదిగి రెండవ గట్టుపై వాలి ఉన్నాయి. ఆ వెదుళ్లను పట్టుకొని పైకి ఎగబ్రాకి రెండవ గట్టును చేరుకున్నాము. ఇది వంశపథం.
పిమ్మట పర్వత శిఖరాలపై చాల ఇరుకుదారి మీద పోవలసి వచ్చింది. పట్టు తప్పకుండా, మేకలు మాత్రమే, ఈ మార్గం మీద భద్రంగా పోగలవు. పర్వత వాసులైన కిరాతుల వద్ద ఈ మేకలుంటాయి. కిరాతులను ఆకర్షించడానికి పచ్చికట్టెలను కాలిస్తే పొగ పైకి లేచింది. వాళ్లు మమ్మల్ని సమీపించారు. వారినుండి మేకలను కొని వాటి పై కూర్చొని, ఉన్నత పర్వతశిఖరాల మీద తల తిరగకుండా భద్రంగా ప్రయాణం చేశాము. ఈ మార్గాన్ని అజాపథమంటారు.
కాని, ఈ దారిని ప్రయాణం చేస్తుంటే మాకు తీవ్రమైన అవరోధం కలిగింది. మాకు ఎదురుగా కొందరు మావేపు వచ్చారు. వాళ్లు కాని, మేము కాని వెనుకకు తిరిగి వెళ్లే అవకాశం లేకపోయింది. అపుడు, ఎవరు బలవంతులైతే వారే ముందుకు పోగలరు. ఎదుటి వాళ్లు బాణాలు ఎక్కు పెట్టారు. చంద్రకీర్తి, నేను, తప్పనిసరిగా మా ధనుర్విద్యను ప్రదర్శించవలసి వచ్చింది. ప్రతిస్పర్థులు ఒకరూ ఒకరూ శిఖరాగ్రం నుండి లోతుగా పారుతున్న కొండవాగులోకి పడిపోయారు.
కొందరు సువర్ణభూమికి బంగారం కోసం వచ్చారు. వాళ్లు మా వెంబడిని వస్తున్నారు. ఇరుకు దారిని దాటిన పిమ్మట, వారిలో ముఖ్యుడు, మేకలను చంపి, వాటితోళ్లను మాంసభాగం పైకి కనిపించేటట్టు కప్పుకోమని తనవారితో చెప్పాడు. చాల పెద్ద పక్షులు ఎగురుతూ వచ్చి, మేక చర్మాలను కప్పుకున్న వారిని పచ్చి మాంసమనుకొని, తన్నుకుపోయాయి. వారిని తమ గూళ్లలో విడిచి పెట్టాయి. అక్కడే బంగారముంటుంది. కాని, మా కళ్ల ఎదుటే ఒక విచిత్రం సంభవించింది. ముఖ్యుడిని ఎత్తుకుపోయిన పక్షిని, ఆకాశమార్గంలో మరొక పెద్ద పక్షి ఎదుర్కొని, దాని ఎరను తన్నుకుపోవాలని ప్రయత్నించింది. అపుడు మేక చర్మం విచ్చిపోయింది. దట్టమైన అడవి మధ్య, ఒక తటాకంలో అతడు పడిపోయాడు. అతడు లేచి కొంచెం దూరం నడిచాడు. అతనికో నది ఎదురయింది. ఆ ఏటి గట్లను బంగారపు ఇసుక తిన్నెలు అతనికి కనిపించాయి. మేము మాత్రం ఆ మార్గం విడిచి ప్రయాణం చేశాము. బంగారం గురించి మాకు కొంచెమైనా ఆశలేకపోవడమే దానికి కారణం.
దారిలో ఒక చోట మేము ముణుకుల మీద ప్రాకుకొని దాటవలసి వచ్చింది. దీనిని జన్ను పథమంటారు.
పర్వతారోహణానికి ఒకచోట శంకు పథాన్ని అనుసరించవలసి వచ్చింది. చర్మపు తాటి చివరను ఒక లోహపు కొక్కెం కట్టి పైకి విసిరాము. కొక్కెం ఒకచోట తగులుకున్న తరువాత, తాటి సహాయంతో అంతవరకు ఎక్కాము. లోహపు ఊచ చివరను వజ్రమొకటి తాపి ఉన్నది. దానితో పర్వతం పైన కన్నం చేసి ఊచను పాతాము. ఈ విధంగా అంచెలంచెలుగా పర్వతాన్ని అధిరోహించి శిఖరం చేరుకున్నాము. ఇదే శంకుపథం.
పర్వత శిఖరం చేరిన తరువాత, రెండవేపుకు దిగడం అసంభవమయింది. శిఖరాగ్రం ఏపాటి వాలు లేకుండా నిలువుగా ఉంది. అపుడు మేక చర్మాన్ని వొలిచి, శుభ్రం చేసి, నాలుగు మూలలను తాళ్లు కట్టి, తాళ్లను చేర్చి పట్టుకొని, ఒక్కసారి కిందికి దుమికాము. చర్మంలోపలి భాగంలో గాలినిండి, క్రమంగా మేము దిగువ భాగం చేరుకోడానికి సహాయపడింది. దీనిని ఛట్టా పథమంటారు.
కాంచనం కోరేవారు ఇన్ని అగచాట్లు పడడంతో అర్థమయింది. కాని దేశాటనంలో భాగంగా ఈ కష్టాలను మేము ఎదుర్కొన్నాము. చాల అనుభవం గడించాము. ఎటువంటి దుర్గమ మార్గంలోనైనా మేము విజయవంతంగా ప్రయాణం చేయగలమన్న నమ్మకం కుదిరింది.
