ఈ వారం మరో లఘు చిత్రం. దీని గురించి వ్రాసే ముందు నా రెండు జ్ఞాపకాలను పంచుకోవాలనుకుంటున్నాను. ఒకటి రవీంద్రనాథ్ ఠాకుర్. అతని బాల్యం ఇంట్లోనే గడిచింది. చదువు చెప్పడానికి పంతులు వచ్చేవారు. ఎక్కువగా ఏకాంతంగా వుండే వాడు. ఏదో వొకటి సృజనాత్మకంగా చేసేవాడు. చుట్టూ ఉన్న వాటినే ఎవేవో ఆట వస్తువులుగా ఊహించుకుని, ఆటలు సృజించి ఆడుకునేవాడు. అలాగే అతనికి చొక్కాకి బోల్డన్ని జేబులు కావాలని చెప్పి కుట్టించుకునేవాడు. అతని బాల్యం గురించి చదువుతుంటే మనం కూడా పసివాళ్ళమైపోతాం. ఇక రెండోది. ఒక గుజరాతీ పిల్లల పాట వుంది : “దాదాజీ నో డంగోరో లీధో”. ఆ పాటలో ఏముంటుంది అంటే వొక బాలుడు తాతయ్య చేతికర్రను తీసుకుని, దాన్ని తన కాళ్ళ మధ్య పెట్టుకుని గుర్రం లా భావిస్తూ వెళ్తుంటాడు. రాజు వెడలే లో లాగా ఆ ప్రహసనం వర్ణన. అందంగా వుంటుంది. మామూలు ఆట వస్తువులతో ఆడుకోవడానికి అవకాశమివ్వని పిల్లలు మర బొమ్మలతోనే ఆడుకుంటారు. అందులో తృప్తి ఎక్కడ?
ఈ చిత్రం 1964 లో తీశాడట సత్యజిత్ రాయ్. ఆంగ్లం లో ఒక లఘు చిత్రం టీవీ కోసం తీసిపెట్టమని ‘ESSO World Theater’ అడిగిందట. రాయ్ ఒక అడుగు ముందుకేసి అసలు మాటలే లేని ఈ చిత్రం తీశాడు. టీవీ కోసం తీశాడు కాబట్టి 16mm లో తీశాడు. అతని ఇంట్లో గాలించి వెతికి పట్టి వాటికి పునరుజ్జీవం పోసి Academy Film Archive లో భద్రపరచబట్టి మనకు ఇది ఇప్పుడు అందుబాటులో వుంది. దీనికి మనం Austrian Film Museum కి మరియు Academy Film Archive కు సదా కృతజ్ఞులం.
ఆ పెద్ద బంగళాలో ఆ అబ్బాయి ఒంటరి. తనను వదిలి కుటుంబ సభ్యులు కారులో ఎక్కడికో వెళ్ళారు. ఏమీ తోచని ఆ అబ్బాయి కాసేపు అగ్గిపుల్లలు గీసి ఆర్పుతూ ఆ వాసన చూస్తాడు, ఇంకో పుల్ల వెలిగించి గాలి ఊదిన బూర (balloon) కి అంటించి పగలగొడతాడు. కాసేపు కొమ్ములుండే టోపీ వేసుకుని, భుజాన కత్తి కరవాలం లాంటి ఆయుధం ఆటబొమ్మని తగలించుకుని ఇటు నుంచి అటు అటు నుంచి ఇటూ తిరుగుతుంటాడు. ఇంతలో పక్కనే వున్న గుడిసె దగ్గర్నించి వో వేణునాదం వినిపిస్తుంది. వెళ్ళి కిటికీలోంచి చూస్తాడు. వో మాసిన బట్టల్లో వున్న బీద బాలుడు వెణువు చక్కగా ఊదుతుంటాడు. పిల్లల మధ్య స్నేహం తో పాటే నేనంటే నేను గొప్ప అనేలాంటి తగవు కూడా వుంటుంది. ఈ రెండూ చెప్పకుండానే చెబుతుంది ఈ చిత్రం. బంగళాలో పిల్లాడు తన దగ్గర వున్న యాంత్రిక పరికరం (వెణువు లాంటి) తో వాయిస్తాడు. ఆ బీద పిల్లవాడు, తల వేలాడేసుకుని గుడిసెలోకెళ్ళి ఈ సారి డ్రంస్ తో వస్తాడు. మళ్ళీ బంగళా అబ్బాయి మర ఆట బొమ్మ, కీ ఇస్తే డ్రంస్ ను వాయించే కోతి బొమ్మ, తీసుకెళ్ళి కిటికీ దగ్గర నుంచి చూపిస్తాడు. అలా ఇద్దరి మధ్యా జుగల్బందీ సాగుతుంది. చివరికి ఆ బీద పిల్ల వాడు గాలిపటం ఎగరేస్తుంటాడు. మరి మర గాలిపటాలుండవుగా. ఉక్రోషంతో బంగళా అబ్బాయి కేట్బాల్ (catapult) తో ఆ గాలిపటాన్ని కొట్టాలని చూస్తాడు. కుదరదు. అతని దృష్టి వో నిజం గన్ను మీద పడుతుంది. దాన్ని లోడ్ చేసి గాలిపటాన్ని గురిచూసి పేలుస్తాడు. మొదటి దెబ్బకే ఆ గాలిపటం చినిగిపోయి నేలకు వొరుగుతుంది. ఆ బీద పిల్లవాడి ముఖం పాలిపోతుంది. విజయ గర్వంతో బంగళా అబ్బాయి లోపలికెళ్ళి మర బొమ్మలతో ఆడుకుంటాడు. అయితే తన మర బొమ్మ నుంచి ఆ అబ్బాయి మోగించిన వేణు నాదం వినబడి ఆ అబ్బాయి విస్తుపోతాడు. ఆ శబ్దం అతన్ని హాంట్ చేస్తుంది.
ఇది వొక పిల్లల సినెమాగా చూస్తే నచ్చుతుంది. యాంత్రిక లోకం, ప్రాకృతిక ప్రపంచం, పిల్లల మధ్య కలిగే స్నేహం, అసూయ, శత్రుత్వం, గొప్ప అనిపించుకోవడం, పోటీ అన్నీ కనిపిస్తాయి. కాని ఇది తీసిన సంవత్సరం 1964. 1955 నుంచీ వియెత్నాం యుధ్ధం నడుస్తూ వుంది. యుధ్ధ ఆయుధాలు వున్న అమెరికా చివరికి వియేత్నాం తో ఓడిపోవాల్సిందే అని నర్మగర్భంగా చెప్పడానికి బంగళా అబ్బాయిని అమెరికాగా, గుడిసె అబ్బాయిని వియేత్నాం గా మానవీకరణ చేశాడని చెప్తారు.
పన్నెండు నిముషాల ఈ చిత్రం చూసిన అనుభూతి మాత్రం జ్ఞాపకం నుంచి చెదిరిపోదు. పిల్లలిద్దరూ బాగా చేశారు. సౌమేందు రాయ్ కెమెరా పనితనం, సత్యజిత్ రాయ్ సంగీతమూ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఆ ఫ్లూట్. ఇదివరకు చూసి వుండక పోతే తప్పకుండా చూడండి ఈ Two.
సాహిత్యం, సినిమా రెండు ప్రాణాలు అయినా ప్రతి art form ని ఇష్టపడే పరేష్ ఎన్. దోషి బహుమతులు పొందిన కథలు వ్రాశారు. కవిత్వం రాశారు. ప్రస్తుతం సారంగలో “చిన్న మాట! ఒక చిన్న మాట!!” వ్రాస్తున్నారు.
chalaa chakkati visleshana
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™