ప్రయాసలన్నీ పడి, చివరకు మేము సువర్ణ భూమి ఉత్తర భాగం చేరుకున్నాము. అక్కడ నుండి ఇరావతీ నదిలో చేరే ఉపనదుల పక్కనడిచి దక్షిణంగా ప్రయాణం చేశాము. ఇరావతీ నది పశ్చిమతటాన్న చంపావతీ నగరముంది. అది ఉత్తరసువర్ణ భూమికి చెందిన చిన్న రాజ్యం యొక్క రాజధాని. రాణీ రత్నప్రభ ఏలుబడిలో ఆ రాజ్యముంది. నగర వీథులలో
మేము నడుస్తుంటే, ఆమె చంద్రకీర్తిని చూసి మోహించింది. ఆమె అతనిని వివాహమాడి రాజ్యం అతనికి కట్టబెట్టింది. మరొక నలుగురు చెల్లెళ్లను కూడా అతనికిచ్చి పెళ్లి చేసింది.
చంద్రకీర్తితో కొన్నాళ్లు నేను రాజమందిరంలో నివసించాను. నన్నతడు తన వలెనే రాజవంశానికి చెందిన యువతిని వివాహమాడి, తనతో పాటు రాజమందిరంలో నివసించమన్నాడు.
ముందుగానే మీ అందరికి విన్నవించాను. నా తల్లిదండ్రులు బౌద్ధమతాన్ని అభిమానించిన ఉపాసకులు. నన్ను జీవక కుమార – బచ్చ (భృత్య) మహా వైద్యుని చేసి సంఘ సేవకు సమర్పించదలచారు. అందుచేత, కొద్ది దినాలలో చంపావతికి సమీపాన, నదీ తటాన కొండపై నున్న వోణ విహారానికి వెళ్ళిపోయాను. మీ అందరికీ తెలుసు – మౌర్యా శోక చక్రవర్తి తన పుత్రుడు మహేంద్రుడిని, పుత్రిక సంఘ మిత్రను సీహళ ద్వీపానికి పంపి, బోధి వృక్షాన్ని నాటి, రునవేలిస్తూపాన్ని నిర్మాణం చేయించారు. ఆ విధంగా సువర్ణభూమికి శోణుడిని, ఉత్తరుడిని ఆ చక్రవర్తి పంపించారు. శోణుడు చంపావతీ సమీపాన్న కొండపై స్తూపమొకటి, సంఘారామమొకటి నిర్మించాడు. సంఘారామం ఆచార్య శీలవ్రతి పర్యవేక్షణలో ఉంది. ఆచార్యులు నన్ను భిక్షువుగా స్వీకరించి, సంఘం యొక్క ఆరోగ్య పరిరక్షణకు వెంటనే నియోగించారు. అచట ఒక సంవత్సరం ఉన్న తరువాత ఆంధ్రాపథం పైన, కళింగదేశంపైన మనసు పోయింది. చంద్రకీర్తి సహాయంతో మరికొద్ది నెలలోనే సముద్రయానానికి అవకాశం లభించింది. తీవ్రమైన గాలివానలో నౌక ప్రమాదానికి గురి అవబోయే సమయంలో, దానిలో ప్రయాణం చేస్తున్న బ్రాహ్మణులు, నాస్తికుడైన శ్రమణుడే ఈ ఉపద్రవానికి కారణమని, నన్ను సముద్రంలో విడిచి పెట్టమని మహానావికుడిని ఆదేశించారు. తరువాత కథ మీ అందరికీ తెలిసినదే”.
సభ చాల ప్రశాంతంగా ఉంది. ఎవరూ ప్రశ్నలు వేయలేదు. సభికులు సమ్మోహితులై శ్రమణుడి వృత్తాంతం వింటూ కాలం సంగతే మరచిపోయారు. శ్రమణుడి కథనం ముగిసింది. అపరాహ్నం దాటిపోయింది. మహారాజు సభికుల వంక చూశాడు.
మంత్రబద్ధ నాగరాజులవలె వారిలో చైతన్యం లేదు. ఎవరో మహా పురుషుడి దివ్యభాషణ చేత పరవశులైనట్లు ఆనంద సంకలితమైన ముఖాలతో వాళ్లు కనిపించారు.
ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తూ మహారాజుగారి గురువులు సంఘమిత్రలు ఒక విషయం అడిగాడు.
“శ్రమణా! నిన్ను భిక్షువుగా స్వీకరించిన ఆచార్య శీలవ్రతి థేరవాద సంప్రదాయానికి చెందినవారని భావిస్తాను”.
“అవును – వారు హీనయానానికి చెందిన థేరవాదులు”. అన్నాడు శ్రమణుడు.
అపుడు సంఘమిత్రుల చూపులు, మహారాజు జేట్ఠతిస్సుని చూపులు ఒక క్షణం కలుసుకున్నాయి.
నాటికి సభ ముగిసింది.
గ్రీష్మకాలావసానవేళ దూరం నుండి ఉరుములు వినిపించాయి. వాయువులో సంచలనం కలిగింది. సభికులు గృహాలు చేరకముందే వర్షం మొదలయింది.
(సశేషం)
ఘండికోట బ్రహ్మాజీరావు గారు సుప్రసిద్ధ సాహితీవేత్త. పలు కథలు, అనేక నవలలు రచించారు. ‘శ్రామిక శకటం’, ‘ప్రతిమ’, ‘విజయవాడ జంక్షన్’, ‘ఒక దీపం వెలిగింది’ వారి ప్రసిద్ధ నవలలు. శ్రీమత్ సుందరకాండ-సౌందర్య దర్శనం, వేయిన్నొక్క రాత్రులు (అనువాదం) వారి ఇతర రచనలు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™